పది నెలల్లో ఎనిమిది యుద్ధాలు ఆపా
‘సుంకాల’ హెచ్చరికలే దానికి కారణం
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్ స్కోత్కర్ష
బైడెన్ సహా గత పాలకుల వైఫల్యాలపై విమర్శలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తనను తాను ప్రశంసించుకున్నారు. పది నెలల కాలంలో ఎనిమిది యుద్ధాలు ఆపానని గొప్పలు చెప్పారు. ఈ విజయానికి సుంకాలే కారణమని అన్నారు. ఆంగ్ల భాషలో ‘సుంకాలు’ అనేది తనకు ఎంతో ఇష్టమైన పదమని వ్యాఖ్యానించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై ధ్వజమెత్తుతూ ఆయన అధ్యక్ష భవనాన్ని వదిలి వెళ్లేటప్పుడు పరిస్థితి అంతా గందరగోళంగా ఉన్నదని తెలిపారు. ‘నేను అమెరికా శక్తిని పునరుద్ధరించాను. పది నెలల కాలంలో ఎనిమిది యుద్ధాలను పరిష్కరించాను. ఇరాన్ అణు ముప్పును నాశనం చేశాను. గాజాలో యుద్ధాన్ని ఆపాను. మూడు వేల సంవత్సరాలలో మొదటిసారి మధ్యప్రాచ్యంలో శాంతిని సాధించాను. బందీలను విడుదల చేయించాను. సజీవంగా ఉన్న వారిని రప్పించాను. చనిపోయిన వారి మృతదేహాలను తెప్పించాను’ అని జాతినుద్దేశించి బుధవారం చేసిన ప్రసంగంలో ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రభుత్వ 2026వ సంవత్సరపు ఎజెండాను ప్రజల ముందు ఉంచారు.
వైఫల్యాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం
ఒకవైపు తన రేటింగ్ పడిపోతున్నా, మరోవైపు తన వాణిజ్య విధానాలు ధరలను పెంచేస్తున్నా ట్రంప్ తన ప్రసంగంలో ద్రవ్యోల్బణాన్ని పక్కనపెట్టి సుంకాలను ప్రస్తావించారు. ‘సుంకాల కారణంగా ఎవరూ ఊహించనంత డబ్బు వచ్చింది. సుంకాల బిల్లు మాకు ఎంతో సాయపడింది’ అని అంటూ ఈ సంవత్సరం ప్రారంభంలో ఆమోదించిన జీఓపీ యొక్క పన్ను కోతల బిల్లును ప్రస్తావించారు. బైడెన్, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ల పదవీకాలంలో ద్రవ్యోల్బణం బాగా పెరిగిందంటూ ప్రచారం చేసి రెండోసారి అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్న ట్రంప్…ఇప్పుడు దేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని ప్రజలను నమ్మిం చడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ తీరుపై రెండు రోజుల క్రితం రాయిటర్స్, ఇప్సోస్ నిర్వహించిన పోల్‌లో కేవలం 33 శాతం మంది పెద్దలు మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ప్రస్తుతం దేశంలో నిత్యావసరాల ధరలు తగ్గు ముఖం పట్టాయని చెబుతూ ట్రంప్ తన ప్రసం గంలో పలు ఉదాహరణలను ఉటంకించారు.
గుర్తింపు రావడం లేదని ఆవేదన
దేశ ఆర్థిక పరిస్థితిపై ట్రంప్ తన ప్రసంగంలో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దానికి బదులుగా ఆయన బైడెన్‌ను, అంతకుముందు డెమొక్రాట్ల పాలనను విమర్శించడానికే పరిమితమయ్యారు. తాను ఎన్ని యుద్ధాలు ఆపినా, ఎన్ని విజయాలు సాధించినా అందుకు తగిన గుర్తింపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్-పాకిస్తాన్ మధ్య మేలో జరిగిన ఘర్షణను ఆపి కాల్పుల విరమణను అమలు చేయడం కోసం సుంకాలను అస్త్రంగా ప్రయోగించానని, వాణిజ్య విధానాన్ని ఉపయోగించానని ట్రంప్ ఇప్పటికే అనేక పర్యాయాలు చెప్పారు. ఈ వాదనను భారత్ పదే పదే తోసిపుచ్చినా ఆయన అదే పాట పాడుతూ వచ్చారు.
వారందరూ విఫలమయ్యారట
ట్రంప్ తన ప్రసంగంలో కేవలం బైడెన్‌ను విమర్శించడమే కాకుండా గతంలో అమెరికాను పరిపాలించిన అధ్యక్షుల ఫొటోలను ప్రదర్శిస్తూ, వారి వైఫల్యాలను ఏకరువు పెడుతూ ఫలకాలను ప్రదర్శించారు. ట్రంప్ ప్రస్తావించిన వారిలో బరాక్ ఒబామా కూడా ఉన్నారు. ట్రంప్ ప్రసంగంలో కొన్ని కీలక ప్రకటనలు కూడా ఉన్నాయి. క్రిస్మస్ పండుగ రాబోతున్న సందర్భంగా… అమెరికా సైనిక దళాలలో పనిచేసిన 14 లక్షల మందికి 1,776 డాలర్లు పంపుతున్నానని ఆయన ప్రకటించారు. దీనిని ఆయన ‘యోధుల డివిడెండ్’గా అభివర్ణించారు. సుంకాల ద్వారా వచ్చిన ఆదాయం నుంచే ఈ సొమ్మును పంచుతున్నానని అంటూ టారిఫ్ విధానాలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ‘మన సైన్యం కంటే వేరెవరూ దీనికి అర్హులు కారు. వారికి నా అభినందనలు’ అని అన్నారు.
వెనిజులా పేరెత్తలేదు
ట్రంప్ తన ప్రసంగంలో వెనిజులాను ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆ దేశంపై సైనిక చర్యను ప్రకటిస్తారని, లేకుంటే భవిష్యత్తులో యుద్ధం జరగవచ్చునని చెబుతారని అందరూ అనుకున్నారు. అయితే ట్రంప్ వెనిజులాతో నెలకొన్న సంక్షోభాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.
వలసదారులపై ఆక్రోశం
శ్వేతసౌధం నుంచి చేసిన 19 నిమిషాల ప్రసంగంలో ట్రంప్ తన విజయాలను ఏకరువు పెడుతూ మాజీ అధ్యక్షుడు బైడెన్‌పై నిప్పులు చెరిగారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపానని చెప్పారు. ‘అక్రమ వలసదారులు అమెరికా ఉద్యోగాలను దొంగిలించారు. పన్ను చెల్లింపుదారులు మీ కోసం ఇచ్చిన డబ్బులతో ఉచిత ఆరోగ్య సేవలను, విద్యను పొందారు. పోలీసు సిబ్బంది ఖర్చును కూడా పెంచారు’ అని మండిపడ్డారు. అయితే వలసదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో ఊతమిచ్చారని, వ్యవసాయం, నిర్మాణం వంటి కీలక రంగాలను బలోపేతం చేశారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
2023లో వలసదారులు పన్నుల రూపంలో 651 బిలియన్ డాలర్లకుపైగా చెల్లించారని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ విశ్లేషణ తెలిపింది. ట్రంప్ మొదటి, ప్రస్తుత భార్యలు కూడా తూర్పు యూరప్ నుంచి వలస వచ్చిన వారే. సోమాలియా సమాజాన్ని ఇటీవల చెత్త కుప్పగా అభివర్ణించిన ట్రంప్ తన ప్రసంగంలో సోమాలీలపై మండిపడుతూ వారు మిన్నెసోటా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని, అనేక బిలియన్ డాలర్లను దొంగిలించారని ఆరోపించారు. దక్షిణ సరిహద్దు నుంచి వస్తున్న వలసలను పూర్తిగా అరికట్టానని, ఇప్పుడది దేశ చరిత్రలోనే బలమైన సరిహద్దుగా మారిందని అన్నారు.



