వెంటబడతారు…ఆపై వేధిస్తారు
పెచ్చుమీరిపోతున్న రికవరీ ఏజెంట్ల ఆగడాలు
భయాందోళన..అశాంతి..వేదన..
మానసిక ఒత్తిడితో బాధితులు సతమతం
చివరికి ఆత్మహత్యలు
అప్పు కావాలా నాయనా అంటూ వెంటపడతారు. ఏదో అవసరం ఉంది కదా, ఎలాంటి షరతులు లేకుండా ఇస్తున్నారు కదా అని తీసుకున్నామా…ఊబిలో కూరుకుపోయినట్లే. ఇచ్చిన అప్పును వడ్డీతో సహా రాబట్టుకునేందుకు వేధింపులు మొదలు పెడతారు. అవి మితిమీరి పోవడంతో బాధితులు ఆందోళనకు, ఒత్తిడికి గురికావడం ఖాయం. చివరికి ఒక్కోసారి ఆత్మహత్యలే శరణ్యమవుతాయి. అప్పు చేయడం అనేది ఓ అవకాశానికి దారి. చిన్నారుల విద్య కోసమో, చిరు వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికో, అత్యవసర అవసరాలను తీర్చుకోవడానికో అప్పులు చేయడం సహజమే. కానీ తీసుకున్న రుణాల వాయిదాలను (ఈఎంఐలు) సకాలంలో తీర్చలేకపోతే అప్పుడు కష్టాలు మొదలవుతాయి. నిద్రలేని రాత్రులు, వేధింపులు, సామాజిక అవమానాలు, మానసిక అశాంతి తోడై జీవితాన్ని దుర్భరం చేస్తాయి.
న్యూఢిల్లీ : మన దేశంలో అప్పు తీసుకున్న వారిలో చాలా మంది వివిధ కారణాలతో సమయానికి ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. దాంతో రికవరీ ఏజెంట్ల వేధింపులు తప్పడం లేదు. ఇచ్చిన రుణాలను రాబట్టుకోవడానికి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, మైక్రోఫైనాన్స్ సంస్థలు, ఫిన్‌టెక్ రుణ యాప్‌లు ఈ ఏజెంట్లను నియమించుకుంటాయి. వీరికి చట్ట నిబంధనలతో నిమిత్తం లేదు. ముందుగా రుణాలు తీసుకున్న వారికి పదే పదే ఫోన్ చేస్తారు. రోజుకు డజన్ల కొద్దీ ఫోన్లు చేసే సందర్భాలూ ఉంటాయి. వారికి రాత్రి, పగలు అనే తేడాయే ఉండదు. చెప్పాపెట్టకుండా నేరుగా ఇంటికే వచ్చేస్తారు. పని ప్రదేశంలోనూ ప్రత్యక్షమవుతారు. ఎలాంటి నోటీసు ఇవ్వరు. నానా హడావిడి చేస్తారు. అందరి ముందు హేళన చేసి అవమానిస్తారు. ఫోన్ కాల్ చేసినప్పుడే దుర్భాషలాడతారు.
బెదిరిస్తారు. రుణ గ్రహీతలకే కాదు…వారి కుటుంబ సభ్యులనూ ఫోన్ కాల్స్‌తో వేధిస్తారు. అది చాలదన్నట్లు పొరుగువారికి, సహచరులకూ ఫోన్ చేస్తారు. రికవరీ ఏజెంట్లు డిజిటల్‌గా పరువుకు నష్టం కలిగించే పనులు కూడా చేస్తుంటారు. ఆన్‌లైన్‌లో తప్పుడు సందేశాలు, మార్ఫింగ్ చేసిన చిత్రాలు పెడతారు.
విషాదాంతం అవుతున్న జీవితాలు
రికవరీ ఏజెంట్ల వేధింపులు చివరికి విషాదాంతం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే రికవరీ ఏజెంట్ల ఆగడాలను భరించలేక ఉసురు తీసుకుంటున్న అభాగ్యుల కన్నీటి కథలు మనకు ఎన్నో వినిపిస్తాయి. 2022లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఓ సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటే మనసు వికలమవుతుంది. స్వల్ప మొత్తాన్ని అప్పుగా తీసుకున్న వివాహిత దానిని సకాలంలో తీర్చలేకపోవడంతో రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు దిగారు. మార్ఫింగ్ చేసిన నగ చిత్రాలను ఆన్‌లైన్‌లో పెడతామని హెచ్చరించడంతో ఆ అభాగ్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. గత సంవత్సరం కర్నాటక రాజధాని బెంగళూరులో జరిగిన మరో సంఘటన గురించి తెలుసుకుందాం. 60 సంవత్సరాల వయసున్న యశోదమ్మ సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తోంది. ఒకే ఒక్క వాయిదాను సమయానికి కట్టలేకపోవడంతో మైక్రోఫైనాన్స్ సంస్థ పదే పదే వేధించడం మొదలు పెట్టింది. ఈ వేధింపులు చివరికి ఆమె ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో నలుగురు సభ్యులున్న కుటుంబం ఆరు లక్షల రూపాయల అప్పు చెల్లించలేక వేధింపులకు గురై విషం తీసుకుంది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఫిర్యాదుల వెల్లువ
ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఘటనలు మన దేశంలో అనునిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూ సంక్షోభ తీవ్రతను వెల్లడిస్తున్నాయి. రికవరీ ఏజెంట్ల అకృత్యాలకు సంబంధించి 2023-24లో ఆర్‌బీఐకి చెందిన ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌కు 9.34 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 32.8 శాతం అధికం. వీటిలో 85,281 ఫిర్యాదులు (29 శాతం) కేవలం రుణాలు, అడ్వాన్సులకు సంబంధించినవే. ప్రత్యేకంగా రుణాలు అందించే యాప్‌లు, రికవరీ ఏజెంట్ల వేధింపులకు సంబంధించి 2021 ఏప్రిల్-2022 నవంబర్ మధ్యకాలంలో ఆర్‌బీఐకి సుమారు 12,903 ఫిర్యాదులు అందాయి. రుణాలు తీసుకున్న వారు సకాలంలో వాటిని చెల్లించని పక్షంలో విధించే అపరాధ రుసుము కూడా పెరిగిపోతోంది. గడువు దాటి 90 రోజులు పైబడిన కారణంగా విధించిన అపరాధ రుసుము రేటు ఈ ఏడాది మార్చిలో 3.6 శాతానికి పెరిగింది. ఆరు త్రైమాసికాలలో ఇదే అత్యధిక రేటు. ఆత్మహత్యలను నివారించేందుకు ఏర్పాటు చేసిన జీవన్ ఆస్తా వంటి హెల్ప్‌లైన్లకు వచ్చిన కాల్స్‌లో 24 శాతం ఆర్థిక ఒత్తిడికి సంబంధించినవే కావడం గమనార్హం.
కాగితాలకే పరిమితం
రికవరీ ఏజెంట్ల కోసం ఆర్‌బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఉదయం 8 గంటలకు ముందు, సాయంత్రం 7 గంటల తర్వాత రుణ గ్రహీతలకు కాల్ చేయకూడదు. వారిని భయపెట్టకూడదు. దుర్భాషలాడకూడదు. బహిరంగంగా అవమానించకూడదు. రుణ గ్రహీత అనుమతి లేనిదే కుటుంబసభ్యులు, స్నేహితులు, సహచరులకు ఫోన్ చేయకూడదు. అయితే ఈ నిబంధనలన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. వీటి అమలును పర్యవేక్షించే నాథుడే లేడు. అదీకాక రుణం తీసుకున్న వారు ఈ ఏజెంట్లపై ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తుంటారు. సమస్యలను పరిష్కరించే వ్యవస్థలపై వారికి సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం.
ఈ వ్యవస్థలు చాలవు
రికవరీ ఏజెంట్ల వేధింపులు, ఒత్తిడుల కారణంగా బాధితులు తీవ్రమైన అశాంతికి, నిరాశానిస్పృహలకు, భయాందోళనలకు గురవుతున్నారు. అవమానాలు పెరిగిపోవడంతో భరింపరాని వేదనను అనుభవిస్తున్నారు. ఇవన్నీ ఆత్మహత్యలకు ప్రేరణ ఇస్తున్నాయి. అప్పులు తీరకపోవడంతో బాధిత కుటుంబాలు భావోద్వేగపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా చితికిపోతున్నాయి. మానసిక వైద్యులు, హెల్ప్‌లైన్ కాల్స్ కొంతమేర అండగా ఉంటున్నప్పటికీ ఈ వ్యవస్థలు సరిపోవడం లేదు. రుణ గ్రహీతలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని రుణదాతలను ఆర్‌బీఐ కోరుతున్నప్పటికీ ఆచరణలో అది తూతూ మంత్రంగానే సాగుతోంది. ప్రస్తుతం మనుగడలో ఉన్న వ్యవస్థలు రుణ గ్రహీతలకు పెద్దగా ఊరట కలిగించలేకపోతున్నాయి. ఉపశమనం పొందడం మాట అటుంచి పెరుగుతున్న రుణ భారం, నిరంతర వేధింపుల మధ్య వారు నలిగిపోతున్నారు.
ఏం చేయాలంటే…
మరి రికవరీ ఏజెంట్ల వేధింపులు, అకృత్యాలను అడ్డుకునే వ్యవస్థలే లేవా? ఆర్‌బీఐ మార్గదర్శకాలు మరింత కఠినంగా ఉంటే కొంత మేలు జరిగే అవకాశం ఉంది. వేధింపులకు పాల్పడే వారికి జరిమానాలు విధించడం, జైలుకు పంపడం వంటి శిక్షలు విధించాల్సి ఉంటుంది. చట్టవిరుద్ధంగా రుణాలు ఇవ్వడం, వాటిని రికవరీ చేయడానికి బలప్రయోగం వంటి పద్ధతులను అనుసరించడాన్ని నేరంగా పరిగణించాలి. రుణదాతల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలి. ఏజెంట్ల దుష్ప్రవర్తనకు బ్యాంకులు, ఎన్‌బీఆర్‌సీలను బాధ్యులను చేయాలి. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. కౌన్సిలింగ్ కేంద్రాలను పెంచి బాధితులకు ఊరట కల్పించాలి. రుణ గ్రహీతలకు వారి హక్కులపై అవగాహన కల్పించాలి.



