50 ఏండ్ల తర్వాత తొలి మానవ చంద్రయాత్ర విజయవంతం
సురక్షితంగా భూమికి చేరిన నలుగురు వ్యోమగాములు
సాన్‌డియాగో : అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ ఘన విజయం సాధించింది. చంద్రుడి చుట్టూ చారిత్రకంగా ప్రయాణించిన నలుగురు వ్యోమగాములు పది రోజుల తర్వాత సురక్షితంగా భూమి మీదకు చేరుకున్నారు. ఇది గత 50 ఏండ్లలో జరిగిన తొలి మానవ చంద్రయాత్రగా నిలిచింది. దీంతో అంతరిక్ష ప్రయోగాల్లో మరో ముందడుగు పడినట్టయ్యింది. ఈనెల 10న సాయంత్రం 8:07 గంటలకు (భారత కాలమానం ప్రకారం 5:38 గంటలకు పసిఫిక్ మహాసముద్రంలో కాలిఫోర్నియా తీరానికి సమీపంలో స్ప్లాష్‌డౌన్ ద్వారా అంతరిక్ష నౌక సురక్షితంగా దిగింది. వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా అధికారులు తెలిపారు. మిషన్ కమాండర్ రీడ్ వైస్మన్ తాము సురక్షితంగా ఉన్నట్టు చెప్పారు.
రికార్డు సృష్టించిన యాత్ర
ఈ మిషన్‌లో యాత్రికులు భూమి నుంచి అత్యధిక దూరం 2,52,756 మైళ్లు (4,06,771 కిలో మీటర్లు) ప్రయాణించి చరిత్ర సృష్టించారు. ఇది 1970లో జరిగిన అపోలో 13 మిషన్ రికార్డును అధిగమించింది. ఈ యాత్రలో పాల్గొన్న నలుగురిలో… క్రిస్టినా కోచ్ చంద్రుడి చుట్లూ వెళ్లిన తొలి మహిళగా నిలిచారు. ఇక విక్టర్ గ్లోవర్ తొలి శ్వేతజాతియేతరుడు. జెరెమి హసెన్.. తొలి అమెరికాయేతరుడు. రీడ్ వైస్మన్ కమాండర్. ఇది అపోలో ప్రోగ్రామ్ తర్వాత జరిగిన అత్యంత ముఖ్యమైన మిషన్.
యాత్ర ముఖ్యాంశాలు
ఈ ప్రయాణం ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైంది. స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) రాకెట్ ద్వారా ఈ మిషన్ లాంచ్ అయింది. చంద్రుడి దూర ప్రాంతం చుట్టూ ప్రయాణం సాగింది. ఇందులో వేలాది ఫొటోలు, వీడియోలను సేకరించారు. సూర్యగ్రహణం, మీటియర్ ఢీకొనడం వంటి అరుదైన దృశ్యాల వీక్షణ ఇందులో చోటు చేసుకుంది. ఈ యాత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం.. కమాండర్ తన చనిపోయిన భార్య గౌరవార్థం చంద్రుడిపై ఒక క్రేటర్‌కు ‘కార్రోల్’ అని పేరు పెట్టడం. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగంగా మారింది.
భూమికి తిరుగు ప్రయాణంలో సవాళ్లు
భూమికి తిరుగు ప్రయాణంలో శబ్దవేగం కంటే 30 రెట్లు అధిక వేగం చోటు చేసుకుంది. సూర్యడి ఉపరితల ఉష్ణోగ్రతలో సగం వరకు వేడి, కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ వంటివి ఉన్నాయి. అయితే అన్ని పరీక్షలూ విజయవంతంగా పూర్తయ్యాయి. కాగా ఈ మిషన్ ప్రపంచానికి సైన్స్, టెక్నాలజీ శక్తిని మరోసారి నిరూపించింది. ప్రజల్లో అంతరిక్షం అంశంపై మరోసారి ఆసక్తిని పెంచిందని నిపుణులు చెప్తున్నారు.
నాసా ఆర్టెమిస్-2 సక్సెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


