మందనపెల్లి స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొన్న బీర్ల ఐలయ్య
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం మందనపెల్లి గ్రామంలో కొనసాగుతున్న స్వచ్ఛత కార్యక్రమానికి నవతెలంగాణలో వచ్చిన కథనానికి స్పందన లభించింది. సోమవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రామాన్ని సందర్శించి స్వచ్ఛ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, డ్రైనేజీ సమస్యలపై నవతెలంగాణలో ప్రచురితమైన కథనం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించిన ఆయన గ్రామానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రత పనుల్లో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. స్వచ్ఛత కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, గ్రామపంచాయతీ, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు,పార్టీ నాయకులు, గ్రామస్థులు, పారిశుద్ధ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నవతెలంగాణ కథనంతో సమస్యపై స్పందన రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.



