”ఒక పసిగుడ్డు కాళ్లూ చేతులూ తెగ్గోసి వేళ్లాడదీసిన దృశ్యంకంటే ఘోరంగా, నడవలేని వృద్ధుడి పొట్టలో కత్తిదింపి పేగుల్ని బహిర్గతపరచిన దృశ్యంకన్నా దారుణంగా, పురిటినొప్పులు పడుతున్న ఒక స్త్రీపై లైంగికదాడి జరిపే కామాంధుడికన్నా వికారంగా నాకీ దేశపు వర్తమానం ఇంకా ఘోరంగా, దారుణంగా, వికారంగా కనిపిస్తుంది” అంటాడు అలిశెట్టి ప్రభాకర్. ఎప్పుడో రాసిన ఆయన మాటల్ని ఈరోజు యుద్ధ సందర్భాన మనదేశం తీసుకున్న వైఖరిని, మౌనాన్ని చూస్తుంటే సరిపోతాయని అనిపిస్తోంది. మనం ప్రత్యక్షంగా దారుణాలు, హత్యలు చేయక్కర్లేదు. ఆ దుర్మార్గాలను చూస్తూ స్పందించక, ఉదాసీనంగా, అసలు మనకేమీ సంబంధం లేనట్టు ఉండిపోవడం, అసలు నేరంకన్నా తీవ్రమైనది. దారుణమైనది. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి, ఇరాన్‌పై చేస్తున్న యుద్ధ బీభత్సాన్ని, జరుగుతున్న మానవ హననాన్ని చూస్తూ మౌనంగా ఉండటం, భారతీయతత్వానికి, హృదయానికి పూర్తి వ్యతిరేకమైనది. మనదేశపు వారసత్వ సంప్రదాయానికి, ఇక్కడి ప్రజాస్పందనలకు వ్యతిరేకమైనది. ఇలా వ్యవహరించడం చాలా వికారంగానూ ఘోరంగాను కనిపిస్తున్నది.
164మంది ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చదువుతున్న చిన్నారులు ఈ ప్రపంచానికీ కొత్తగా పరిచయమవుతున్న వాళ్లు, ‘పాపం, పుణ్యం, ప్రపంచమార్గం, కష్టం సౌఖ్యం శేషార్థాలు, ఏమీ ఎరుగని’ పులుగులు. మెరుపు మెరిస్తే వానకురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే, అది నాకే అనుకుని’ మురిసిపోయే పసికందులు.. వాళ్లు తరగతి గదిలోనే ఉండగా, మంటల బాంబులు, క్షిపణులు విరుచుకుపడగా, మాంసం ముద్దలుగా ఎగిరిగోడలపైకి చిందిపడ్డ దృశ్యాలను ఎలా చూడగలము! మానవ హృదయమన్నది ఉంటే, ఎలా తట్టుకోగలదు! ఆ తల్లుల కడుపుకోతను ఈ ప్రపంచం ఓదార్చగలదా! సామాన్యులపైన, పిల్లలపైన బాంబులువేసి చంపుతున్న వాళ్లు, మేము శాంతి కోసం, న్యాయం కోసం యుద్ధం చేస్తున్నామని చెబుతున్న మాటలకు ఏమైనా అర్థం ఉన్నదా! ఇజ్రాయిల్, అమెరికా మాటలను ఇప్పటికీ తలలాడిస్తూ వింటున్న దేశాలకు, మనుషులకు, నాయకులకు కించిత్ మానవ లక్షణముంటే ఎంతబావుండు! ఇట్లాంటి ఘటన జరిగి వరుసగా పిల్లల శవాలను సమాధి చేస్తున్న చిత్రాన్ని కూడా చూసి, తానేమీ చూడనట్టు, తనకేమీ కానట్టు మౌనంగా ఉండిపోయిన 140 కోట్ల ప్రజల దేశపు ప్రతినిధిని చూస్తే నిజంగా అలిశెట్టి చెప్పినట్టు వర్తమానమంతా దారుణంగా, వికారంగా కనిపించటం లేదా! ఇంతటి నరహంతకులతో ఆలింగనాలు చేసి, ఎంతో ప్రేమను ఒలకబోసి, మేము మీకు అండగా ఉంటాము. శాంతికి సహకరిస్తామని వాగ్దానం చేసిన మన దేశ నాయకున్ని చూస్తే అసహ్యమేయటం లేదూ!
పాముకు పాలు, చీమకు పంచదారవేసి, నేలపైని సమస్త జీవుల యెడల కారుణ్యతను చూపిన నేల ఇది. సత్యము, అహింస, పరమధర్మాలుగా బోధించిన భూమి ఇది. ప్రపంచానికి ఆదర్శ మార్గాలను సూచించిన బుద్ధుడు, వర్థమాన మహావీరుడు జన్మించిన స్థలమిది. సేవను, సహోదరత్వాన్ని బోధించిన పరమహంసలు నడయాడిన ప్రాంతమిది. సమస్త ఆలోచనలను, ఆచరణలను, సంస్కృతులను స్వీకరించిన ఈ దేశ ఔన్నత్యాన్ని ఎంత నిర్దాక్షణ్యంగా పాతరేస్తున్నారు నేటి నాయకులు! తమ జాతిపక్షులు చనిపోతే, అయ్యో అని పక్షులన్నీ మూగుతాయి కదా! అంతమంది పిల్లలు చనిపోతే ఒక్కమాట సంతాపం ప్రకటించడానికి నోరురాకపోవడం చూస్తే, అగ్రరాజ్య అమెరికాకు ఎంత భయపడిపోతున్నాడో ఇట్టే అర్థమైపోతుంది. మన విశాఖ పట్టణానికి నౌకా విన్యాసాలలో పాల్గొనేందుకు వచ్చిన ఇరాన్ నౌకను, తిరిగివారి దేశం వెళుతుండగా శ్రీలంక సమీపంలో హిందూ మహాసముద్రంలో అమెరికా ముంచేసి పేల్చివేస్తే కూడా కిమ్మనకుండా నోరు మూసుకుని మన దేశం ఉందంటే, స్వతంత్రతను, అన్యాయాన్ని అన్యాయమని చెప్పే ధైర్యాన్ని ఎంత కోల్పోయామో తెలుస్తున్నది కదూ!
చమురు నిల్వలు పడిపోతున్న తరుణంలో భారతదేశంపై ఎంతో కరుణతో ఒక నెల రోజులవరకు రష్యా నుండి చమురు కొనుగోలు చేసుకోవచ్చని, ఒక స్వేచ్ఛను ప్రసాదించింది అమెరికా. మనవాడు చేతులు కట్టుకునిమరీ తలూపడం ఎంత వికారమో కదా! ఇంత వెన్నెముకలేనితనమా! ఇరాన్ పర్షియా దేశం కొన్ని శతాబ్దాలుగా మనతో సంబంధాలున్న దేశమది. మిత్రదేశం కూడా సంస్కృతి పరంగా, ఆర్థికంగా కూడా ఎన్నో యేండ్ల బంధమది. అట్లాంటి దేశపు నేతను దాడిచేసి చంపితే మాట కూడా పెగలకపోవడం, విచారం ప్రకటిం చకపోవడం ఏరకమైన దౌత్యనీతి. పసిపిల్లల మరణానికీ చలించని పాషాణం నేత హృదయం!
వికారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



