Monday, March 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్పొరేట్లకు దేశ సంపద ధారాదత్తం

కార్పొరేట్లకు దేశ సంపద ధారాదత్తం

- Advertisement -

యుద్ధం నేపథ్యంలో పేదలపై మోడీ సర్కార్‌ భారాలు
కార్మికుల హక్కులను కాలరాస్తూ ఉపాధిహామీకి తూట్లు
ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

నవతెలంగాణ-మంచిర్యాల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోందని, పేదలు మరింత పేదరికంలోకి వెళుతుంటే ధనికులు మాత్రం మరింత ధనవంతులవుతున్నారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రయివేటు హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. యుద్ధం నేపథ్యంలో పేదలపై మోడీ సర్కార్‌ మరింత భారం మోపుతోందన్నారు. 2014లో అంబానీ ఆస్తులు రూ.14 వేల కోట్లు ఉంటే 2025 వచ్చేసరికి రూ.12 లక్షల కోట్లకు పెరిగాయని అన్నారు. దేశ ప్రధాని మోడీ దేశ సంపదను అంబానీ, ఆదానీ లాంటి సంపన్నులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. అడవుల్లో లభించే అల్యూమినియం, యురేనియం లాంటి ఖనిజ సంపదను కుబేరుల చేతుల్లో పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేట్లకు అడ్డురాకుండా అడవిలో సాయుధ పోరాటం చేస్తున్న మావోయిస్టులను పిట్టల్లా కాల్చి చంపేస్తున్నారన్నారు. అడవిలో నివసించే ఆదివాసీ అమాయక గిరిజనుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. అమెరికా, ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంతో భారతదేశంలో విపరీతమైన గ్యాస్‌ కొరత ఏర్పడిందన్నారు. గ్యాస్‌ కొరతతో దేశంలో ఉపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కన్పిస్తోందన్నారు. ఇప్పటికే గ్యాస్‌ సరఫరా లేక కర్మాగారాలు, పరిశ్రమలు, పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఎరువుల తయారీ రంగంపై దాని ప్రభావం అధికంగా ఉందన్నారు. ఒకవైపు చైనా, రష్యా లాంటి దేశాలు యుద్ధాలను ఆపాలని కోరుతుంటే భారతదేశ ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షులు ట్రాంప్‌నకు వత్తాసు పలకడం శోచనీయమన్నారు.

ఇరాన్‌, భారతదేశం మధ్య ఉన్న స్నేహ సంబంధాలను మోడీ మర్చి పోయాడన్నారు. మరిన్నిరోజులు ఇలానే యుద్ధం కొనసాగితే దేశంలో గ్యాస్‌ కొరత, చమురు ధరలు పెరిగి గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌, బండారు రవి కుమార్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, రవీందర్‌, ఆదిలాబాద్‌ జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు లంక రాఘవులు, నిర్మల్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నూతన్‌కుమార్‌, మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, మంచిర్యాల జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.ప్రకాష్‌, ఎర్మ పున్నం, బోడెంకి చందు, అశోక్‌, జిల్లా కమిటీ సభ్యులు రంజిత్‌, ప్రేమ్‌కుమార్‌, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -