Sunday, October 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రయివేటు రంగంలో రిజర్వేషన్లకు దేశవ్యాప్త ఉద్యమం

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లకు దేశవ్యాప్త ఉద్యమం

- Advertisement -

వికలాంగుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం:ఎన్‌పీఆర్‌డీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్‌
జీఓ 34ను అమలు చేయాలి : ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య
ఈసీఐఎల్‌లో జాతీయ సదస్సు
నవతెలంగాణ-కాప్రా

వికలాంగులకు ప్రయివేట్‌ రంగంలో రిజర్వేషన్ల కోసం దేశ వ్యాప్త ఉద్యమం చేస్తామని ఎన్‌పీఆర్‌డీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్‌ తెలిపారు. ఎన్‌పీఆర్‌డీ కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్‌ కమలానగర్‌లోని ఎన్‌వీ భాస్కర్‌రావు భవన్‌లో శనివారం ”వికలాంగుల విద్యా – ఉపాధి, చట్టాల అమలు, అనుభవాలు” అనే అంశంపై రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్‌ అధ్యక్షతన జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మురళీధరన్‌ మాట్లాడుతూ.. ఒకే దేశం, ఒకే ఎన్నిక గురించి మాట్లాడుతున్న మోడీ ఒకే పెన్షన్‌ కోసం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వికలాంగులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. వికలాంగుల పట్ల వివక్షత, అసమానతలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 25 శాతం వికలాంగులకు అదనంగా ఇవ్వాలని చట్టంలో ఉన్నా అమలు చేయడం లేదన్నారు. సుగమ్య భారత అభియాన్‌ పథకం అమలులో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇంక్లూసివ్‌ ఎడ్యుకేషన్‌ నినాదానికే పరిమితం అవుతున్నదని చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ విద్యాసంస్థల్లో స్పెషల్‌ టీచర్‌లను నియమించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 2012 నుంచి కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ నేషనల్‌ డిసెబుల్డ్‌ పెన్షన్‌ రూ.300 మాత్రమే ఇస్తోందని తెలిపారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్రం వాటా రూ.5000కు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలలో 4 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌ లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో నిధుల కోత విధిస్తున్నారని, ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్‌పరం చేసి వికలాంగుల రిజర్వేషన్లను తీసివేయాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల చట్టాలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తిప్పికొడతామన్నారు.

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల కార్పొరేషన్‌ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా 2023లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 34ను అమలు చేయాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 23 నెలలవుతున్నా పెన్షన్‌ ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టి.వరమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌, ఉపాధ్యక్షులు యశోద, కాషప్ప, ఉపేందర్‌ అరిఫా, మధుబాబు సహాయ కార్యదర్శులు రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రమోహన్‌, ప్రకాష్‌, దుర్గ, కవిత, భాగ్యలక్ష్మి, బాలయ్య, నర్సింలు, ప్రభుస్వామి, లలిత, షాయిన్‌ బేగం, రమేష్‌, మల్లేష్‌, యాదయ్య, నగేష్‌, వెంకన్న, రాజు, లక్ష్మి పతి, బంగారయ్యతో పాటు వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -