ఉదయం నుండి సాయత్రం వరకూ బిజీగా గడిపిన నాకు రోజూలాగే ఈ రాత్రి కూడా నా డైరీని గుర్తు చేసింది. కళ్ళు మూతలు పడుతున్నాబద్దకంగా సరుగులో ఉన్న డైరీని తీసి ఏమి వ్రాయాలి ఈ రోజు? అనుకుంటూ ఉండగానే మనసుకు తగిలిన గాయం ఈ రోజూ గుర్తుకు వచ్చింది. మనసుని అద్దం అనుకుని భావాలని అక్షరాలుగా స్వీయానుభవాలను నెమరువేసుకునే దినచర్యను యధావిధంగా నూరు శాతం నిజాల్ని నిక్షిప్తం చేసుకోవడం ఇష్టం చాలా..
మానసికంగా సంతోషాలను, బాధలను, కోపాన్ని,అసహనాన్ని, ఎవరితోనూ చెప్పుకోలేని స్థితిలో సొంతంగా వ్రాసుకోవడమనే అండ కొంత ఊరట కలిగిస్తుంది. మొట్టమొదటిగా ఇంటర్లో ఓ ఇంగ్లీష్ లెసన్లో డైరీ గొప్పదనం తెలుసుకుని పేదరికంతో పాటు, చదువులో వెనుకబాటుతనం, రేపటి కాలాన్ని తలచుకుని భయపడే సందర్భాలు, బంధువుల మధ్య తగాదాలు, వీటి అన్నిటి మధ్య ఏ ఒక్కరు నాకు లేరు, ఈ బాధ నాకు ఒక్కడికే వచ్చింది అనే తెలియని అమాయకపు వయసును కోత పెట్టేవి. అలాంటి రోజులో నాకు నేను సృష్టించుకున్న లోకంలో నాకు గొప్ప స్నేహం నా డైరీ. ఇది అలవాటైన మనసుకు అక్షర రూపంలో ఈ రహస్య సంభాషణ పూర్తిగా వ్యక్తిగతం.
నా అలోచానాక్షరాలుని అందంగా అలంకరించుకుని చదువుకున్నప్పుడు ఆనందం కూడా కలిగేది. దాన్ని ఎవరికి పంచుకునేది కాదు. ఎవరికో కోసమో కాకుండా పూర్తిలో గుండెలో మొలిచి స్వేచ్ఛగా శ్వాసను నింపుకుని పదిలంగా నా వయసుతో పాటు పెరుగుతూ ఎదిగిన ఓ అపురూపమైన మనసు సృష్టించుకున్న స్వీయానుభవ పేటిక. దీని వెనుక స్వార్థం జీవితంలో ఓ జ్ఞాపకం, నేర్చుకున్న పాఠాన్ని భవిష్యత్తులో ఇంకొకరు అడిగేది కాదు. వేరొకరు వచ్చి చదవాలని కాదు. ఇది డిగ్రీ చదివే రోజుల్లో నుండి బాగా అలవాటై,క్రమంగా బలంగా మారి నాకు నేను గొప్ప స్నేహితుడిగా మారాను. మనసు తనకు తను చూసుకోవాలన్నపుడు డైరీని అద్దంగా చూసుకుని పొంగిపోయేది.
ఈ విధంగా జీవితం కొనసాగే రోజుల్లో బ్యాంక్ టెస్ట్ ప్రిపేర్ కోసం హైద్రాబాద్ వచ్చాను. ఓ పల్లెటూరు నుండి వచ్చి ఆ మహానగరంలో నన్ను నేను పోల్చుకుని వణికిపోయాను. నాలో భయాన్ని, వాలకాన్ని గమనించిన మా రూం ఓనరు రవిని పరిచయం చేస్తూ, ఇద్దరికీ ఒకే రూంను షేర్ చేసుకొమ్మని చెప్పడంతో నాకు కొంత అండ, కొద్దిపాటి ధైర్యం వచ్చింది. ఇద్దరం కలసి ఒకే రూములో ఉంటూ అందరూ ఈర్ష్యపడేంత స్నేహంతో ఉన్నాము. ఏ రహస్యం లేనంత దగ్గరిగా మెలిగేవాళ్ళం. అప్పుడప్పుడూ మా ఊరికి తీసికెళ్ళి మా అమ్మ, నాన్న వాళ్ళని పరిచయం కూడా చేశాను. అదే విధంగా రవి కూడా అలాగే చేసేవాడు.
