Friday, September 12, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఎన్సీఇఆర్టీ నిర్వాకం, భావితరాల ప్రగతికి ఆటంకం!

ఎన్సీఇఆర్టీ నిర్వాకం, భావితరాల ప్రగతికి ఆటంకం!

- Advertisement -

ప్రారంభమైన అరవై నాలుగేండ్ల తర్వాత- ఎన్సీఇఆర్టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ తన అస్థిత్వాన్ని కోల్పోయింది. ఇది ప్రజాస్వామ్య దేశమన్నది మరిచి, అధికారంలో ఉన్నవారికి అనుగుణంగా తిరోగమనంలోకి వెళ్లింది. జీవ పరిణామ సిద్ధాంతం -సైన్సు పాఠ్య పుస్తకాల్లోంచి తీసివేయడమే కాకుండా, ఢిల్లీ సుల్తానులు, మొఘలుల ప్రసక్తి లేకుండా సిలబస్‌ ఏర్పాటు చేశారు. హిందూ తీర్థస్థలాల విశేషాలు, కుంభమేళా వంటి అహేతుకమైన అనవసర విషయాలు అందులో చేర్చారు. పరిశీలించదలిచిన వారు EXPLORING SOCIETY: INDIA AND BEYOND గ్రేడ్‌ 6-8కి నిర్దేశించిన సోషల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకం చూడొచ్చు. పాఠ్యాంశాల విషయంలో యన్సీఇఆర్టీ వారు అహేతుకమైన నిర్ణయాలు తీసుకుని, తాము హేతుబద్ధంగా ఈ మార్పులు చేర్పులు చేశామని చెప్పుకున్నారు. అసలు హేతుబద్ధత అంటే ఏమిటీ?- నిజాయితీ అంటే ఏమిటీ ? నిజాలు అంటే ఏవీ – అనే విషయాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారికి తెలిసినట్టు లేదు. కనీసం ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ సంస్థ అధికారులక్కూడా తెలిసినట్టు లేదు. ఒక వేళ తెలిసినా, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మనసులు చంపుకుని ప్రభుత్వాధినేతల సూచనల మేరకు విధులు నిర్వర్తిస్తున్నటుగా ఉంది. రాజ్యాంగాన్నీ, తమ పదవులకు ఉన్న బాధ్యతల్ని పక్కకు నెట్టేసినట్లుంది. మనం మన రాజ్యాంగంలో రాసుకున్నట్టు వైజ్ఞానిక స్పృహ (51 ఎ-హెచ్‌)కు విఘాతం కలుగు తున్నందువల్ల, భావితరాలన్న అంధకారంలో కూరుకు పోబోతున్నాయి గనక, దేశ పౌరులందరూ ఈ విషయాల మీద దృష్టి సారించాల్సి ఉంది! సహేతుకమైన పాఠ్యప్రణాళిక కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిఉంది!!

హిందుత్వను, తమ హిందూ రాష్ట్ర సాధన ఉద్దేశాన్ని పసిపిల్లల మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నది అందుకే కదా? హిందూ తీర్థస్థలాల విశేషాలు పాఠాల్లో చేర్చడం దేనికీ? అత్యంత అనాగరికమైన మహా కుంభమేళా గురించి ఒక కొత్తపాఠం చేర్చారెందుకూ? వీటి వల్ల ప్రపంచ జ్ఞానం కలుగుతుందా? వివేచన పెరుగుతుందా? ఒకప్పుడు దేశ విదేశాల్లో విస్తృత ప్రచారంలో ఉన్న బౌద్ధాన్ని నాశనం చేసిన ఘనుల వంశం – శృంగవంశం! ఆ శృంగవంశం గురించి పిల్లలకు పాఠం పెడతారా? ఎంత అమానుషం? అది ఒక హంతకుల వంశం కదా? తమ హైందవ మత ప్రచారం కోసం బౌద్ధభిక్షుల తలలు నరికించిన అమానవీయమైన వంశం కదా అదీ? ఒక్కొక్క బౌద్ధ భిక్కు తలకు వంద బంగారు నాణాలిచ్చి, హత్యల్ని పోత్సహించిన వంశం కదా అదీ? అవును మరి, నేటి కేంద్ర ప్రభుత్వాధిóనేతలకు అలాంటి వంశాలే నచ్చుతాయి. కారణం వీరు కూడా గుజరాత్‌, మణిపూర్‌ మారణకాండలు జరిపించిన వారే కదా? దళితుల్ని, మైనార్టీలను ఊచకోత కోస్తున్నవారే కదా? ధర్మం పేరుతో అధర్మ పరిపాలన చేస్తున్న వారేకదా? అయినా, ఆయా పాఠ్యపుస్తకాల్లో వాస్తవ చరిత్ర బోధిస్తారన్న నమ్మకమేముందీ? అభూత కల్పనలతో పిట్టకథలు అల్లి చెపుతారేమో? గత పదకొండేండ్లుగా అధికారంలో ఉన్న ఈ ఆరెస్సెస్‌ – బీజేపీ ప్రభుత్వం అబద్దాలతో విద్వేషాన్నే కదా ప్రచారం చేస్తున్నదీ?

మీడియా సంస్థల్ని కొన్నది సరిపోలేదు. ఈడి, సిబిఐ, కోర్టులు వంటి వ్యవస్థల్ని ధ్వంసం చేసింది సరిపోలేదు. పుల్వామా, పహల్గాం, ఆపరేషన్‌ సింధూర్‌ వంటి వాటి గురించి చెప్పిన అబద్దాలు సరిపోలేదు. అమెరికాకు గులాంగిరి చేస్తున్నది సరిపోలేదు. అందుకే ఇప్పుడు పాఠశాల విద్యార్థుల మెదళ్లు పాడు చేయడానికి ఒక కొత్త పథకం రూపొందించారు. అందులో భాగంగా ఎన్‌.సి.ఇ.ఆర్‌.టిని ధ్వంసం చేశారు. ఈడి, సిబిఐ జాబితాలో దీన్ని కూడా చేర్చి ప్రయోగించారు. గతంలో యుపీఏ అధికారంలో ఉండగా, వారి కాలంలో విధించిన ఎమర్జెన్సీకి సంబంధించిన పాఠం సోషల్‌ స్టడీస్‌లో ఉండేది. మరి అలాంటి ధైర్యం ఈ ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఎందుకు లేదు? ధైర్యముంటే తమ ఆధ్వర్యంలో జరిగిన గుజరాత్‌, మణిపూర్‌ మారణకాండలు పాఠాల్లో పెట్టాలి. స్వాతంత్రోద్యమంలో పాల్గొనకుండా పారిపోయిన వారెవరో పిల్లలకు చెప్పాలి! అలాగే జస్టిస్‌లోయాను ఎవరు చంపారన్నది వచ్చే తరాలకు బోధించగలరా?

సరే ఇప్పుడు చరిత్ర పాఠ్యాంశాల్లో మొఘలుల పరిపాలనా కాలాన్ని తొలగించినందుకు ఎన్‌సీఇఆర్టీ చెపుతున్న కారణాలు ఈ విధంగా ఉన్నాయి. 1.మొఘలులు పెద్ద ఎత్తున మతమార్పిడులు చేశారు. 2.మొఘలులు కిరాతకులు, క్రూరులు – స్వంత తండ్రుల్నీ, అన్నదమ్ముల్ని చంపి రాజ్యాధికారం చెపట్టేవారు. 3. హిందూ దేవాలయాల్ని కూల్చారు, హిందువుల్ని ద్వేష భావంతో చూశారు. 4. హిందువులపై జిజియా పన్ను విధించి, వారిని చిత్రహింసలకు గురిచేశారు. 5.మొఘలుల మూలాలు ఈ దేశంలో లేవు, వారు చెంఘిజ్‌ ఖాన్‌ వారసులు. తైమూర్‌ నుండి వలస వచ్చారు. బయటి నుండి వలస వచ్చిన వారికి ఈ దేశవాసుల మీద ప్రేమ ఎందుకుంటుందీ? 6. మొఘలులు దోపిడీదారులు, దేశాన్ని దోచుకునిపోయారు – అన్నిటి కన్నా ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. అదేమిటంటే- 7. మొఘలులు ముస్లింలు గనక, వారికి వారసులైన ఇప్పటి ముస్లింలను ఇప్పటి హిందువులంతా ద్వేషించాలి!

ఈ కారణాల్లో వాస్తవాలు ఎన్ని? అవాస్తవాలు ఎన్ని అనేది కొంచెం లోతుల్లోకి వెళ్లి విశ్లేషించుకుందాం! నేనిక్కడ నా అభిప్రాయాల్ని వెలిబుచ్చదలుచుకోలేదు. హిందూ మతోద్ధా రకులుగా ప్రచారంలో ఉన్న ప్రముఖుల అభిప్రాయాలేమిటో పరిశీలిద్దాం. మొఘలుల కాలంలో జరిగిన మత మార్పిడిల గురించి స్వామి వివేకానంద అభిప్రాయం ఈ విధంగా ఉంది. ”బెంగాల్‌లో ముస్లింల జనాభా ఎందుకు పెరిగిందంటే, అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి- ఆ రోజుల్లో హిందువులైన భూస్వాముల, జమీందార్ల ఆగడాలు-దౌర్జన్యాలు బెంగాల్‌లో విపరీతంగా ఉండేవి. మరోవైపు, హిందూ పురోహితుల కఠిన నియమాలు అత్యంత భయానకంగా ఉండేవి. వీటినుంచి తప్పించుకోవడానికి పేద హిందూ రైతులు ఇస్లాంలోకి మారేవారు. దానివల్ల పైనున్న మొఘల్‌ చక్రవర్తి రక్షణ వారికి లభిస్తూ ఉండేది. రెండు – ముస్లింలుగా మారితే చక్రవర్తి సాన్నిహిత్యం త్వరగా లభిస్తుందనీ, ఏదైనా పదవో లేదా ధనమో లభిస్తుందన్న ఆశతో – వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి మరికొందరు ఆ రోజుల్లో ఇస్లాం స్వీకరించేవారు. అంతేగాని, మొఘలులు బలవంతంగా అధికారికంగా హిందువుల్ని ఇస్లాంలోకి మార్చిన దాఖలాలు లేవు. అలా అని చరిత్ర పుటల్లో ఎక్కడా నమోదుకాలేదు.”

SWAMYVIVEKANANDA SELECTED WORKS
3rd CHAPTER – Page : 294.
దానికి కొనసాగింపుగానే స్వామి వివేకానంద ఇంకా ఇలా అన్నారు. ”అణగదొక్కబడ్డ వారు, నిరుపేదలు, నిరాశ్రయులు సైతం ముస్లింల పాలనలో అంటే మొఘలుల పాలనలో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజుల్లో ముస్లింల శాతం పదిహేను మాత్రమే! వారు గనక తమ అధికారాన్ని ఉపయోగించి, బలవంతంగా మత మార్పిడులు చేసి ఉంటే – ఇస్లాంలోకి మార్చి ఉంటే – ముస్లింల జనాభా శాతం చాలాచాలా పెరగాల్సింది కదా? కేవలం పదిహేను శాతమే ఎందుకు ఉండిపోయింది? ఆ రోజుల్లో హిందువులు 80-85 శాతమున్నారు.” స్వామి వివేకానంద నమోదు చేసినా విషయాలు అలా ఉండనిచ్చి – ఇప్పుడు మనం మళ్లీ ఆలోచించి చూద్దాం! వేరు వేరు కారణాల వల్ల, పేరు సమయాల్లో పెద్దవిత్తున హిందువులు ఇస్లాం స్వీకరించి ఉంటే, నిజంగానే దేశ జనాభాలో వారి శాతం గణనీయంగా పెరిగి ఉండేది కదా? 2011లో జరిగిన జనాభా లెక్కల్లో సైతం, ముస్లింల జనాభా 14-23 శాతం మాత్రమే ఉందని తేలింది!

ఇక రెండో విషయానికి వద్దాం! మొఘలులు క్రూరులు స్వతంత్రుల్ని, కుటుంబీకుల్ని చంపి రాజ్యం హస్తగతం చేసుకునేవారు. ఇది నిజమే! అయితే ఈ విషయం కేవలం ముస్లిం రాజులకూ, మొఘలులకూ మాత్రమే పరిమితం కాదు. ప్రాచీన యుగంలో – మధ్యయుగంలో- ఆధునికయుగంలో అన్ని యుగాలలో, అన్ని కాలాలలో సింహాసనం కోసం, లేదా అధికారం కోసం, రాజుకుటుంబాల్లో హత్యలు సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు తీసుకుని పరిశీలిద్దాం! మగధను పాలించిన మౌర్య చక్రవర్తి అశోకుడు సాధారణ శకానికి ముందు 268 – 232 మధ్య కాలంలో 36 ఏండ్లు సువిశాలమైన భారత దేశాన్ని పరిపాలించాడు. పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్‌ నుండి తూర్పున బంగ్లాదేశ్‌ వరకు దక్షిణాన తమిళనాడు – కేరళలోని కొంత ప్రాంతం తప్ప, మొత్తం భారతదేశం ఆయన ఆధీనంలో ఉండేది. సింహాసనం అధిష్టించడానికి సుమారు వందమంది కుటుంబ సభ్యుల్ని చంపి, రాజ్యం చేజిక్కించుకున్నాడు. తనకు ఎవరూ పోటీ ఉండకూడదనుకుని ఆ పనిచేశాడు. ఆయన క్రూరత్వాన్ని చూసి జనం ఆయనను ‘ఛండాశోకుడు!’ అని పిలుచుకున్నారు. ఆయన చేసిన కళింగ యుద్ధంలో లక్షల మంది చనిపోవడం చూసి, ఆయనలో పరివర్తన కలిగింది. బౌద్ధం స్వీకరించి, దేశ దేశాల్లో దాన్ని ప్రచారం చేయించాడు. స్వంత కొడుకును, కూతురును కూడా బౌద్ధానికి అర్పించాడు. వేరు దేశాల నుండి ఆరుగురు భార్యల్ని వివాహమాడి, ఆనాడే అంతర్జాతీయ కుటుంబానికీ – అంతర్భాతీయ పాలనకు నాంది పలికాడు. చరిత్రలో ‘అశోకా ద గ్రేట్‌’గా నిలిచిపోయాడు.

అలాగే హర్యానక వంశానికి చెందిన మగధ పాలకుడు అజాత శత్రు సాధారణ శకానికి పూర్వం 492 – 460 మధ్య పరిపాలించాడు. ఈయన తన తండ్రి బింబిసారుడిని హత్య చేసి రాజ్యానికొస్తే మళ్లీ ఈ ఆజాత శత్రు స్వంత కొడుకు ఉదయ భద్ర చేతిలో హత్య చేయబడ్డాడు. వీరిది పితృహంతకుల వంశమని చరిత్రలో నమోదయ్యింది. ఇక, గుప్తవంశానికి చెందిన సముద్ర గుప్తుడు (335-375 సాధారణ శతకం) తన తండ్రిని చంపించడంలో ముఖ్య భూమికను పోషించి, తన అన్న కచను, ఇంకా ఇతర సోదరులను చంపించి రాజ్యానికొచ్చాడు. రాజపుత్ర వంశానికి చెందిన మేవాడ్‌ రాజ్యపాలకుడు మహా రాణా కుంభ్‌ (1433 -1468 సాధారణ శకంను అతని స్వంత కుమారుడు రాణా ఉదరు సింV్‌ా-1 హత్యచేసి – రాజ్యం చేజిక్కించుకున్నాడు. ఇక్కడ మనం కొన్నే చెప్పుకున్నాం గానీ – రాజ్యం కోసం కుటుంబాలలో కుట్రలూ – హత్యలూ అప్పటి సమాజాల్లో సహజంగా జరుగుతూనే ఉండేవి. ఆ విషయం దాచిపెట్టి, మొఘలులు క్రూరులు, వారు రాజ్యం కోసం తండ్రుల్ని, సోదరుల్నీ చంపారనడం సరైంది కాదు. ఇక్కడ హిందూ ముస్లిం తేడా లేదు. అన్ని రాజకుటుంబాలలో అలాగే జరుగుతూ ఉండేది. రామాయణంలో మాత్రం ఏమైంది? వాలిని చంపించి సుగ్రీవుడు రాజ్యానికి రాలేదా? రావణున్ని చంపించిన విభీషణుడు రాజు కాలేదా? అహేతుకమైన నిర్ణయాలు తీసుకుని, తాము హేతుబద్ధంగా సిలబస్‌ మార్చామని చెప్పుకోవడమంటే, ఎన్‌సీఇఆర్‌టి – కేంద్ర ప్రభుత్వం- ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉందని అర్థం!!

వ్యాసకర్త: విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత.
డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -