నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన వి. నవీన్ యాదవ్ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అజహరుద్దీన్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, లెజిస్లేచర్ సెక్రటరీ వి. నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.
రుణపడి ఉంటా : నవీన్ యాదవ్
ప్రమాణ స్వీకారం అనంతరం నవీన్ యాదవ్ అసెంబ్లీ నుంచి బయల్దేరి భారీ ప్రదర్శనగా గాంధీభవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… తనను ఎమ్మెల్యేగా గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు సదా రుణపడి ఉంటానని అన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతానని హామీనిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరింత కష్టపడి పని చేస్తానని తెలిపారు. భారత రాజ్యాంగ వజ్రోత్సవాల వేళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