రవికి ఒక చెల్లెలు ఉండేది.పేరు ఊహ. అందానికి అందం, తెలివి, చదువు అన్నీ ఉన్నాయి. ఒక్క పేదరికాన్ని ఏమి చేయలేకుండా పోయేది. ఇంకా ఎన్నో ఊహించని మంచి విషయాలు ఆమెలో చూసి తరచుగా రవి ద్వారా కూడా ఎన్నో ముచ్చటైన మర్యాద పూర్వకమైన విషయాలు తెలుసుకున్నాను. అంతే కాక ఆమెకు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. ఐతే వారికి ఈమెకు ఉన్నంత చురుకుదనం లేదు. ఊహను ముద్దుగా, గొప్పగా చూసుకునే వారు.ఇంట్లో అందరి కన్నా చిన్నదైనా అందరికన్నా గొప్పగా ఆలోచించే శక్తి ఉంది. ఊరిలో, బంధువుల్లో మంచి పేరు సంపాదించుకుంది.
ఈమె ఏ ఇంటికి కోడలిగా వెళ్ళినా ఆ ఇల్లు స్వర్గంగా మారుతుంది అని అందరూ అనుకోవడం విన్నాను. నేనే స్వయంగా చూసాను. ఐతే అప్పటికే ఇద్దరు పెళ్ళిళ్ళు చేసి అప్పులు పాలైన ఊహ తల్లిదండ్రులకి ఊహ పెళ్లి భయంగా మారింది. అదే భయం ఊహను తాకింది.
ఇదిలా ఉండగా ఓ రోజు మా పెదనాన్న గారి అబ్బాయి సురేంద్ర నా వద్దకు వచ్చాడు.నా కంటే వయసులో ఐదేళ్ల పెద్ద.మా గ్రామంలోనే పాలకేంద్రం పెట్టుకుని ఉండేవాడు. గ్రామంలో మంచివాడిలా గుర్తింపు పొందాడు. ఇతరులకు హెల్ప్ చేయడంలో ముందు ఉండేవాడు. ఇంకా తన వత్తికి తోడు ఫాన్సీ షాపు నడిపేవాడు.. దైవభక్తి బంధుప్రీతి, ఉత్తమ అలవాట్లు, ఉత్తమ విలువుల గల వాడిగా గుర్తింపు, గౌరవం ఉంది. అన్నీ ఉన్నా దేవుడు ఏదో లోపాన్ని పెట్టినట్లు పెళ్లి కావడం చాలా కష్టంగా మారింది. కారణం జాతకాల పిచ్చితో పాటు ఏ పిల్ల ఎలా ఉంటుందో ఏది ఎలా ఉంటుందో అనే అనుమానం, భయం, పిరికితనం అన్నీ తోడై ఏ సంబంధం వచ్చినా నచ్చేది కాదు. ఏమి చేయాలో అర్థం అయ్యేది కాదు పెదనాన్నకు. ఎప్పుడూ చూసినా ఇదే గొడవ.
అంతలో నేను రవికి పరిచయం చేశాను. అదే సమయానికి రవి గారు ఊరిలో తిరునాళ్ళ వచ్చే ఆదివారం నుండి జరుగుతున్నాయని మా యిద్దరినీ రమ్మని అడిగాడు. మాట్లాడుతూ వుండగానే రవి ఫోనులో టికెట్స్ బుక్ చేసాడు.
వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ముందు కాకినాడ దిగి అక్కడ నుండి పది కిలోమిటర్లు ఉండే ఓ పల్లె టూరు. బస్ దిగడం తోటే చెరువు కట్ట, పక్కనే శివాలయం, హైస్కూల్ చాలా సుందరంగా అనిపించింది. రవి ఇంటికి తీసుకెళ్ళి సురేంద్రను నా పెద్ద నాన్న గారి అబ్బాయిగా అందరికీ పరిచయం చేయడం జరిగింది. అప్పటికే పక్కింటి గోడపై సన్నజాజి పూల కోసంవెళ్ళిన ఊహ ఆలస్యంగా రావడం, వస్తూనే కొత్త ముఖాన్ని చూసి ఎవరని అడిగేలోగా రవి వివరంగా చెప్పడంతో ఊహ, సురేంద్ర ఒకేసారి హారు చెప్పుకున్నారు. సాయత్రం అందరూ కలసి తిరునాళ్ళ వెళ్లే ఓ కి.మీ దూరంలోపే ఊహ, సురేంద్ర ఓ అడుగు వెనక్కి నడవడం గ్రహించారు అందరూ. అన్నీ షాప్స్ తిరుగుతూ కోలాహలంగా, మైకుల చప్పుడు మధ్యలో కొన్ని సన్నని మాటలు సూటిగా ఊహ, సురేంద్ర మధ్య నడిచాయి. అందరూ కలసి దేవాలయ సత్రంలో భోజనాలు చేసి తిరుగు ప్రయాణంలో ఓ పది నిమిషాలపాటు ఊహ, సురేంద్ర కనిపించలేదు.
అందరికీ భయం వేసింది. ఇంకో అనుమానం రాక ముందే వారు ఎవరికి వారు దూరంగా ఏదో గిఫ్ట్ షాపింగ్ చేయడం గమనించి త్వరగా రమ్మని కేకలు వేసాము..ఓ గంట తరువాత ఇంటికి చేరారు.
తెల్లవారి ఉదయం టిఫెన్ చేస్తూ ఎవరి కెరియర్ గురించి వారు చెప్పుకుపోతూ ఉంటే సురేంద్ర మాత్రం ఏదో ఇంకో లోకంలో ఉన్నట్లుగా ఉంది. సురేంద్ర మీ బిజినెస్ ఎలా ఉంటుంది ?. మీ షాప్ పేరు ఏమిటి ? అని రవి అడిగాడు. పాలషాపు అన్నాడు.వెంటనే ఊహ నవ్వు ఆపుకోలేక పక్కున నవ్వింది. అదేమిటి సర్..మీ షాపుకి ఓ పేరు దొరకలేదా ? కనీసం మీ ఫ్యామిలీలో లేదా మీ ఇష్టదైవం పెట్టుకోవచ్చుగా అంది. కొద్దిగా సిగ్గుతో జవాబు లేని ప్రశ్నకు మౌనం జవాబుగా ఉండిపోయాడు. ఆ ఊరిలో సురేంద్ర షాప్ అంటే పసి పిల్లోడి దగ్గర నుండి చచ్చే ముసలోడి దాకా అందరికీ తలలో నాలుక. ఇంకా ఏదో ప్రత్యేకంగా పేరు అవసరం లేదు అని అన్నాను. నా మాట అందరూ విని, ఓ మంచి మనిషిగా సురేంద్ర వైపు చూడటం జరిగింది.
రెండు రోజులు సరదాగా గడిచింది. నేను వచ్చి పది రోజులు దాటింది. ఇంక నేను ఊరికి బయలు దేరాను. అక్కడ షాపు లో నేను లేకపోతే ఇబ్బంది. అదీగాక పెళ్లిళ్ల సీజన్. అని అంటూ సురేంద్ర బట్టలు సర్దుకున్నాడు. నీకు మంచి ఫ్రెండ్ దొరికాడురా …వాళ్ళ ఊరిలో ఫ్యామిలీ మెంబెర్స్ ను చూస్తుంటే అందరూ నచ్చారు. పల్లెటూర్లో మనుషులకు పట్నంలో వారికి తేడా చాలా ఉంటుంది అంటూ ఇంకా పల్లె , పట్నం గురించి మాట్లాడుకుంటూ బస్ స్టాప్ కి వచ్చారు. ఎవరికి వారే తమ అభిమానం చూపుకున్నారు. గొప్ప మనసుతో కలివిడిగా అందంగా తోచింది మనసు.జీవితంలో ఇలా ఓ నలుగురు ఉంటే చాలు బాధలు, కన్నీళ్లకు వారే ఔషదంగా పనిచేస్తారు అంటూ మనసు నిండా తప్తితో హాయిగా మాటాడంలో ఏదో కొత్త రంగు ముఖంలో కనిపించింది నాకు.
అప్పటికే సిద్ధంగా ఉన్న బస్ ఎక్కుతూ ”ఒరేయ్ నా షాపుకి పేరు పెట్టాలని ఎప్పుడూ అనిపించలేదు. నాకు ఎవరూ చెప్పలేదు, అడగలేదు. ”ఊహ మిల్క్ అండ్ ఫాన్సీ షాప్” అని పెడితే ఎలా ఉంటుంది ?” అని సురేంద్ర అడగటం బస్ బయలుదేరటం ఒకేసారి జరిగింది. నేను జవాబు చెప్పేదానికి సమయం చాలనంత ఓ ఆలోచన నాకు వదిలి వెళ్లిపోయాడు. ఓ వింత ఇష్టం వాడిలో మొలిచినట్లుగా నా కళ్లతో దగ్గరిగా చూసాను. కావాలని నాకు చెప్పలేదు అప్రయత్నంగా ఓ నిజం నోటి నుండి జారింది. నా పెదవులపై చిరునవ్వు పూసి, కాకినాడ ట్రిప్‌లో ప్రతి క్షణాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ రూంకి బయలు దేరాను. ఓ పది నిమిషాలకు విషయాన్ని అంచనా వేసుకుని వచ్చే వారం ఆలస్యం చేయకుండా మిల్క్ అండ్ ఫాన్సీ షాపుకి వెళ్ళిరావాలి అని మనసులో మురిసిపోతూ అనుకుంటూ బెడ్ పై వాలిపోయాను. మళ్ళీ ఎప్పటిలాగా నా డైరీ గుర్తుకు వచ్చింది. ఈ రోజు మొత్తం సురేంద్ర నా మనసుకు ఎంతో హౌం వర్క్ ఇచ్చినట్లుగా ఉంది. వాడు చెప్పకుండా దాచుకుని వెళుతున్నాను అనుకున్నాడే కానీ వాడి మనసు నాకు తెలిసింది. ఈ రోజు నా డైరీ అంతా వాడే ఆక్రమించాడు.
ఉమ్మడి కుటుంబంగా ఉన్న మా అందరిలో ఈ విషయం ముందుగా ఎవరికి చెప్పాలి? ఒక వేళ చెబితే ఒకే కులం ఐనా అందులో ఉన్న శాఖ మార్పుకు నన్ను అందరూ తిడతారని భయం వేసింది.వాస్తవానికి ఆ శాఖ వారిని చేసుకోవడం తప్పు.కూడని పని. పెద్దలు అంగీకరించని విషయం అది. కానీ ఇవేమీ ఆలోచించకుండా షాప్ పేరు మార్చాడా ? ఇంకేమి ఆలోచించకుండా తిరునాళ్లలో ఒకరికి ఒకరు ప్రేమ కానుకగా గిఫ్ట్ కొన్నారా?
ఇలా ఓ నెల పాటు మౌనంగా ఇద్దరినీ గమనించాను. కొన్ని ఉత్తరాలు వ్రాసుకోవడం ద్వారా, కొంత సంభాషణల మధ్య సురేంద్ర గురించి కూపీ లాగడం ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే త్వరలో ఈ సంగతి బయటకు రావడం ఖాయం. అంతేకాక నాకు తెలియకుండా కాకినాడ రెండు సార్లు వెళ్ళి వచ్చినట్లు సమాచారం. ఇంకా ఒకరిద్దరి నా స్నేహితుల కంట్లో పడి నా వద్దకు చేరింది వీరి కథ.
ఓ రోజు పొలానికి నీళ్ళు పెట్టడానికి తోడుగా వెళ్లిన నేను ధైర్యంగా ఈ విషయం పెదనాన్నకు చెప్పాను. అప్పటికే ఎన్నో సంబంధాలు చూసి చూసి విసిగిన మనసుకు ఈ వార్త సంతోషపెట్టింది. నీకు అందరూ తెలుసు కాబట్టి , వాళ్ళూ మన కంటే పెద్ద స్థాయి కాదు కాబట్టి ఇక సమస్య ఏముంది? మాట్లాడదాం అన్నాడు. ఆలస్యం చేయకుండా వెళ్ళి రవికి చెప్పడం, రవి ఊహను అడిగి అటు, ఇటు పెద్దలందరూ చేరి ఖాయం చేసుకున్నారు. పెళ్లి, పెళ్ళిలో ఇతర విషయాలు పట్ల మాట్లాడే అవకాశం లేనంతగా సురేంద్ర, ఊహలు ఓ ప్రణాళిక ప్రకారం పెండ్లి జరిగింది.
ఇది అంతా ఆలోచించే కొద్ది అంతా అందంగా , వేగంగా కాలం ఓ ముచ్చట తీర్చింది. పెళ్ళిలో ప్రతి మలుపులో నన్ను ప్రత్యేకంగా గౌరవిస్తూ పలుకరిస్తూ నా పేరు అడగటం, నాతో ఫొటోలు దిగడం అంతా ఓ అందమైన అనుభూతిగా గడచింది. మా కుటుంబంలో మొత్తం ఈ పెళ్లికి మూలం నేనేనని పొగడడంలో సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుండి ఎంతో కష్టం పడి అతి పేదరికం నుండి బిడ్డలని చక్కగా సాకిన మా అమ్మ, నాన్నలకి మంచి కోడలు వచ్చిందని ఊరంతా చెప్పుకోవడంతో గర్వపడ్డాను.
ప్రతి రోజు డైరీలో నేను సంతోషంగా చెక్కిన ప్రతి అక్షరంలో గొప్ప భావావేశం కనిపించసాగింది.
అంతలో పెళ్లికి వచ్చిన మా నాన్న మిత్రుడు వెంకయ్య నన్ను చూసి ఏం చేస్తున్నావు? అని అడిగాడు. ఉద్యోగం వచ్చేదాకా కొత్తగా పెట్టిన మా షాపింగ్ మాల్ లో చేరమని స్వయంగా అడిగాడు .నన్ను అడగకుండానే నాన్న మాటిచ్చాడు పంపుతానని. నేను కాదనలేక షాపులో చేరాను. తొలి సంపాదనగా నాలుగు వందలు జీతం జేబులో పెట్టుకొని ఇంటికొచ్చి మా నాన్నకు ఇచ్చాను. అసలు క్షణం ఆలోచన చేయకుండా మీ అమ్మకు ఇవ్వు. అది విని అరక్షణంలోనే మీ నాన్నకు ఇవ్వు అంది. ఇద్దరూ కలసి నీవే దాచుకో.. మా కష్టం మాకు ఉంది. అది మా అవసరాలను తీరుస్తూనే ఉంది. అవసరమైతే నిన్ను అడుగుతాం. నీవు జాగ్రత్తగా ఉండు..మన ఇంటి పరువు నీకు బలం. ఎప్పుడూ బలహీనపడకు. అంటూ సూచన చేసారు.
అన్న, వదినకు స్వీట్స్ తెచ్చాను ఇచ్చి వస్తాను అని లోపలి గది వైపుకు వెళ్ళి పిలిచి ఇచ్చాను. అదే సమయంలో ఏదో వేడి వాతావరణం కనిపించింది . ఇలా చూడటం ఇదే మొదలు.
నన్ను చూసి నవ్వూతూ స్వీట్స్ తీసుకుని వెళ్ళారు. ఆ రోజు రాత్రి నా డైరీలో నా కలం బాధగా ఓ రెండు వాక్యాలు ఉత్తముడైన అన్నయ్య ముఖంలో కనిపించిన వింత రంగును గురించి వ్రాశాను..అంతే ఆ రోజు నాకు బాధగా లేదు కానీ… ఏదో బరువుగా మాత్రం ఉంటుంది.
ఆ రోజు క్షణంలో నేను కనిపెట్టలేని వెలితి ఏదో నాలో పెరగసాగింది.
ఉదయాన్నే ఓ నాలుగు వందల గజాల్లో ఉన్న గిలకల భావి నుండి ముప్పై జోళ్ళు నీళ్ళు తేవడం నా డ్యూటీ, తరువాత కూరగాయలు తేవడం, ఇంకా ఇంట్లో పనులు చేయడంతో తొమ్మిది అయ్యేది . వెంటనే షాపుకి వెళ్ళేవాడిని. మళ్ళీ సాయంత్రం ఇంట్లో అమ్మ చేసే పనులు దాదాపుగా నేనే చేసేవాడిని. నన్ను చూసి ముచ్చటపడి పొగిడేవారు. పొట్టుపోయి కోసం రైస్ మిల్లు నుండి చిట్టు, బాయిలర్ కోసం మొక్కజొన్న కంకెలు, కుంపటి కోసం బొగ్గులు, పోయిలోకి పత్తి కట్టే అన్నీ నేనూ మూసుకొచ్చి ఇంట్లో భద్రపరిచే వాడిని. ముఖ్యంగా ఓ కి.మీ దూరంలో పల్లె భావికి వెళ్ళి మంచి నీళ్లు వరుసలో నిలబడి తేవడం ఓ పెద్ద పని. అది నా పని. ఇందులో ఏ మాత్రం చాకిరీ అనిపించేది కాదు. జీవితంలో ఓ అందమైన అనుభవాలు ఇవి.
ఇవి లేకపోతే నా డైరీలో పేజీలు అసలు నిండవు.ప్రతి పనిలో ఓ సంతోషాన్ని, కొన్ని సార్లు కష్టాల్ని కూడా సంతోషంగా ప్రేమిస్తూ ప్రతి క్షణాన్ని మరువకుండా రాసుకొనే వాడిని.
క్రమేపీ ఏదో ఇంట్లో వాతావరణంలో తేడా కనిపిస్తునట్లుగా ఉంది. అమ్మ, పెద్దమ్మ లో ఒత్తిడి, నాన్న, పెదనాన్న లో ఆసహనం, అన్న తప్పించుకొనిపోవడం, వదినలో ఏదో అహం, కళ్ళలో క్రూరం అన్నిటి మధ్యలో వయసులో చిన్నవాడిగా ఏదో అర్దం కాని యుద్ధం.
గదిలో కొత్తగా ఓ చిన్న టేబుల్ వెలిసింది. ఎవరిని కలవకుండా ఆమె వరకే బట్టలు, కలసి చేయాల్సిన వంట రెండు సార్లు , అందరం కలసి తాగే టీ స్థానంలో కొత్తగా హర్లిక్స్, రహస్యంగా చుట్టాలు వచ్చి వెళ్ళడం, కారణం లేని ప్రయాణం, మాములు మాటలనే సానపెట్టి గుచ్చడం, వంకర చూపులు, కొత్త చుట్టరికంతో వింత వరసలు, ప్రతి అడుగులో ఏదో పంతం, వయసుకు మించిన పెద్దరికం, అవాంఛనీయ సంఘటనలు ఇలా ఎన్నో యుద్ధ మేఘలు కమ్ముతుంటే అన్నిటినీ గమనించిన నా మనసుకు వంద ప్రశ్నలు వేయి ఆయుధాలతో దాడి చేస్తున్నాయి. రాత్రులు నిద్ర పట్టక ఆలోచన లేత వయసుపై స్వారీ చేస్తోంది.అన్నిటి పై కసిగా నా మనసు ఇష్టానూసారంగా అక్షరాలతో కలసి ఏవో ఏవేవో వ్రాసుకొని సొమ్మసిల్లి పడుకునే వాడిని
ఇంట్లో టూత్ పేస్ట్ కూడా వాడని పేదరికం, సరిగా ఇంట్లో బాత్ రూం లేని పూరి గుడిసె, కేవలం ఓ నాలుగైదు డ్రెస్సులు , ఓ నాలుగు నులక మంచాలు, ఒంటిపై సవర బంగారం లేమిడి, ఇవన్నీ చూసి బాధపడని నేను ముందు రోజుల్లో ఓ పథకం ప్రకారం నటిస్తూ ఓ అమాయకుని జీవితంలో ప్రవేశించి, పరువును ప్రాణంగా భావించే కుటుంబాన్ని తన కుతంత్రాలతో కోడలిగా, భార్యగా, వదినగా ఓ భయానక పాత్ర ఒకటి ఇంట్లోకి వచ్చింది అన్న విషయం కేవలం ఆరు నెలలలోపే పసికట్టాను
ఇష్టపడి కోరుకున్న వాడిని చేసుకుని ఇంతలో ఇంత మార్పు ఎలా వచ్చింది? ఈ ప్రశ్న నన్ను వింతగా నడిపించింది.మొట్ట మొదటిగా పెదనాన్న కు చెప్పి ఓ పెళ్లి పెద్దగా అన్నీ తెలిసిన విధంగా పెళ్లి కుదిరికలో తొలి పాత్ర నాదే.ఏదో ఒకటి చేసి అసలు రహస్యాన్ని నేనే తెలుసుకోవాలి అనిపించింది.
వెంటనే ఓ రోజు ఫ్రెండ్స్‌తో టూరు ఉందని చెప్పి కాకినాడ వెళ్ళాను. అంతకు మునుపు రవి వాళ్ళ ఊరు వెళ్లిన పలు సందర్భాలలో ఊహ మాటల్లో ఆమె చదివిన పాఠశాల, స్నేహితులు, ప్రదేశాలు , తను పని చేసిన బట్టల షాప్ అన్నీ గుర్తుకు వచ్చాయి. ఒకరిద్దరి కలిశాను.సహజ రీతిలో మాట్లాడం వలన ఏ అనుమానం లేకుండా నాతో కలిసిపోయారు.ఓ వారం ఇక్కడే ఉంటానని చెప్పాను. ఒకరిద్దరు బాగా దగ్గరిగా మాట్లాడారు. క్రమంగా లోకంలో పెళ్లి, ప్రేమ గురించి మాట్లాడే క్రమంలో ఊహ గురించి దూరపు బంధువు మాట్లాడుతూ ఏమైనా ఊహ తెలివైనది. ఆమె మొదట రాజును పెళ్లి చేసుకోవాలని కల కన్నది.కానీ అతనికి వేరే అమ్మాయితో పెళ్లి కుదురుంది అని తెలిసినా పట్టు బట్టి అతన్ని ఆమె వైపు మలుచుకుంది. బహిరంగంగా అక్కల సాయంతో భయం లేకుండా అతనితో కలసి మెలసి ఉంది. కానీ విధి వశాత్తూ ఇంకొకరిని చేసుకోవడంతో కథ ముగిసింది.
ఆ చేసుకున్న అమ్మాయి అక్షరాల ఆమెకు ఏనాడో విడిపోయిన బాబాయ్ కూతురు కావడం వల్ల అతడిని వదిలేసింది. అలాగే తాను పని చేసి షాప్ యజమానిని అప్పు తీసుకుని బ్లాక్ మెయిల్ చేసి ఏదో వింత కథ నడిపిందని అన్నారు. తన ప్రాణ స్నేహితురాలు లలిత ఈ ఊరిలోనే ఓ కన్వెంట్లో టీచర్‌గా చేస్తుంది. ఇలాగే ప్రేమ విషయంలో ఇద్దరూ ఒకరిని ప్రేమించే విషయంలో గొడవ పడితే, ఇది తెలిసి వాళ్ళ బావ గారు జుట్టుపట్టి ఈడ్చి నెడితే ఏదో ఓ సంబంధం కుదిరి ఇక్కడే ఉంటుంది. అప్పటి నుండి వీరిద్దరూ బద్ద శత్రువులు. అని చెప్పడంతో నేను లలిత గారిని అతి కష్టం మీద కలిశాను.నేను ఊహ అనే పేరు చెప్పగానే నన్ను గేట్ ఔట్ అన్నంత కోపంతో మాట్లాడింది. తరువాత నా రాక కారణం చెప్పాక…ఆ నీచురాలు మనసు మంచిది కాదని, ఎవరు పచ్చగా ఉన్నా ఓర్చుకోలేదని, అతి చిన్న వయసులోనే కాపురాలు తీసిందనీ, నమ్మిన వారిని మోసం చేయడంలో దిట్టని ఓ నాలుగు సంఘటనకు నాకు కళ్ళు తిరిగాయి.
తండ్రి, తల్లి భయం లేని ఆమె జీవితంలో ఓ గొప్ప ఆశయాన్ని పెట్టుకుని విజయం సాధించేదని చెప్పవచ్చు. తనకి ఏమీ లేకపోయినా, తనకు అర్హత లేకున్నా, తన తెలివిని ఉపయోగించి బంధువుల్లో ఎవరు ఆర్థికంగా, అమాయకంగా ఉంటారో వారికి వల వేసి పెళ్ళిచేసుకుని తన ఇష్టానుసారంగా జీవించాలి అన్నదే లక్ష్యం. సరిగ్గా అప్పుడే మీ పెదనాన్న కొడుకు సురేంద్ర ను ఈ ఊరు తెచ్చి బలి పశువును చేసావు నీవు. తీయని మాటల్తో, చక్కని కట్టు బొట్టుతో, గొప్ప ప్రతీవ్రతలా మాటలు చెప్పుకుంటూ చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ దాకా వరసలు పెట్టి పిలుస్తూ తన అవసరాలకు ఏ పని ఐనా చేస్తుంది. పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తుంది. పచ్చని బంధాలను విడదీస్తుంది. అలాంటి ఆమెను కోరి మీ ఇంటి కోడలిగా తెచ్చుకున్నారు జాగ్రత..ఏ మాట వెనుక మాయ ఉందో కనుగొనడం కష్టం, శత్రువులను కూడా తెలివిగా మోసం చేయగల నేర్పరి.
ఈ నా మాటలు నమ్మవద్దు మీరు. దష్టిలో పెట్టుకోండి చాలు. ఒక్కో కష్టం, బాధ మీ అనుభవంలో వస్తాయి…అంటూ బాధగా వెళ్ళిపోయింది. అంతా విని నా మనసు అక్కడే కుప్పకూలింది. ఇది ఎవరికి చెప్పాలి? రాబోయే బాధలని ఎలా పోగొట్టాలి? నా తప్పును ఎలా సరిద్దుకోవాలి? నా కుటుంబం ముందు నేను తల ఎక్కడ పెట్టుకోవాలి? రాబోయే రోజుల్లో మా పచ్చని ప్రేమ ఈ విషపు అడుగుతో ఎంత కష్ట పడాలో? అనుకుంటూ బస్ ఎక్కి బాధగా అర్థరాత్రి ఇంటికి చేరాను. అందరూ పడుకున్నారు. వెనుక గదిలో ఏవో కేకలు వినిపిస్తున్నాయి. ఆ గిఫ్ట్ ఇంటిలో ఉండటానికి లేదు అని ఓ గొంతు. నా ఇష్టం నా వస్తువులన్నీ నాకు కావాలి అని ఇంకో గొంతు వినిపిస్తుంది. ఒకరిది అహం. ఇంకొకరిది అహంభావం. ఒకరి గొంతులో గౌరవం. ఇంకొకరి గొంతులో పంతం.
నేను మౌనంగా అమ్మను నిద్ర లేపి ఓ గ్లాస్ మజ్జిగ తాగి నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఏమీ తెలియనట్లుగా ఏంటిరా ఇదంతా అన్న కొండంత మౌనంతో, సముద్రమంత సహనంతో నా కళ్లలో
మనమేమి చేసేది లేదు అన్నట్లుగా చూస్తూ బాగా పొద్దు పోయింది ..పెందలాడే పడుకో అంటూ లోపలికి వెళ్ళింది. ముఖం కడుక్కుని గోడ మీద టైం చూస్తే పన్నెండు కావస్తుంది. డైరీ గుర్తుకొచ్చి బయటకు తీసాను. ఈ రోజు నాలో కలిగిన ఆవేదన తాలూకా నిజాలని ఒక్కో దాన్ని ఆలోచిస్తూ పోతే , నా తప్పుపై నాకు నమ్మకం ఏర్పడింది. ఏ అనుభవం లేకుండా పెద్దరికం వహించడం వలన ఎదురయ్యే సమస్యల్ని ఎలా పరిష్కరించాలి ? ఎవరితో చెప్పుకోలేక , ఎవరు ఏమన్నా బదులు పలుకలేక తలదించుకుని మౌనంగా పోవడమే పెద్ద శిక్ష
అని అనుకుంటూ నా మనసుకి, కళ్లకు అనిపించినవి, కనిపించినవి అన్నీ బాధగా, కోపంగా డైరీలో వేసుకున్నాను. టైం చూస్తే మూడు దాటింది.లలిత చెప్పిన మాటలు చెవుల్లో మ్రోగుతున్నాయి. అబద్దం కావడానికి ఆస్కారం లేనివి అనుకోవడంలో తప్పు లేదు.
ఏదో లోపం ఉండబట్టే ఇలా మనుషుల ప్రవర్తన ఉంది. కొద్దిగా జాగ్రత్త పడితే కొన్ని అంచనా వెయ్యకపోము.ఈ విషయాలను ఎవరికీ చెప్పకుండా ప్రతి నిమిషం ఇంట్లో ఊహ మాటలను, ప్రవర్తన గమనిస్తూపోతుంటే అక్షరాలా నిజమని తెలుస్తుంది. రోజు రోజుకు మార్పు అనేది మరింత వేగం పుంజుకోవడం గమనించాను. ఇలా ఆరు నెలలు గడిచాయి.
నాకు ఇంటర్య్వూ నిమిత్తం హైద్రాబాద్ వెళ్లాలని వేకువ జామునే నిద్ర లేచి ప్రయాణమై వెళుతూ సర్దుకుంటుంటే నీకు ఏదో ఓ దారి దొరికితే బాగుండు అంటూ బయట దాకా వచ్చింది అమ్మ.
ఓ నాలుగు రోజులు ఆగి తిరిగి ఇంటికి వచ్చాక నాన్న, పెదనాన్న ముఖంలో ఏదో తేడా గమనించాను. ఏమిటి? ఏమి జరిగింది? అని అడిగే అవసరం లేకుండానే అర్దం చేసుకున్నాను.
నా పెట్టే ఉండాల్సిన చోట లేదు. నా బుక్స్ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరి నా డైరీ? కళ్ళు ఆత్రుతగా వెతికాయి. వెనగ్గా నాన్న వచ్చి ”నిజం నిజమైనా సరే మనం దాన్ని అనకూడదు. ఒక్కోసారి అది అబద్ధంగా మారి తిరిగి మనలని గురిచూసి వేటు వేస్తుంది.” నీ అంతరంగాలను అక్షరాల్లో మార్చుకుని నీవు పడే బాధను రహస్యంగా దొంగిలించి వక్రీకరించే నీచమైన ఆలోచన మన మధ్య ఉంటే మనలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు ఇస్తారు? ఎవరిని అడగాలి?
ఒకరి జీవితంలోకి తొంగి చూసేంత తప్పు అనుమతి లేకుండా ఒకరి డైరీని చదివి రహస్యంగా విషయాలను తెలుసుకోవడం”. నీవు ఆ రోజు సురేంద్ర కోసం చేసిన మంచి పని పక్కనే ఎదుగుతున్న ఓ పొరపాటును గ్రహించలేని నీ మంచితనం నేడు చెడ్డ వాడిగా ముద్ర వేసింది. మన ఇంటిలో ఏ ఒక్కరిలో పరువు తక్కువ పని ఇప్పటి వరకూ లేదు. కానీ తొలి సారిగా ఆ భయం అందరి హృదయాల్లో తిష్ట వేసింది. మీ అన్నను ఏ క్షణం ఏమి ప్రలోభపెట్టి జీవితాన్ని ఇలా మార్చివేసిందో గాని జీవితంలో గొంతు ఎత్తి నిజం చెప్పుకోలేడు.ఒక వేళ చెప్పాలన్నా చేయి దాటిపోయింది. ఇక నీవే అసలు తెలియకుండా కారణమయ్యావు.ఈ రోజు అన్నీ తెలుసుకునితిరిగి ఇంకో సమస్యకు కారణం కావద్దు.
నీవు నీ కోసం వ్రాసుకున్న నిజాలని ఊహ చదివినప్పుడు ఆమెలో ప్రతిఘటించే ఆలోచనే ఓ ఆయుధం. నీవు నీ దారి చూసుకుని వెళ్లిపోతే సగం సమస్య సమిసిపోతుంది అన్నాడు. మరి మీరు? మీ పరిస్థితి ఏమిటి? అన్నాను మాకు తప్పవు. ఏది తప్పదు అన్నాను. అన్నిటికీ సిద్ధం అన్నట్లుగా తల ఊపారు. మరి నా డైరీ? అని అడిగాను. ”లేదు, ఇవ్వను కూడా, అంతే కాదు ఇకపై నీ జీవితంలో డైరీ వ్రాయనని నాకు మాటివ్వు. నీ అంతరంగంలోని ఏ నిజం కూడా ఎప్పటికీ బయట పెట్టనని మాటివ్వు. నేటి స్థితిని ఊహిస్తే రాబోయే కాలంలో మీ అన్న గురించి ఎక్కడా ఏమీ అనవద్దు. అదే నీకు శ్రీరామరక్ష అవుతుంది అని దీవించాడు.
ఆ పక్క రోజునే ఓ కంపెనీలో జాబ్ చేయాలని నిర్ణయం తీసుకుని అందరికీ చెప్పి, రాత్రి నాన్న చెప్పిన మాటలకు ”నీ మాటలు మరచిపోను నాన్న అని మాటిచ్చి వెనక్కి తిరిగి ఇంటిని చూస్తూ నీతి నిజాయితీలకు మారు పేరుగా నిలచిన ఇంట్లో అందరినీ తలుస్తూ… బాధను బలంగా భరించే ప్రేమను ఇంకొంచెం నా వాళ్లకు ఇవ్వాలని కోరుకుంటూ… బతుకులో డైరీ వ్రాయనని ఇంటి మీద ప్రమాణం చేయించి జీవితాన్ని పట్నానికి అప్పగించింది మా ఇల్లు…
(జీవితంలో జరిగిన యాదార్థ సంఘటన ఆధారంగా రాసినది)
- చందలూరి నారాయణరావు, 9704437247



