సాధారణంగా పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులను వారసత్వంగా తీసుకుంటారు. కానీ వారి ఆశయాలకు వారసత్వంగా తీసుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో ఆర్మూర్‌కు చెందిన సునీత ఒకరు. వృద్ధులకు చేయూతనిచ్చేందుకు తండ్రి ఏర్పాటు చేసిన ‘లాలన’ను ఆ కూతురు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆశ్రమంలో ప్రశాంతంగా గడుపుతున్న 42 మంది వృద్ధులకు అమ్మగా మారి వారిని అక్కున చేర్చుకున్నారు. వారి కడుపు నింపడంతో పాటు మలిదశలో వారు కోరుకునే ప్రేమను కూడా పంచుతూ ఆదరిస్తున్న ఆమె పరిచయం మానవి పాఠకులకు ప్రత్యేకం…
నేను పుట్టి పెరిగింది నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో. అమ్మ సుశీల, నాన్న రాజారెడ్డి. మేము ముగ్గురం పిల్లలం. అక్క, నేను, తమ్ముడు. నాన్నకు మొదటి నుండి సేవా గుణం ఎక్కువ. ఎందుకంటే చిన్నతనంలో తను చదువుకోవడానికి చాలా కష్టపడ్డారు. సాయం చేసే వాళ్లు లేక ఎన్నో కష్టాలు పడ్డారు. కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి తనకు చేతనైన సాయం చేసేవారు. నా చిన్నతనంలో మా ఇంట్లో ఒక బెడ్‌రూం ఉండేది. దాన్ని మేము తాతమ్మల రూం అనే వాళ్లం. ఎందుకంటే చిన్నాన్న అమ్మలు, మా అమ్మమ్మ, నానమ్మలు, నాన్నగారి మేనత్తలు ఎవరైనా ఇంటికి వస్తే ఆ రూంలోనే ఉండేవారు. అలా మొదటి నుండి మా ఇంట్లో పెద్ద వాళ్లకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.
సంతోషంగా ఒప్పుకున్నాం
మా అమ్మ 2002లో తన 58 ఏండ్ల వయసులో కాన్సర్‌తో చనిపోయింది. మేమెవ్వరం ఊహించని సంఘటన ఇది. వ్యాధి గురించి తెలిసిన తర్వాత నాలుగు నెలలు మాత్రమే బతికింది. నాన్నను ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక అప్పటి నుండి నేను నాన్న దగ్గరే ఉంటున్నాను. అమ్మ చనిపోయిన తర్వాత నాన్నకు పెద్ద వాళ్ల కోసం ఓ ఆశ్రమం కట్టాలనే ఆలోచన వచ్చింది. వెంటనే మాతో చెప్పారు. మేమూ సంతోషంగా ఒప్పుకున్నాం. తన ఆస్తిలోని కొంత భాగాన్ని, అలాగే అమ్మ ఆస్తి మొత్తాన్ని తీసేసి అంకాపూర్‌లో ఆశ్రమం కోసం బిల్డింగ్ ప్రారంభించారు. దీనికి ‘లాలన’ అని పేరుపెట్టారు. 2008లో దీన్ని ప్రారంభించారు. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అవసరమున్న వాళ్లను ఇందులో చేర్చుకునేవాళ్లు. ఎవరైనా సరే 60 ఏండ్లు నిండి ఉంటే చాలు.
ఇది నా బాధ్యత
అమ్మ పోయిన తర్వాత నేను నాన్నతో కలిసి ఆశ్రమంలోనే ఉంటున్నాను. కష్టంలో ఉన్న ఎంతో మంది సాయం కోసం నాన్న దగ్గరకు వచ్చేవారు. ఎవరు వచ్చినా కాదనకుండా సాయం చేస్తారు. అది చూసి నాకు కూడా సమాజం కోసం సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. ఆశ్రమం కోసం కావల్సిన డబ్బును నాన్నే ఏర్పాటు చేశారు. కేవలం దగ్గరుండి చూసుకోవడమే నా బాధ్యత. ఈ ఆశ్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడపాలనేది నాన్న కోరిక. కాబట్టి ఆయన బిడ్డగా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం నా బాధ్యత. మా అక్క కూడా దీనికి ట్రస్టీగా ఉంది. తమ్ముడు మాత్రం తన బిజినెస్ పనుల వల్ల తగిన సమయం కేటాయించలేక రిజైన్ చేశాడు. నా పిల్లలు ఇద్దరు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. నా మనవళ్లు, మనవరాళ్లు సెలవులకు ఇక్కడకు వస్తుంటారు. తిరిగి వెళ్లడానికి అస్సలు ఇష్టపడరు. ఇక్కడే ఉంటామంటారు. మా మేనత్తలు అమృతలత, విజయ, చిన్నవ్వ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏ సందేహం వచ్చినా వాళ్లనే అడుగుతాను.
కాస్త ప్రేమ పంచితే చాలు
ఈ ట్రస్ట్ నుండి వచ్చిన వడ్డీ డబ్బుకి తోడు నాన్న తన సొంత డబ్బుతో చక్రాన్‌పల్లిలోని ప్రభుత్వ స్కూల్ కోసం బిల్డింగ్ కట్టించారు. అది కట్టించేటప్పుడే లంగ్ కాన్సర్ వచ్చింది. ఎలాగైనా ఆ బిల్డింగ్ పూర్తి చేయాలని చాలా తపించారు. బెడ్‌పై ఉండి కూడా ఏర్పాట్లు చూశారు. మొత్తానికి బిల్డింగ్ ప్రారంభించే వరకు బతికారు. ఆయన కోరిక తీరిన తర్వాత చనిపోయారు. ఆశ్రమంలో ఉన్నవాళ్లందరూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే నేను నేటి పిల్లలకు చెప్పేది ఒక్కటే.. ముందు మీ తల్లిదండ్రులను చూసుకోండి. వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వండి. వాళ్లను చూసుకోవలసిన బాధ్యత పిల్లలకు ఉంది. ఇక మా వల్ల కాదు అనుకుంటూనే ఇక్కడ ఉంచమని చెబుతాం. ఈ వయసులో వీళ్లకు కావల్సింది కాస్త ప్రేమగా మాట్లాడడం. తిన్నావా అని పలకరిస్తే చాలా సంతోషిస్తారు.
ఉన్నత విద్య కోసం…
నాన్న చేసిన ఇంకో మంచి పని పేద పిల్లల ఉన్నత విద్య కోసం యాభై లక్షలు డిపాజిట్ చేశారు. ఆ డబ్బుతో మేము ఇంజనీరింగ్ చదివే పిల్లలకు ఏడాదికి 25 వేలు ఇస్తాము. అన్నీ సబ్జెక్ట్స్‌లో పాస్ అయితే రెండో ఏడాదికి మరో పాతికవేలు.. ఇలా నాలుగేండ్లకు లక్షరూపాయలు ఇస్తాం. ఈ డబ్బును వాళ్లు ఉద్యోగం వచ్చిన తర్వాత వీలును బట్టి తిరిగి ఇవ్వాలి. దీనికి మేము ఎలాంటి వడ్డీ తీసుకోము. ఇప్పటి వరకు 150 మందికి ఇలా ఎడ్యుకేషన్ కోసం సాయం చేశాం. వంద మంది వరకు తిరిగి ఇచ్చారు. వాళ్లు తిరిగి ఇచ్చిన డబ్బు మరొకరికి సాయం చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే పిల్లలకు బాధ్యత కూడా తెలుస్తుంది. అందుకే ఇలాంటి ఏర్పాటు చేశాము.
ఆర్థిక ఇబ్బంది లేకుండా…
2024 ఆగస్టులో నాన్న చనిపోయారు. అప్పటి వరకు నాన్న ట్రస్టీగా ఉండేవారు. ఆ తర్వాత నేను చైర్మన్‌గా ఉన్నాను. నాన్న వీలునామా రాసేటపుడు తన ఆస్తిలో ముగ్గురు పిల్లలతో పాటు ట్రస్ట్‌కు కూడా సమానంగా నాలుగో భాగం రాసి పెట్టారు. అందువల్ల భవిష్యత్తులో కూడా ఈ ఆశ్రమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నడపగలం. డబ్బు కోసం వెదుక్కోకుండా నాన్న ఈ విధమైన ఏర్పాటు చేశారు. కొత్తలో నేను నాన్నతో ‘ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకొని నడిపించవచ్చుకదా’ అనేదాన్ని. దానికి ఆయన ‘ఇతరులు ఇచ్చే ఫండ్స్‌పై ఆధారపడితే డబ్బు లేనప్పుడు నడపడం కష్టమవుతుంది. దీనికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావొద్దు, అందుకే ఇలా చేస్తున్నాను’ అనేవారు. అందుకే నాన్న కోరిక మేరకు ఇప్పటికీ మేము ప్రత్యేకంగా ఎవరినీ ఫండ్స్ అడగం. వాళ్లంతట వాళ్లు ఎవరైనా ఇస్తే తప్ప తీసుకోము. ఇక్కడ ఉంటున్న వాళ్లకు భోజనం, రూం, సబ్బులు, నూనెలు వంటివి అన్నీ ఫ్రీగానే ఇస్తాము. ఈ బిల్డింగ్‌లో 60 మంది వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం 42 మంది ఉన్నారు. వాళ్ల పనులు వాళ్లు చేసుకునే వరకు మేము చూసుకుంటాం. కదలేని స్థితిలో మాత్రం ఇక్కడ చూసే పరిస్థితి లేదు. అప్పుడు మాత్రం తీసుకెళ్లాలని ముందే చెప్తాము.
– సలీమా


