చట్టసభల్లో 21 శాతం మంది వంశపారంపర్య నేపథ్యం ఉన్నోళ్లే
కాంగ్రెస్‌లో అత్యధికం..బీజేపీది రెండోస్థానం : ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యూ నివేదిక
న్యూఢిల్లీ : దేశంలోని 5,204 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో 21 శాతం మంది వంశపారంపర్య నేపథ్యం ఉన్నవారే. లోక్‌సభలో అత్యధికంగా 31 శాతం మంది ఇలాంటి సభ్యులు ఉన్నారు. జాతీయపార్టీల పరంగా చూసుకుంటే కాంగ్రెస్‌లో అత్యధికంగా 32 శాతం మంది, తరువాత బీజేపీలో 18 శాతం సభ్యులే ఉన్నారు. అతితక్కువగా సీపీఐ (ఎం)లో వంశపారం పర్య నేపథ్యం ఉన్నవారు కేవలం 8 శాతం మంది ఉన్నారు. ఈ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమెక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 141 మంది వంశపారంపర్య సభ్యులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 604 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో 23 శాతం మంది వంశపారం పర్య నేపధ్యం ఉన్నారు. తరువాత మహారాష్ట్రలో 129 మంది (మొత్తం 403 మంది, 32 శాతం), బీహార్‌లో 96 మంది (మొత్తం 360 మంది, 27 శాతం), కర్నాటకలో 94 మంది (మొత్తం 326 మంది, 29 శాతం) ఉన్నారు.
శాతంపరంగా అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
ఈ నివేదిక ప్రకారం వంశపారంపర్య నేపథ్యం ఉన్న సభ్యులు విషయంలో శాతం (పర్సెంటేజ్) పరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 255 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండగా, వీరిలో 86 మంది అంటే 34 శాతం మంది వంశపారంపర్య నేపథ్యం ఉన్నవారే. దేశంలో ప్రధాన స్రవంతి రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంలో అత్యధికంగా 9 శాతం మంది ఇలాంటి సభ్యులు ఉన్నారని నివేదిక వెల్లడించింది. అలాగే, జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల్లో వంశపారంపర్య నేపథ్యం ఉన్న సభ్యులు ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ప్రాంతీయ పార్టీల్లో ఎన్‌సీపీ (శరద్‌పవార్), జేకేఎన్‌సీల్లో అత్యధికంగా 42 శాతం మంది ఇలాంటి సభ్యులు ఉన్నారు. ఈ తరువాత వైఎస్సార్‌సీపీలో 38 శాతం, తెలుగుదేశం పార్టీలో 36 శాతం, టీఎంసీలో 10 శాతం, ఎఐఏడీఎంకే లో 4 శాతం మంది ఉన్నారు. అలాగే, గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల్లోనూ చెప్పుకోతగినవిధంగా ఇలాంటి నేపథ్యం ఉన్నవా రు ఉండటం విశేషమని నివేదిక వెల్లడించింది.
ఇక పురుష సభ్యులతో పోలీస్తే, మహిళల్లో ఈ సంఖ్య భారీగా ఉందని నివేదిక తెలిపింది. పురుష ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో కేవలం 18 శాత మంది ఈ నేపథ్యం ఉన్నవారు ఉండగా, మహిళల్లో ఇది ఏకంగా 47 శాతంగా ఉంది. దేశంలో మొత్తంగా 4,665 మంది పురుష ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో 856 మంది అంటే 18 శాతం మంది వంశపారంపర్య నేపథ్యం కలిగి ఉన్నారు. దేశంలో మొత్తంగా 539 మంది మహిళా సభ్యులు ఉండగా, వీరిలో 47 శాతం అంటే 251 మందికి ఇలాంటి నేపథ్యం ఉంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషల కంటే మహిళల్లో ఇలాంటి నేపథ్యం ఎక్కువగా ఉంది. దేశంలో మొత్తంగా 94 మంది స్వతంత్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో 23 మంది అంటే 24 శాతం మందికి ఇలాంటి నేపథ్యం ఉంది. కాగా, ఈ నివేదిక దేశంలో వంశపారంపర్య నేపథ్య రాజకీయాలను ‘వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక లక్షణం’గా వర్ణించింది. గెలుపు సామర్థ్యం, అధికంగా మారుతున్న ఎన్నికల వ్యయం, రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వంటి కారణాలతో దేశ రాజకీయల్లో వంశపారంపర్య నేపథ్యం ఉన్న అభ్యర్థులు పట్టు బలంగా ఉందని, పార్టీలు కూడా సీట్ల కేటాయింపుల్లో వీరికే ప్రాధాన్యతను ఇస్తున్నాయని నివేదిక తెలిపింది.