ఆరు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనా సాధారణ జీవితం గడిపిన మహనీయులు
అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఎస్ఎల్బీసీ ఘనత రాఘవరెడ్డిదే : జూలకంటి
నిజాయితీ, నిబద్ధతకు మారు పేరు : రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
నల్లగొండ జిల్లా వట్టిమర్తిలో నర్రా11వ వర్థంతి
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కార్మికునిగా, కళాకారునిగా, ప్రజా నాయకునిగా నిరంతరం ప్రజల్లో ఉంటూ నాడు కేవలం రూ.300 ఖర్చుతో ఎమ్మెల్యేగా గెలిచిన మహనీయులు నర్రా రాఘవరెడ్డి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి 11 వర్థంతి కార్యక్రమాన్ని ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆవిష్కరించారు. నర్రా రాఘవరెడ్డి విగ్రహానికి జాన్‌వెస్లీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో జాన్‌వెస్లీ మాట్లాడారు. నర్రా రాఘవరెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. సాధారణ జీవితాన్ని గడుపుతూ.. నిత్యం ప్రజల మధ్య ఉండి వారిని చైతన్యవంతం చేశారన్నారు. అదేవిధంగా పీడిత ప్రజల పక్షాన పోరాడుతూ జీవితకాలం వారి మన్ననలు పొందడమే కాకుండా.. భౌతికంగా దూరమైనా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.
నేటి తరానికి రాఘవరెడ్డి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం, ప్రతి ఒక్కరినీ సొంత మనిషిలా పేరు పెట్టి పిలుస్తూ వారితో కలిసిపోయి.. ఆదర్శ రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో నిరూపించుకున్నారని కొనియాడారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎలా ఉండాలో ఆయన మనకు స్ఫూర్తినిచ్చారని చెప్పారు. మోటార్ సైకిల్‌పై గ్రామ గ్రామాన తిరిగి ప్రజల ఆదరణ పొంది ఆరు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత నర్రాకే దక్కిందన్నారు. నేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా నాయకులు గెలిచే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికీ దేశంలో, రాష్ట్రంలో పీడిత ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇల్లు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో పేదలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వైద్యం వ్యాపారంగా మారాయన్నారు. భూ పంపిణీ జరగలేదని, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కలగలేదని, నేడు పాలకులు, అధికారులు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజాసమస్యలు పట్టడం లేదని విమర్శించారు. సోషలిస్టు సమాజ నిర్మాణానికి, నర్రా రాఘవరెడ్డి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఎస్ఎల్బీసీ తీసుకొచ్చిన ఘనత నర్రాదే : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టేందుకు సురక్షితమైన తాగు, సాగు నీటి కోసం ఎస్ఎల్బీసీని సాధించిన ఘనత నర్రా రాఘవరెడ్డికే దక్కిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గుర్తు చేశారు. ఆరు పర్యాయాలు నకిరేకల్ ఎమ్మెల్యేగా, సీపీఐ(ఎం) శాసన సభాపక్ష నాయకునిగా పనిచేసి, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలను మెప్పించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాఘవరెడ్డి సేవలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు మరువలేనివని కొనియాడారు. రాఘవరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేయడమే కమ్యూనిస్టు కార్యకర్తల ముఖ్య కర్తవ్యమని అన్నారు. నర్రా జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయమని చెప్పారు.
నిజాయితీ, నిబద్ధతకు మారు పేరు రాఘవరెడ్డి : రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
నిజాయితీ, నిబద్ధతకు మారుపేరుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి అన్నారు. బడుగు, బలహీన వర్గాల, పేదల, వృత్తిదారుల, రైతాంగ సమస్యల పట్ల ఆయన ప్రత్యేకంగా కృషి చేశారని కొనియాడారు. ఆ రోజుల్లో రైతాంగానికి సరిపడా విద్యుత్ లేదని, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు పట్టుబట్టి సాధించారని తెలిపారు. నాడు అన్ని వర్గాల ప్రజలతోపాటు రాజకీయాలకతీతంగా నర్రా రాఘవరెడ్డి నాయకత్వాన్ని కోరుకునే వారని చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, మల్లం మహేష్, పెంజర్ల సైదులు, చింతపల్లి బయ్యన్న, నాయకులు రాచకొండ శ్యాంసుందర్, శీలా రాజయ్య, అరూరి శ్రీను, ఐతరాజు నర్సింహా, యాదయ్య, కల్లూరి కుమార స్వామి, మెట్టు నర్సింహా, పంది నరేష్, జిట్ట స్వామి, అక్కెనపల్లి నాగయ్య, నర్రా కిశోర్, పాలమాకుల అర్జున్, చింతపల్లి క్రిష్ణయ్య, బూరుగు విజయ్, శ్రీను, నర్రా శేఖర్‌రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రమేష్, బాబురావు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.



