Friday, June 27, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిరష్యా, చైనాలను సాకుగా చూపుతున్న నాటో

రష్యా, చైనాలను సాకుగా చూపుతున్న నాటో

- Advertisement -

సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ను బూచిగా చూపి ఉత్తర అట్లాంటిక్‌ దేశాల కూటమి(నాటో)ని అమెరికా ఉనికిలోకి తీసుకువచ్చింది. ఆ సోవియట్‌ ఇప్పుడు ఉనికిలో లేకున్నా రష్యాతో ఐరోపాకు ముప్పు ఉందంటూ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు చైనా ముప్పు కూడా తలెత్తిందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. నాటో సభ్య దేశాల మిలిటరీ బడ్జెట్‌లను జీడీపీలో రెండు నుంచి రానున్న పదేండ్లలో ఐదుశాతానికి పెంచాలని నిర్ణయించటం ప్రపంచాన్ని మరింతగా ఉద్రిక్తతలవైపు నెట్టటం తప్ప మరొకటి కాదు. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో మంగళ, బుధవారాల్లో జరిగిన కూటమి సమావేశాలు సరికొత్త ఆయుధపోటీకి, ఐరోపాలో సామాజిక సంక్షోభానికి తెరతీశాయి.అన్ని దేశాల మిలిటరీ ఖర్చులో నాటోలోని 31దేశాల వాటా 55శాతం ఉంది. ఇప్పుడు దాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేయనున్నారు. ఆయుధీకరణతో లొంగని దేశాలను భయపెడుతున్న కారణంగానే నిలిపివేసిన అణు కార్యక్రమాన్ని ఇరాన్‌ ప్రారంభించింది, ఆ పేరుతో ఇజ్రాయిల్‌, అమెరికా దాడి చేశాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో జరగబోయేదేమిటి? ఇరాన్‌, ఇజ్రాయిల్‌, అమెరికా మూడూ, వాటి అనుభవాన్ని చూసిన ఇతర దేశాలూ తమ ఆయుధాలకు మరింత పదును పెట్టుకోబోతు న్నాయి. నాటో నిర్ణయం కూడా దానికే దోహ దం చేయనుంది. ఇరాన్‌ మీద ట్రంప్‌ చేయిం చిన దాడిని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రూటే బరితెగించి పొగడ టాన్ని ఏమనాలి.
ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తే భయపడేరోజులు కావివి. సోవియట్‌, తర్వాత రష్యా నుంచి ఐరోపాకు ముప్పువచ్చిందంటూ కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే పేరుతో ఐరోపాను తన గుప్పెట్లో పెట్టుకొనేందుకు అమెరికా నాటోకు పురుడు పోసింది. పోనీ ఏడున్నర దశాబ్దాల తర్వాత ఇంకా ఖర్చు పెంచాలంటున్నారంటే అర్ధం రక్షణ ముసు గులో ఆయుధాలు అమ్ముకోవటమే! నిజమైన రక్షణ ఇతర దేశాలకు ముప్పుతలపెట్టకుండా ఉండటం, కానీ నాటో చేసిందేమిటి? రష్యా సరిహద్దులకు విస్తరించ బోమని చెప్పి ఉక్రెయిన్‌కు సభ్యత్వమిచ్చి మాస్కో ముంగిట ఆయుధాలను పెట్టేందుకు చేసిన యత్నమే కదా వర్తమాన సంక్షోభానికి మూలం. రక్షణ మాట అటుంచి యావత్‌ తూర్పు ఐరోపా ఇప్పుడు అమెరికా రుద్దిన సంక్షోభానికి బలవుతున్నది. ఉక్రెయిన్‌ పేరుతో పశ్చిమ ఐరోపా ధనిక దేశాలన్నీ పాత ఆయుధా లన్నింటినీ వదిలించి తమ కొత్త ఆయుధాలను అమ్ముకుంటూ లాభాలు పిండుకుంటున్నాయి. తైవాన్‌ను సమస్యగా ముందుకు తెచ్చి చైనాను బూచిగా చూపి ఆప్రాంత దేశాలను కూడగట్టేందుకు ఆసియా మిలిటరీ కూటమి ఏర్పాటు లేదా నాటో విస్తరణకు పూనుకు న్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంత భద్రత ముసుగులో ఇండో-పసిఫిక్‌ ఫోర్‌(ఐపి4) పేరుతో జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణ కొరియాలతో పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో ఒక కొత్తకూటమి లేదా నాటో విస్తరణకు నాంది కాదా? దీన్ని నడిపించేది అమెరికా, ఈ దేశాలకు ఎవరి నుంచి ముప్పు ఉందని చెబుతున్నారు?చైనా నౌకాదళం ఇప్పటికే అమెరికాతో సమంగా ఉందని, 2030నాటికి వెయ్యి అణ్వాయుధాలను బీజింగ్‌ సమకూర్చుకోనుందని బూతద్దంలో పెట్టి చూపుతున్నారు. జపాన్‌, దక్షిణ కొరియా, ఇతర ప్రాంతాల్లో వేలాది మంది మిలిటరీని, సైనిక కేంద్రాలను అమెరికా దేనికి నిర్వహిస్తున్నట్లు? ఎవరికి ముప్పు తలపెట్టినట్టు?
జీడీపీలో రెండు నుంచి ఐదుశాతానికి ఐరోపా దేశాలు మిలిటరీ ఖర్చు పెంచాలని అమెరికా ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తున్నది, మీ భద్రతకు తామెందుకు ఖర్చు పెట్టాలని, తమకు వచ్చే లాభమేంటని వాదిస్తున్నది. నాటోలో జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌ దేశాలు అమెరికాతో కలసి ఆయుధ వ్యాపారంలో లాభాలు పెంచుకొనేందుకు చూస్తున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా పోరు కొనసాగాల్సిందే అంటున్నాయి. పదేండ్లలో ఐదుశాతానికి పెంచాలంటే తాము ఐదేండ్లలోనే ఆపని చేస్తామని జర్మనీ చెప్పింది. ఈ నిర్ణయంతో అమెరికా ఆర్థిక సమస్యల భారాన్ని ఐరోపా దేశాలు కొంత తగ్గించవచ్చుగానీ మిలిటరీ ఖర్చు పెంచటం అంటే సంక్షేమానికి కోతపెట్టటమే, దాంతో తమ దేశాల్లో తలెత్తే సామాజిక సంక్షోభాలను పాలకులు పట్టించు కోవటం లేదు. నాటోలోని తొమ్మిది దేశాలు ఇప్పటికే నిర్ణయిం చిన రెండు శాతాన్ని కూడా కేటాయించలేని స్థితిలో ఐదు శాతానికి ఎలా చేరతాయి? స్పెయిన్‌ 1.4శాతమే ఉంది, తాము అమలు జరపలేమంటే వాణిజ్య ఒప్పందం, ఆంక్షల కత్తి చూపి డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించి ఒప్పించాడు. బెల్జియం, స్లోవేకియా కూడా అభ్యంతరాలు తెలిపాయి. ఇలా ంటి దేశాలన్నీ నిధులను మిలిటరీకి మళ్లించటం అంటే కార్మికవర్గ జీవితాలకు ముప్పు వాటిల్లినట్టే. అందుకే నాటో చర్య ఐరోపాలో సామాజిక సంక్షోభానికి నాంది అని చెప్పవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -