Saturday, November 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమరో రెండు నెలల గడువు కావాలి

మరో రెండు నెలల గడువు కావాలి

- Advertisement -

ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంను కోరిన స్పీకర్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పటిషన్‌పై విచారణకు మరింత గడువు కావాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు తన న్యాయవాదుల ద్వారా కోరారు. గతంలో సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల సమయం శుక్రవారంతో ముగిసింది. దీంతో మరో రెండు నెలల గడువు ఇవ్వాలని స్పీకర్‌ కార్యాలయం కోరింది. నలుగురు శాసనసభ్యుల విచారణ మాత్రమే పూర్తయిందనీ, అంతర్జాతీయ సదస్సులకు వెళ్లాల్సి రావడంతో గడువు సరిపోలేదని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల మేరకు మూడు నెలల్లో విచారించాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై న్యాయ నిపుణులతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్‌బాబు చర్చించారు. ఈమేరకు ఇప్పటివరకు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి ప్రకాష్‌గౌడ్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని ఇప్పటివరకు స్పీకర్‌ విచారించారు. తొలుత సుప్రీం ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చారు. అనంతరం అఫిడవిట్లు తీసుకున్న తర్వాత క్రాస్‌ ఎగ్జామిషన్‌ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు ‘తాము నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని’ కలిశామని తమ లాయర్ల ద్వారా స్పీకర్‌ కోర్టులో వాదనలు వినిపించారు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం ఇప్పటికీ తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెప్పారు. ఇకపోతే మరో ఆరుగురి ఎమ్మెల్యేలకు సైతం ఇప్పటికే స్పీకర్‌ నోటీసులు జారీచేశారు. అందులో నలుగురు అఫిడవిట్లు సమర్పించగా, ఇద్దరు ఇవ్వలేదు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజరుకుమార్‌తోపాటు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు తదితరులను స్పీకర్‌ విచారించాల్సి ఉంది. రాజ్యాంగంలోని పదో ఆర్టికల్‌ ప్రకారం స్పీకర్‌ విచారణ చేస్తున్నారు. గత కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనూ టీడీపీ నుంచి 11 మంది, కాంగ్రెస్‌ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం విదితమే. ఇదిలావుండగా ఎమ్మెల్యే అనర్హతపై విచారణ పూర్తయాక స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారా ? లేదా పెండింగ్‌లో పెడతారా ? అనేది చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -