Friday, October 17, 2025
E-PAPER
Homeఆటలుముగ్గురు సభ్యులతో జాతీయ స్పోర్ట్స్‌ బోర్డు

ముగ్గురు సభ్యులతో జాతీయ స్పోర్ట్స్‌ బోర్డు

- Advertisement -

వెబ్‌సైట్‌లో ముసాయిదా.. అభ్యంతరాలకు 30 రోజుల గడువు

నవతెలంగాణ-న్యూఢిల్లీ
నేషనల్‌ స్పోర్ట్స్‌ గవర్నెన్స్‌ చట్టం (2025)లో భాగంగా ప్రతిపాదిత జాతీయ క్రీడా బోర్డు (ఎన్‌ఎస్‌బి) సహా నేషనల్‌ స్పోర్ట్స్‌ ఎలక్షన్‌ ప్యానల్‌ (ఎన్‌ఎస్‌ఈపీ) ముసాయిదా రూల్స్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. జాతీయ క్రీడా బిల్లు అమలులో ఎన్‌ఎస్‌బి, ఎన్‌ఎస్‌ఈపీ అత్యంత కీలకం. ఈ రెండు బోర్డుల నిబంధనలు, సభ్యులు, అర్హతలకు సంబంధించిన వివరాలతో కూడిన ముసాయిదాపై ఏమైనా అభ్యంతరాలను 30 రోజుల్లో చెప్పాలని క్రీడామంత్రిత్వ శాఖ సూచించింది. ముసాయిదా ప్రకారం జాతీయ క్రీడా బోర్డులో ముగ్గురు సభ్యులు ఉంటారు. పదవీ కాలం మూడేండ్లు, గరిష్ట వయో పరిమితి 65 ఏండ్లు. వయో అర్హత ఉంటే రెండోసారి సైతం బోర్డుకు ఎంపిక అయ్యేందుకు అర్హులే. జాతీయ క్రీడా సమాఖ్యలకు నేషనల్‌ స్పోర్ట్స్‌ బోర్డు గుర్తింపు ఇస్తుంది. ఎన్‌ఎస్‌బి గుర్తింపు ఉంటేనే క్రీడా సమాఖ్యలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.

క్యాబినెట్‌ కార్యదర్శి, క్రీడా శాఖ కార్యదర్శి, ఇద్దరు జాతీయ క్రీడా పురస్కార గ్రహీతలు, ఓ కేంద్ర ప్రభుత్వ నామిని, క్రీడా పరిపాలనలో అనుభవం కలిగిన వ్యక్తులతో కూడిన సెలక్షన్‌ కమిటీ ఎన్‌ఎస్‌బి బోర్డు సభ్యులను నియమిస్తుంది. ఎన్‌ఎస్‌బి సభ్యులు ఏదేనీ జాతీయ, అంతర్జాతీయ క్రీడా సంఘాల్లో ఎటువంటి పదవిలో కొనసాగడానికి వీల్లేదు. క్రీడా సంఘాలు, సమాఖ్యల్లో వివాదాల పరిష్కారానికి జాతీయ స్పోర్ట్స్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌ఎస్‌టీ) ఏర్పాటు చేయనున్నారు. వివాదాలు కోర్టుల వరకూ వెళ్లకుండా.. ట్రిబ్యునల్‌లో తేల్చుకునే వ్యవస్థను తీసుకురానున్నారు. నేషనల్‌ స్పోర్ట్స్‌ ఎలక్షన్‌ ప్యానల్‌ (ఎన్‌ఎస్‌ఈపీ) జాతీయ క్రీడా సమాఖ్యల ఎన్నికల ప్రక్రియలను పర్యవేక్షించి, నిర్వహించనుంది. ఎన్నికల నిర్వహణకు ఎన్‌ఎస్‌ఈపీలో 20 మంది సభ్యులు ఉంటారు. జాతీయ క్రీడా సమాఖ్యలు సహా ఒలింపిక్‌ సంఘంలో అథ్లెట్ల కోటా అడ్మినిస్ట్రేటర్లుగా వ్యవహరించే క్రీడాకారులకు సైతం అర్హతలను నిర్ణయించారు. సమ్మర్‌, వింటర్‌ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన, ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్లు మాత్రమే జాతీయ క్రీడా సమాఖ్యలు, ఒలింపిక్‌ సంఘంలో అథ్లెట్ల కమిషన్‌లో ఉండేందుకు అర్హులు. ఓవరాల్‌గా ప్రాధాన్య క్రమంలో పది కేటగిరీల్లో క్రీడాకారుల అర్హతలను పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -