నాణ్యమైన మొక్కలను రైతులకు అందించాలి
ఆయిల్ ఫెడ్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
నిర్మాణ దిశలో ఉన్న నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. ఆ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించనున్న నేపథ్యంలో సమయానికి అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. కల్లూరుగూడెం, గద్వాల జిల్లా బీచుపల్లిలో జరుగుతున్న ఆయిల్ పామ్ మిల్లుల నిర్మాణ పనుల పురోగతిపై ఆయన అడిగి తెలుసుకున్నారు. కల్లూరు గూడెం పనులను వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి చేయాలని అన్నారు. ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ అనుకున్న స్థాయిలో జరగకపోవడం పట్ల అధికారులపై అసంతప్తి వ్యక్తం చేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పురోగతి కొంతమేర ఉందని చెప్పారు. కానీ భువనగిరి, నారాయణపేట, గద్వాల, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో చాలా తక్కువ స్థాయిలో ప్లాంటేషన్ జరిగిందని తెలిపారు. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు హార్టికల్చర్, సెరికల్చర్, అగ్రికల్చర్ శాఖల సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల వారీగా లక్ష్యాలను పెట్టుకుని ప్లాంటేషన్ జరిగేలా చూడాలన్నారు. ఈ సంవత్సరంలోగా అన్ని కంపెనీలు కలిపి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 1.25 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆయిల్‌ఫెడ్ చైర్మెన్ జంగా రాఘవరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఆయిల్ ఫెడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES