నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిక కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా ఉన్న 10 ప్రధాన కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్త భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. 29 పాత కార్మిక చట్టాల స్థానంలో వచ్చిన 4 కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బంద్‌లో దేశవ్యాప్తంగా సుమారు 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటున్నారు.
ఈ సమ్మె కారణంగా ప్రధానంగా బ్యాంకింగ్, రవాణా రంగాలపై ప్రభావం పడనుంది. AIBEA వంటి పెద్ద బ్యాంక్ యూనియన్లు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్‌కు ఆటంకం కలగవచ్చు. ఒడిశా, కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బస్సు సర్వీసులు, ఆటోలు, ట్యాక్సీలు పాక్షికంగా నిలిచిపోనున్నాయి. కొన్ని చోట్ల విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించగా, ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
అత్యవసర సేవలకు మాత్రం భారత్ బంద్ నుండి మినహాయింపునిచ్చారు. ఆస్పత్రులు, అంబులెన్స్ సేవలు, మెడికల్ షాపులు, పాలు, న్యూస్ పేపర్ పంపిణీ యథావిధిగా కొనసాగుతాయి. మెట్రో రైళ్లు, విమాన సర్వీసులు సాధారణంగానే నడుస్తున్నప్పటికీ, స్థానిక రవాణా ఇబ్బందుల వల్ల ప్రయాణికులు స్టేషన్లకు చేరుకోవడం కష్టతరంగా మారవచ్చు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసు యంత్రాంగం అన్ని ప్రధాన నగరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసింది.



