వనపర్తి ఎస్పీగా బదిలీపై వెళ్లిన సునీత రెడ్డి
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను బదిలీలు చేసిన విషయం విదితమే. బదిలీల్లో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీగా అంతకు ముందు యాదాద్రి భువనగిరి డీసీపీగా, శంషాబాద్ డీసీపీగా పని చేశారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం డీసీపీగా వచ్చారు. ఆయన శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు పని చేసి విశేష సేవలందించిన సునీతా రెడ్డి వనపర్తి జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. సునీతా రెడ్డి మహేశ్వరం డీసీపీగా పని చేసిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఫ్యూచర్ సిటీ ఫార్మాసిటీ రైతుల ఆందోళన సందర్భంగా నేరుగా రైతులతో మాట్లాడి ఆ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో సఫలీకృతురాలయ్యారు. ప్రజాందోళన కార్యక్రమాలను తనదైన శైలిలో శాంతింప చేయడంలో సిద్ధహస్తురాలు. ఆందోళకారులకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేశారు. సమస్య పరిష్కారానికి తనదైన పాత్ర పోషించారు. దాంతో ఇటు పోలీసులకు అటు ప్రజలకు, ఆయా రాజకీయ పార్టీలకు నాయకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
డ్రగ్స్, గంజాయ్ అరికట్టడంలో..
మహేశ్వరం జోన్ పరిధిలో ఇంజనీరింగ్ కళాశాల విస్తారంగా వెలిశాయి. ఈ కళాశాలలో దేశ, విదేశాలకు చెందిన విద్యార్థులు విద్యాభ్యాసానికి కొనసాగిస్తున్నారు. లక్షల సంఖ్యలో విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ బారిన పడుతున్న ఘటనలు అనేక వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో తను డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గంజాయ్, డ్రగ్స్ నివారణకు చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు. కళాశాలలో అవగాహన సదస్సులు పెట్టించారు. గంజాయి వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ తన క్షేత్రస్థాయి పోలీస్ అధికారులతో మార్నింగ్ వాక్ కార్యక్రమాలను నిర్వహింపజేయడంలో సఫలమయ్యారు. పోలీసులు, ప్రజలకు మరింత చేరువ కావడంలో తనదైన పాత్ర పోషించారు. అంతేకాకుండా నేరాల అదుపు, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేక చొరవ కనపరిచారు.



