Thursday, June 26, 2025
E-PAPER
Homeమానవిమూఢనమ్మకాలను ఛేదించే పాత్ర నాది

మూఢనమ్మకాలను ఛేదించే పాత్ర నాది

- Advertisement -

అభిజ్ఞ… చిన్నతనం నుండి సినీ రంగంలో రాణించాలని తపించింది. ఉన్నత చదువులు చదివినా తన మనసంతా సినిమా చుట్టూనే తిరిగేది. అందుకే బయోటెక్నాలజీలో మాస్టర్స్‌ పూర్తి చేసినా సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించింది. వచ్చిన అవకాశాలతో తానేంటో నిరూపించు కునేందుకు పట్టుదలతో కృషి చేస్తోంది. ఆమె కృషికి ఫలితంగా ‘విరాటపాలెం-పీసీ మీనా రిపోర్టింగ్‌’ వెబ్‌ సీరిస్‌లో నటించే అవకాశం వచ్చింది. మూఢనమ్మకాలను ఛేదించే పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీరీస్‌ జీ5లో రేపే ప్రరంభం కాబోతున్న సందర్భంగా ఆమెతో మానవి సంభాషణ..
సినీ రంగంలోకి రావాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?
చిన్నప్పటి నుండి యాక్టింగ్‌ అంటే ప్యాషన్‌. దానికి కారణం నేను నేర్చుకున్న డ్యాన్స్‌. నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు కూచిపూడి నేర్చుకున్నాను. త్రిష, సౌందర్య సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్లలా నేనూ యాక్టర్‌ అయితే బాగుంటుంది కదా అనిపించేది. ఈ రంగంలోకి వెళితే నిలదొక్కుకోగలను, నన్ను నేను నిరూపించుకోగలను అనే నమ్మకం నాలో మొదటి నుండి వుండేది. అలా అని చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.
ఇంట్లో ఎలాంటి సహకారం ఉంది?
చదువుకు ప్రాధాన్యం ఇచ్చే కుటుంబం మాది. అమ్మ తెలుగు ప్రొఫెసర్‌, గవర్నమెంట్‌ ఉద్యోగి. పేరు డా||ఎస్‌.అనురాధ, నాన్న తెలంగాణ డైరీకి మార్కెటింగ్‌ మేనేజర్‌గా చేసి రిటైర్‌ అయ్యారు. దాని కంటే ముందు రంజీ ట్రోఫీ క్రికెట్‌ ప్లేయర్‌. అందుకే మేము కొంత కాలం ఢిల్లీలో ఉన్నాము. అమ్మ తన పీహెచ్‌డీ అక్కడే చేసింది. నేను పుట్టింది మాత్రం హైదరాబాద్‌లో. అమ్మానాన్న ముందు చదువు తర్వాతనే ఏదైనా అనేవారు. అందుకే ఆర్ట్‌వైపు వెళ్లే రిస్క్‌ తీసుకోలేకపోయాను. నా స్కూలింగ్‌ మొత్తం తార్నాకలో జరిగింది. ఢిల్లీలో బయోటెక్నాలజీలో మాస్టర్స్‌ పూర్తి చేసి అక్కడే థియేటర్‌లో కూడా కోర్సు చేశాను. అప్పుడే ఆర్ట్‌ అనేది నాలో సహజంగానే ఉందనిపించింది.
ఇంట్లో వారిని ఒప్పించ డానికి కష్టపడ్డారా?
పెద్దగా లేదు. అయితే మాస్టర్స్‌ తర్వాత నేను పీహెచ్‌డీ చేస్తానని ఇంట్లో అందరూ అనుకున్నారు. కానీ నా ఆలోచన అలా లేదు. ఇంట్లో కూడా ఎప్పుడూ చదువు చదువూ అనేవారు కాదు. చదువుతో పాటు ఏదో ఒక ఆర్ట్‌లో కూడా ఉండాలని ప్రోత్సహించేవారు. కాబట్టే చదువుతో పాటు డ్యాన్స్‌ ఎక్కడా ఆపకుండా చేస్తూ వచ్చాను. అయితే నా ఆలోచన ఏంటంటే చదువు అనేది మన మెదడుకు కొంత జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ మనకు ఏది ఇష్టమో, మనసుకు నచ్చింది చేస్తే కష్టమైనా ఇష్టంగా ఉంటుంది. అందుకే నేను ఈ ఫీల్డ్‌కే సెట్‌ అవుతాను అనిపించింది. ఇప్పుడు అమ్మానాన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు ఓ యూటూబ్‌ ఛానల్‌ కూడా ఉంది. అందులో నా డ్యాన్స్‌ వీడియోలు పెడుతుండేదాన్ని. నా ఆసక్తిని చూసి ఇంట్లో కూడా ఏమీ అనలేదు. చదువు పూర్తి చేసి సినిమాల్లో ట్రై చేస్తానంటే నా ఇష్టాన్ని గౌరవించారు.
సమస్యలేమైనా ఎదుర్కొన్నారా?
చారు బిస్కెట్‌లో రెండేండ్లు చేశాను. అక్కడే చాలా నేర్చుకున్నాను. అప్పటి నుండే అవకాశాలు వస్తున్నాయి. వచ్చిన వాటిలో మంచివి సెలక్ట్‌ చేసుకుంటూ వస్తున్నాను. ఆ తర్వాతే ఫుల్‌ టైంగా యాక్టింగ్‌ వైపు రావాలని నిర్ణయించుకున్నాను.
ఈ రంగంలో అవకాశాలు కోసం ప్రతి రోజూ పోరాటం చేయాల్సిందే. ఇవి ఎవరికైనా ఎదురయ్యే సమస్యలే. అయితే నేను ఎంతో ఇష్టంగా ఈ రంగంలో అడుగుపెట్టాను కాబట్టి ప్రతి సమస్యనూ ఓ ఛాలెంజ్‌గా తీసుకుంటున్నాను. నా క్రమశిక్షణ, పట్టుదలపై నమ్మకంతో ముందుకు వెళుతున్నాను.
సినీ ఫీల్డ్‌లో ఓటీటీ ప్రభావం ఎలా ఉందంటారు?
ఐటీ రంగాన్నే చూసుకుంటే చాలా రకాల జాబ్స్‌ ఉంటాయి. ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలిసిపోతుంది. కానీ ఈ ఫీల్డ్‌లో అలా ఉండదు. అవకాశాలు వస్తాయో లేదో కచ్చితంగా చెప్పలేం. ఇలాంటి చోట ఓటీటీ వచ్చిన తర్వాత చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి. ఈ రంగంలో రాణించాలని తపించే వారికి మంచి అవకాశం ఓటీటీ. దీని వల్ల ఫీల్డ్‌లోని అన్ని రకాల జోనర్స్‌కు అవకాశాలు పెరిగాయి. ఇప్పటి వరకు సాధారణంగా సినిమా అంటే అబ్బాయి ప్రేమించడం, అమ్మాయి కోసం ఫైట్‌ చేయడం ఇదే చూసాము. ఎవ్వరూ కూడా అమ్మాయిల జీవితంలో ఏం జరుగుతుంది, ఆమె ఏం కోరుకుంటుంది అనేది పెద్దగా చెప్ప లేదు. ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తుంది. ఫీల్డ్‌లో అమ్మాయిలకు కూడా ప్రాధాన్యం పెరుగుతుంది.
భవిష్యత్‌ ఎలా ఉండాలనుకుంటున్నారు?
నా జర్నీ ఇప్పుడే మొదలయింది. భవిష్యత్‌లో ఇదే ఫీల్డ్‌లో నిలదొక్కుకోవాలి. అవకాశాలు వస్తున్నాయి. ఇంకా ఇంకా ఎదగాలని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎంత చెప్పుకున్నా నటి జీవితం ఒంటరి పోరాటమే. అయితే ఈ విరాటపాలెం తర్వాత నాకు సపోర్ట్‌గా ఓ టీం ఉంది అనే నమ్మకం వచ్చింది. చాలా ప్రోత్సహిస్తున్నారు, సహకరిస్తున్నారు. నా యాక్టింగ్‌ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. ఓ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి. ఒకప్పుడు ఇంట్లో ‘ఇవన్నీ నీకెందుకు చదువులో టాపర్‌వి అటే దృష్టి పెట్టొచ్చు కదా’ అనేవారు. కానీ ఇప్పుడు వాళ్లు కూడా ‘ఏం కాదు మంచి అవకాశాలు వస్తాయి నువ్వు ధైర్యంగా ఉండూ’ అంటున్నారు.
మీలా ఈ రంగంలోకి రావాలనుకుంటున్న అమ్మాయిలకు ఏం చెప్తారు?
నాకున్న చిన్న అనుభవం నుండి నేను చెప్పేది ఏమిటంటే ఏదీ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఈ మధ్య ఎవరైనా పైకి వస్తున్నారంటే వాళ్ల గురించి అనవసరమైన కామెంట్లు పెట్టడం పెరిగిపోయింది. ఇప్పుడంతా ఇంటర్‌నెట్‌ జనరేషన్‌. ప్రతి ఒక్కరికీ ఒక టైం వస్తుంది. కాబట్టి ఒకళ్లని ఒకరు కిందకి లాక్కునే ప్రయత్నం చేయకూడదు. ఒకరు సంతోషంగా ఉంటే వాళ్ల సంతోషంలో మనమూ భాగం పంచుకోవాలి. అంతే కాని వాళ్లు బాధపడేలా చేయకూడదు.
విరాటపాలెంలో
మీ పాత్ర గురించి చెప్పండి?
‘విరాటపాలెం’లో మంచి క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చింది. ఇందులో నేను పోలీస్‌ కానిస్టేబుల్‌ను. సాధారణంగా కానిస్టేబుల్‌ అంటే రఫ్‌గా ఉంటారు అనుకుంటారు. కానీ నా పాత్రలో అన్ని రకాల కోణాలు ఉంటాయి. రఫ్‌గా కనిపించకపోయినా స్ట్రాంగ్‌గా ఉంటాను. చాలా ఫ్రెష్‌ పాత్ర చేసే అవకాశం వచ్చింది. దీన్ని రాసిన మీనా కూడా ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర రాయలేదు. నాకు ఇది ఒక బంపర్‌ ఆఫర్‌గా అనుకుంటున్నాను. గ్రామంలో మూఢనమ్మకాల వల్ల అమ్మాయిలు చనిపోతుంటే ఆ రహస్యాన్ని ఛేదించే పాత్ర నాది. సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడే పాత్ర ఇది. అందుకే ఈ పాత్ర నాకు బాగా నచ్చింది.
అవకాశాల కోసం
మీరు చేసిన ప్రయత్నం?
మొదటి నుండి నా ఆసక్తి మొత్తం సినిమాల వైపే. ఎలాగైనా ఈ రంగంలో రాణించాలని ట్రై చేస్తే చారు బిస్కెట్‌లో అవకాశం వచ్చింది. అక్కడే యాక్టింగ్‌, రైటింగ్‌ స్కిల్స్‌ పెంచుకునే ప్రయత్నం చేశాను. ఆహాలో 2024లో గీతాసుబ్రమణ్యం సీజన్‌ 3తో నా వెబ్‌ సీరిస్‌ మొదలయ్యింది. ఆ తర్వాత ఓ మ్యూజిక్‌ వీడియో కూడా చేశాను. అన్నపూర్ణ స్టూడియోస్‌ వారి ఓ ప్రాజెక్ట్‌లో వర్క్‌ చేశాను. తర్వాత సోనీ మ్యూజిక్‌ వారితో కలిసి ‘మచ్చా వచ్చేరా’ అనే ప్రాజెక్ట్‌ చేశాను. ప్రస్తుతం జీ5తో ‘విరాటపాలెం’ చేస్తున్నాను.

– సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -