Wednesday, March 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేశానికే ఆదర్శంగా తెలంగాణలో ప్రకృతి వ్యవసాయం

దేశానికే ఆదర్శంగా తెలంగాణలో ప్రకృతి వ్యవసాయం

- Advertisement -

61,125 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగుకు ప్రణాళిక
– ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తులకు డిమాండ్‌
– 20 నుండి నర్మెట్టలో రైతు మహోత్సవం
– 22న సీఎం చేతుల మీదుగా రైతు భరోసా నిధుల విడుదల : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశానికే ఆదర్శంగా తెలంగాణలో ప్రకృతి వ్యవసాయం ఉండబోతున్నదనీ, 61,125 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా రైతులకు ఫార్మర్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈ విధానాన్ని అవలంబించాలని సూచించారు. రూ.42 కోట్లతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్టు, దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 489 క్లస్టర్లు దాదాపు 61,125 ఎకరాలలో ఈ సంవత్సరం ప్రకతి వ్యవసాయం సాగు విధానంలోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికా రూపొందిస్తున్నట్టు వివరించారు. సాగులో, మార్కెటింగ్‌లో తోడ్పడే విధంగా కృషిసఖిలను క్లస్టర్‌కు ఇద్దరు చొప్పన నెలకి రూ.5 వేలు గౌరవ వేతనం ఇచ్చి నియమించామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన బీజామృతం, జీవామృతం, దశపర్ణి వంటి జీవ ఉత్పాదకాలు స్వయంగా తయారు చేసుకోలేని రైతుల కోసం ప్రభుత్వం జీవ ఉత్పాదక తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నామనీ, ప్రతి బీఆర్‌సీకి లక్ష రూపాయల చొప్పున కేటాయించామని చెప్పారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న నర్మెట్టలో రైతు మహోత్సవాన్ని ప్రారంభిస్తున్నామనీ, అందులో రైతులు, ఆదర్శరైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహోత్సవంలో వ్యవసాయ, పశుసంవర్ధక, అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే దాదాపు 150 ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 22న నర్మెట్టలో సీఎం చేతుల మీదుగా మొదటి విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 20,600 కోట్ల రైతు రుణమాఫీ ఒకే దఫాలో విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నూనె గింజలు, పప్పుదినుసులు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆయిల్‌ పామ్‌ సాగు రైతులకు స్థిరమైన ఆదాయం అందించడంలో సహకరిస్తుందనీ, ప్రకృతి విపత్తులు, పక్షులు, జంతువుల వల్ల కలిగే నష్టాలు తక్కువగా ఉంటాయని మంత్రి వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -