Sunday, July 6, 2025
E-PAPER
Homeజోష్సహజంగా పలికే తంగేడువనం

సహజంగా పలికే తంగేడువనం

- Advertisement -

వాల్ట్‌ విట్మన్‌ ఒక గొప్ప మాట చెప్పాడు
To have great poets, there must be
great audiences too.”
”మంచి కవులు ఉండాలంటే, గొప్ప పాఠకులు కూడా ఉండాలి,” ఇదే మాట మరోరకంగా ప్రముఖ ఉర్దూ కవి మగ్దూం చెప్పాడు. కవిత్వం రాయడమే కాదు, చదవడం కూడా ఒక కళ అని.

కాని సాధారణ ప్రజల కోసం సాధారణ ప్రజల భాషలో రాయబడిన కవితలకు సాధారణ ప్రజలే గొప్ప పాఠకులు. కవిత్వాన్ని చదివే కళాహదయులు. సాధారణ ప్రజల భాషలో, సగటు మనిషి జీవితం గురించి రాసినప్పుడు ప్రతి పాఠకుడు గొప్ప పాఠకుడే. అలా ప్రతి పాఠకుడిని గొప్ప పాఠకుడిగా మార్చే కవిత్వం ఈ పుస్తకంలో ఉంది.
ఉదాహరణకు ఈ పుస్తకంలోని ‘నిత్యచరిత్రకారుడు’ కవితలోని పంక్తులు చూడండి:
”అతడు/ భూమి పొరల్లోని/ విత్తనాలకు పురుడుపోసే మంత్రసాని/ అతడు కాళ్ళు పొలంలో మోపితే/ బీడు పొలమంతా/ పచ్చని సిర గడుతది/ అతడు/ అందరినీ అందలమెక్కించే/ అలుపెరుగని అన్నదాత”
ఈ కవితా పంక్తులు సరళమైన భాషలో, అద్భుతమైన పోలికలు ప్రతీకలతో రైతును పరిచయం చేయడమే కాదు, రైతు పనిని పరిచయం చేశాయి. మొదటి పంక్తి నుంచి ఈ కవిత పాఠకుడితో సూటిగా మాట్లాడుతుంది.
ఇప్పుడు మనిషి జీవితం పరుగులమయమైపోయింది. ఈ పరుగుల అడుగుల చప్పుళ్ళలో మానవీయ సున్నిత భావాల గుసగుసలు మరుగున పడిపోతున్నాయి. మానవీయ స్పందనలే మనిషి చరిత్రను రాశాయి. కవిత్వం మనిషిని అతని మూలాలకు తీసుకువెళుతుంది. ఈ సంపుటిలో కవితలు గంభీర పదాడంబరాల కవితలు కావు. భూమ్మీద నిలబడి సగటు మనిషి మాట్లాడే భాషలో పాఠకుడి మనసును తట్టే కవితలివి. ‘నాయిన’ కవిత నిజానికి తండ్రి గురించి రాసిన కవిత, కాని మనిషిలో ఉండవలసిన మానవీయ స్పందనలను ప్రకటించే కవిత.
”నేను జాపిన చేతులు/ నువ్వు జాపొద్దంటడు/ నేను మోసిన మట్టిగంపను/ మళ్ళీ నువ్వు లేపొద్దంటడు/ నేను కాలమైనా/ నీ కనులకు కాంతిగా నిలిచిపోతానండు”
ఈ కవితలోని భాష సగటు గ్రామీణ భాష. ప్రతి వాక్యం మనిషి గుండెను తట్టే వాక్యం. సరళమైన పదాలు, సులభమైన గ్రామీణ భాష, కూడళ్ళలో, చావిళ్ళలో పదిమంది కలిసి మాట్లాడుకునే, మనసులోని మాటలు పంచుకునే భాషలో ఈ కవితలు మాట్లాడుతున్నాయి. స్వచ్ఛమైన వర్షపు చినుకుల్లా కురిసే పదాలు నిరాడంబరమైన అభివ్యక్తిలోని నిష్కల్మష సౌందర్యాన్ని చూపిస్తాయి. రోజువారి జీవితంలోని కష్టాలు, కన్నీళ్ళు, మినుకు మినుకుమంటున్న ఆశల మిలమిలలు పాఠకుడిని ఆలోచించేలా చేస్తాయి. ‘నాగలి’ కవిత యావత్తు ప్రతీకాత్మకంగా ఎలాంటి అద్భుతమైన భావాలను పాఠకుడిలో కలిగిస్తుందో చూడండి.
”ఎక్కడో అడవితల్లి/ గర్భాన పురుడు పోసుకుని/ పెరిగి పెద్దదై/ వడ్లవారి ఇంటిని పలకరించి/ బీడు బతుకులను నిలబెట్టే/ నిజమైన నిట్టాడి నాగలి…/ ఇప్పుడు ట్రాక్టర్‌ ఎంత రొప్పినా/ నాగలి సాలుకు సాటి పోటి/ తైద గింజంత కానే కాదు/ నాగలి రైతు భుజాన బలం/ పేదోడి ఇంటి ముందు ధనరాశి”
ఈ కవితల్లో వర్తమాన జీవన వాస్తవికతను మాత్రమే కాదు, ఇందులో దాగి ఉన్న మానవీయతను వినూత్నంగా కవి ఆవిష్కరించాడు. రోజువారి బతుకులో నుడికారం కవితలకు అలంకారమయ్యింది.
టి.యస్‌. ఇలియట్‌ ఏమన్నాడంటే –
‘genuine poetry can communicate
before it is understood.” ఈ పుస్తకంలోని కవితలు పాఠకుడితో మాట్లాడుతాయి. ముచ్చటిస్తాయి. అనునయిస్తాయి. ఆనందపరుస్తాయి. ఈ కమ్యునికేషన్‌ కవిత అర్థం కాకముందే ప్రారంభంనుంచే మొదలవుతుంది. ప్రతి అక్షరం పాఠకుడిని పలుకరిస్తుంది. ప్రతి పదం కవితకు ఆవల నిలబడి తన కథను ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఈ అనుభూతి కావాలంటే ‘ఎడ్లబండి’ కవిత చదవండి
”గంజినీళ్ళు తాగేటోళ్ళకు/ ఎడ్లబండే బెంజికారు/ లోకాన్ని మోసినా/ యంత్రాల పరుగుపందెంలో/ ఎడ్లబండి సీల ఊడిపోయింది”
ఈ సంపుటిలోని కొన్ని కవితలు ఆత్మాశ్రయ కవితలుగా, ఒక పూర్తి తరం అనుభవాల జానాన్ని పంచే స్వరాలుగా వినిపిస్తాయి. సంభాషణాత్మకంగా పాఠకుడితో ముచ్చటించే కవితలు కూడా ఇందులో ఉన్నాయి. పాబ్లో నెరుడా ”poetry is an act of peace,” అన్నాడు. ఈ కవిత్వాన్ని చదివితే నెరుడా మాటలను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సామాజిక, కాలిక ఒత్తిళ్ళలో మధ్య ఒక అనిర్వచనీయమైన ఓదార్పు, సాంత్వన ఈ కవితల్లో ఉన్నాయి. ‘ఎనగర్ర’ అనే కవితలో-
”అక్కడ కొన్ని విత్తనాలు చల్లాలి/ ఎండకు ఎండిపోకుండా/ చలికి వనికి పోకుండా/ వాన గాలికి విరిగిపోకుండా/ సక్కగా నిలబడే మొక్కలు నాటాలి/ పెద్దోడి బంగ్లాకు ఇరుసు లెక్క గాకుండా/ పేదోడి గుడిసెకు ఎనగర్ర లెక్క ఉండే/ వనాలను పెంచాలి.”
నిజానికి ఈ కవితలను చదువుతున్నప్పుడు కవి స్వరం పాఠకుడితో మాట్లాడుతున్నట్లు, పాఠకుడు వింటున్న అనుభూతి కలుగుతుంది. ఇది గుండె భాష. సామూహిక అంతంఃచేతన సారాంశమే కవిత్వం. మనిషి మానసికంలో కలనేతల జిగిబిగి అక్షరాల అంతరార్థాలను విప్పి చెబుతుంది కవిత్వం. ఒక సమాజంలో సామూహిక అంతఃచేతన లోతుల్లోకి తొంగిచూసే కిటికిగా కవిత ఉపయోగపడుతుంది. కార్ల్‌ జంగ్‌ ఇదే మాట చెప్పాడు
‘The poet…speaks with the voice of the collective unconscious,,”
అనుదిన సాధారణంగా కొనసాగే జీవితాల్లో దాగి ఉన్న సంఘర్షణలు, ఒత్తిళ్లు, కన్నీళ్ళు, ఆశలు, ఆకాంక్షలు ఇవన్నీ కవితాక్షరాలుగా పాఠకుడి ముందుకు వచ్చినప్పుడు ఆ అక్షరాల ధ్వనులు పాఠకుడి గొంతుగా నిలబడతాయి. కవి కేవలం జీవితాన్ని పరిశీలించేవాడు మాత్రమే కాదు, జీవితాన్ని వడబోసి సారాన్ని పంచేవాడు. ”రేపటికై” కవితలో కవి ఇలా అన్నాడు –
”ఈ క్షణం/ ఇక్కడ దట్టమైన అరణ్యమే ఉండొచ్చు/ కానీ/ కాలం మౌనంగా ఉండిపోదు/ నవాబు లెక్క జవాబు చెప్పకుండా ఉండిపోదు/ నిజమైన దోషిని/ ఏదో ఒకరోజు/ బజారున నగంగా నిలబెడుతది”
సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ చెప్పిన streams of consciousness వంటి ఆలోచనల, ఆవేదనల, ఆవేశాల ప్రవాహాలు పాఠకుడిని ముంచెత్తుతాయి. ఈ సంపుటిలో జీవితం ఉంది, పేదల బతుకులున్నాయి. గ్రామీణజీవనం ఉంది. అణిచివేతలపై ఆక్రోశం ఉంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రమే కాదు, మనలో ఉన్న ప్రపంచాన్ని కూడా చూపించే కవిత్వం ఇది.
ఈ కవితలు సామాజిక చైతన్యానికి బాటలు పరిచే కవితలు. అణగారిన సామూహిక చైతన్యాన్ని తట్టిలేపే కవితలు. రైనర్‌ మారియా ఏమన్నాడంటే – ”ªFor
the sake of a single verse, one must see many cities, men, and things, one must know the animals, and must feel how the birds fly, and now the gesture which small flowers make when they open in the morning ” అలాంటి లోతయిన పరిశీలను, తీవ్రమైన మధనం, అనంతమైన అంతర్దష్టితో రాసిన కవిత్వం ఇది.
కెపి లక్ష్మీనరసింహ బహుముఖీన ప్రజ్ఞావంతుడు. పాటలు రాస్తాడు. పాడతాడు. రికార్డు చేస్తాడు. కెమెరాలతో గ్రామీణ జీవితాన్ని చిత్రిస్తాడు. ఊళ్లను ప్రేమిస్తాడు. ఊళ్ళ సహజసౌందర్యాన్ని, బతుకుల గతుకుల్ని చూపెడతాడు. ఇరాం లేని మనిషి. కవిత్వమూ రాస్తాడు. కవిత్వంలో మెరుగైన దశకు చేరుకోవాలని తపిస్తూ కషి చేస్తుంటాడు. ఇప్పుడు ఈ తంగేడువనంతో ముందుకొస్తున్నాడు.
అతనికి జయహోలు!
కవి యాకూబ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -