– సర్వే మ్యాప్, భూధార్ అమలుకు ప్రణాళిక : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా నక్షా మ్యాప్‌లను ఖరారు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో భూముల రీసర్వేపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజాం కాలం నుంచి రాష్ట్రంలో నక్షాలు లేని 413 గ్రామాల్లో వాటిని ఖరారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్‌గా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్, జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొమ్మనాపల్లి, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూర్, సంగారెడ్డి జిల్లా వట్‌పట్టి మండలం షాహిద్‌నగర్ గ్రామాల్లో ఏరియల్, వ్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ రోవర్ పద్ధతుల్లో సర్వే నిర్వహించామని తెలిపారు. ఐదు గ్రామాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మిగిలిన గ్రామాల్లో రీసర్వే నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భూముల అమ్మకం, కొనుగోలు సందర్భంగా హద్దులతో కూడిన సర్వే మ్యాప్‌ను జతపర్చాలనీ, దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో భూములకు కూడా భూధార్ నెంబర్ కేటాయించాలని భూ భారతి చట్టంలో స్పష్టం చేశామని చెప్పారు. ఈ నిబంధనలను రీ సర్వే చేసి ఐదు గ్రామాల్లో అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఐదు గుంటలకు పైగా ఉన్న భూములకు కొత్తగా సర్వే నెంబర్లు ఇవ్వాలనీ, రెవెన్యూ, ఫారెస్ట్, దేవాదాయ, వక్ఫ్ భూములంటే వాటి వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి వి.లోకేష్‌కుమార్, సర్వే ల్యాండ్‌సెటిల్‌మెంట్ కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఐదు గ్రామాలకు నక్షా మ్యాప్‌ల ఖరారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES