Saturday, March 28, 2026
E-PAPER
Homeకరీంనగర్పేకాట కేసులో మిస్టరీ…అసలు ఎవరెవరు తప్పించుకున్నారు?

పేకాట కేసులో మిస్టరీ…అసలు ఎవరెవరు తప్పించుకున్నారు?

- Advertisement -

-మామిడి తోటల్లో పేకాట…నలుగురు అదుపులో,ఆరుగురు పరారీలో…?
నవతెలంగాణ-రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మూటపల్లి గ్రామ శివారులోని మామిడి తోటల్లో పేకాట స్థావరం నిర్వహిస్తున్నారనే గోప్య సమాచారం అందడంతో పోలీసులు శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా దాడి నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడిలో సుమారు పదిమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు, ఘటన స్థలంలో నుంచి దాదాపు రూ.31,000 నగదు, నాలుగు బైకులు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

దాడి సమయంలో ఉన్న వారిలో నలుగురిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగతా ఆరుగురు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా,ఈ పేకాట స్థావరంలో పెద్ద మొత్తంలో డబ్బుతో ఆటలు సాగుతున్నప్పటికీ, రాజకీయ ప్రభావం ఉన్న కొందరిని ఉద్దేశపూర్వకంగా తప్పించారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంపై గ్రామస్థుల్లో చర్చ నడుస్తోంది.

మరోవైపు, శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై శనివారం ఉదయం 11 గంటల వరకు పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఇలాంటి ఘటనలపై వెంటనే వివరాలు వెల్లడించే పోలీసులు, ఈసారి ఆలస్యంగా స్పందించడం వెనుక కారణాలేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు, పరారీలో ఉన్న వారి అరెస్టు,అలాగే ఆరోపణలపై పోలీసుల స్పందన వెలువడాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -