Sunday, June 8, 2025
E-PAPER
Homeమానవినా జీవిత‌మే నాకు స్పూర్తి

నా జీవిత‌మే నాకు స్పూర్తి

- Advertisement -

కొత్తగా సినీ పరిశ్రమలోకి వచ్చిన వారికి ఎన్నో కోరికలు ఉంటాయి. మంచి అవకాశాలు రావాలని కలలు కంటుంటారు. కొందరైతే రాత్రికి రాత్రే స్టార్స్‌ అయిపోవాలని భావిస్తారు. అనుకున్నది జరక్కపోతే ఢలాీ పడిపోతుంటారు. అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోతుంటారు. కానీ స్వప్న చౌదరి అలా కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోస్తూ తన కలలను నిజం చేసుకుంటున్నారు. ఓ యాంకర్‌గా, ఓ నటిగా ముందుకు సాగుతున్న ఆమెతో మానవి సంభాషణ …
మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి?
నేను పుట్టింది, పెరిగింది ఖమ్మం. చిన్ననాటి నుంచే చదువుతో పాటు ఏదో కొత్తగా చేయాలని, సాధించాలనే కలలు కూడా నన్ను వెంటాడేవి. ఎంబీఏ పూర్తి చేసి నా కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్‌కి వచ్చాను. అక్కడే నా ప్రస్థానం మొదలైంది.
యాంకర్‌గా అవకాశం ఎలా వచ్చింది?
చిన్నప్పటి నుండే స్టేజ్‌పై మాట్లాడటం మొదలుపెట్టాను. స్టేజ్‌ ఫియర్‌ లేకుండా మాట్లాడడంతో మొదట్లో చిన్న చిన్న కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది. మెల్లమెల్లగా పెద్ద ఈవెంట్లకు యాంకరింగ్‌ చేసే స్థాయికి వచ్చాను. ఇప్పటి వరకూ సుమారు రెండు వేలకుపైగా కార్యక్రమాలకు యాంకరింగ్‌ చేశాను. రెండు టీవీ చానల్స్‌లో కూడా పని చేశాను. పలు టీవీ షోలకు హోస్ట్‌గా చేశాను.
మీ నటనా ప్రస్థానం ఎలా ప్రారంభమైంది?
ఈవెంట్లలో పాల్గొనేటపుడే నటనపై ఆసక్తి పెరిగింది. ‘నమస్తే సేట్‌జీ’ సినిమాలో హీరోయిన్‌గా తొలి అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నటించిన తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా డైరెక్టర్‌, హీరో నా ఫ్రెండ్‌ తల్లాడ సాయికృష్ణ. అతను నా బెస్ట్‌ ఫ్రెండ్‌. నాకున్న బలం నా ఫ్రెండ్స్‌ సాయి, శోభన్‌, సతీష్‌ అన్న, వినోద్‌ అన్న, శబరి మహి సార్‌, సుధాకర్‌ బ్రో, దాస్‌ బాబాయి, కృష్ణ, గణేష్‌ భారీ. వీళ్లు కాక జబర్దస్త్‌ సత్య, అమ్ము, స్వాతి, రోజా, స్యాండి, శ్రీవాణి… వీరంతా ఈ రంగంలో నాకు సలహాలు సూచనలు, మంచీ చెడు చెబుతుంటారు. మా బాబారు నాకు రోల్‌ మోడల్‌.
ఇటీవల ‘మిస్టరీ’ సినిమాలో నటించారు. ఇందులో మీ పాత్ర గురించి చెప్పండి?
‘మిస్టరీ’ సినిమాలో నేను ఐదు విభిన్న పాత్రల్లో నటించాను. మరీ ముఖ్యంగా నాకు ఇది ప్రయోగాత్మకమైన తొలి సినిమా. ఒక్కో పాత్రకి ఒక్కో ప్రత్యేకత ఉండడం వల్ల మిస్టరీ ద్వారా చాలానే నేర్చుకున్నానని చెప్పాలి.
చాలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకున్నారని విన్నాము, మరి ఇబ్బందిగా లేదా?
ఇబ్బంది ఏమీ లేదు. నాకు ఊహ వచ్చినప్పటి నుంచే కుటుంబ బాధ్యతలు తీసుకున్నాను. మా నాన్న ఆరోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడేవారు. వారి హాస్పిటల్‌ చెకప్‌లు, ఇంటి ఖర్చులు, స్నేహితులకు సాయం చేయడం అన్నింటినీ నేనే చూసేదాన్ని. జీవితంలో ఏం జరిగినా ఎదుర్కొనే ధైర్యం అక్కడి నుంచే వచ్చింది.
హైదరాబాద్‌లో మీ ప్రస్థానం ఎలా సాగుతోంది?
హైదరాబాద్‌ నా కలల నగరం. ఇక్కడే యాంకర్‌గా, ఫిల్మ్‌ ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు హీరోయిన్‌గా ఎదుగుతున్నాను. ప్రతి రోజు ఒక కొత్త అవకాశం ఇస్తుంది, కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రసాద్‌ ల్యాబ్‌, ఫిల్మ్‌ ఛాంబర్‌లో వందల సినిమా ఫంక్షన్లకి హోస్ట్‌గా చేశాను. ఇవన్నీ నేను మర్చిపోలేని అనుభూతులే. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్‌ వచ్చిన తర్వాతనే చాలా నేర్చుకునే అవకాశం వచ్చింది. నన్ను నేను నిరూపించుకోగలను అనే నమ్మకం వచ్చింది.
మీకు బిగ్‌బాస్‌కి వెళ్లాలన్న కోరిక ఉందని విన్నాము, నిజమేనా?
అవును, బిగ్‌బాస్‌లో పాల్గొనాలన్న కోరిక ఉంది. కానీ కొంతమంది ఆ పేరుతో మోసం చేయడానికి ప్రయత్నించారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి అనుభవాలు కూడా జీవితం నేర్పిన పాఠాలే.
ఇప్పటి వరకు మీకు ఎదురైన ప్రధాన సవాళ్లు ఏవైనా..?
ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వచ్చి కెరీర్‌ మొదలుపెట్టడం, కుటుంబ బాధ్యతలు మోస్తూ అవకాశాల కోసం పోరాడటం అన్నీ పెద్ద సవాళ్లే. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాను.
పరిశ్రమలో మిమ్మల్ని ప్రోత్సహించేవారు..?
చంద్రబోస్‌ గారు… ఆయన నన్ను సొంత కూతురిలా చూస్తారు. ఆయనకి ఆస్కార్‌ వచ్చిన తర్వాత వారి ఊర్లో జరిగిన సన్మాన కార్యక్రమానికి యాంకరింగ్‌ నేనే చేశాను. ఆ రోజు నుంచి ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన నాకు మంచి మార్గదర్శకుడు. అలాగే తుమ్మలపల్లి గారు కూడా నాకు ఎంతో ప్రేరణ కలిగించిన వ్యక్తి. ఆయన మాటలు, మార్గనిర్దేశం నాకు అవసరమైన సమయంలో మంచి బలాన్ని ఇచ్చాయి.
మీరు స్ఫూర్తిగా భావించే విషయాలు ఏవైనా?
నా జీవితాన్ని చూసి ఇంకొంతమంది యువతులు స్ఫూర్తి పొందాలని ఆశ. కుటుంబ బాధ్యతల్ని మోస్తూ కలల్ని వీడకుండా ముందుకు వెళ్లే యువతిగా నేను నిలబడాలని కోరుకుంటున్నాను. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అవార్డ్‌ రావడం, దుబాయ్, శ్రీలంకలో ఈవెంట్స్‌ చేయడం కూడా నా కెరీర్‌లో ప్రత్యేక ఘట్టాలు.
మీ భవిష్యత్‌ లక్ష్యం ఏమిటి?
ఇంకా మంచి కథలు, డిఫరెంట్‌ పాత్రలు చేయాలి. నటిగా ఎదగాలి. అవసరమైన వారికి సహాయం చేయాలి. ప్రేక్షకుల గుండెల్లో మంచి నటిగా నిలవాలన్నదే నా కల.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -