మన ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరమని వింటుంటాం. వాస్తవానికి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కాల్షియం ముఖ్యమైన మినరల్. మన శరీరంలో నిల్వ ఉండే మొత్తం కాల్షియంలో 99శాతం ఎముకలు, ఒక శాతం దంతాల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కాల్షియం ప్రాముఖ్యత కేవలం ఎముకలకే పరిమితం కాదు. కండరాల సంకోచానికి, నరాల సంకేతాల పనితీరుని కూడా మెరుగుపరటానికి కాల్షియం అవసరం.
ఈరోజుల్లో చాలామందికి కాల్షియం లోపం కనిపిస్తున్నది. ముఖ్యంగా గర్భిణీలకు, పాలిచ్చే స్త్రీలకు, వద్ధులలో కాల్షియంలోపం ఇంకాస్త ఎక్కువే కనిపిస్తుంది. దానికి కారణం కాల్షియం ఉన్న పదార్థాలు తినకపోవడమే కాదు, తీసుకున్న కాల్షియం శరీరానికి అందడానికి ఉపయోగపడే డి విటమిన్‌కి మూలమైన సూర్యరశ్మి శరీరానికి తగినంత అందకపోవడం. నేటి జీవన విధానం కూడా అందుకు కారణమే. ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం మూడున్నర మధ్యలో ఉండే ఎండలో మాత్రమే డి విటమిన్ శరీరానికి లభిస్తుంది. అది కూడా చర్మం ఎక్కువ శాతం ఎండ తగిలేలా ఉండాలి. ఒకవేళ బట్టలు ఉన్నా కాటన్ లైట్ రంగు బట్టలు అయి ఉండాలి. పరిశీలించండి… శారీరక కష్టం చేసుకుని జీవించే వత్తుల వారు, ఎండలో పనిచేసే వారికి దఢమైన మెరిసే శరీరం, నల్లటి జుట్టు వారి సొంతం.
శరీరంలో తగినంత కాల్షియం లేకపోవడాన్ని కాల్షియం లోపం అంటారు. పురుషుల కంటే స్త్రీలలో ఈ కాల్షియం లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో, ప్రసవించిన స్త్రీలలో కాల్షియం లోపం సర్వసాధారణం. ఇది హదయ స్పందనను నియంత్రిస్తుంది. రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. నరాల ప్రేరణలు స్వేచ్ఛగా ప్రవహించేలా చేస్తుంది. సప్లిమెంట్ల ద్వారా కాల్షియం కొరతను తగ్గిస్తారు. అయితే ఈ సప్లిమెంట్లు ఉబ్బరం, మలబద్ధకాన్ని కలిగిస్తాయి.
కాల్షియం కొరత వల్ల బోలు ఎముకల వ్యాధి/ పెళుసు ఎముకలకు దారి తీస్తుంది.
అనేక రకాల హార్మోన్లు, ఎంజైమ్స్ కార్యకలాపాలకు, మనకు ఎక్కడైనా గాయమైనప్పుడు రక్తం ఆగడానికి జరిగే ప్రక్రియలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది కాల్షియం లోపాన్ని అధిగమించడానికి టాబ్లెట్లు తీసుకుంటున్నారు. అయితే వాటిని ఏ సమయంలో తీసుకోవాలో సరైన అవగాహన ఉండడం లేదు. టాబ్లెట్ల రూపంలో కాకుండా ఆహారం ద్వారానే కాల్షియం లెవల్స్‌ని పెంచుకోవచ్చు.
ఎముకలు కాల్షియంను సమర్థవంతంగా గ్రహించడానికి సరైన సమయం చాలా ముఖ్యం. కొన్ని సమయాల్లో తీసుకున్న కాల్షియం సరిగ్గా శోషించబడకుండానే జీర్ణవ్యవస్థ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. శరీరం ఒకేసారి 500-600 మి.గ్రా కంటే ఎక్కువ కాల్షియంను గ్రహించలేదు. కాబట్టి భోజనం తర్వాత వెంటనే 1000 మి.గ్రా. కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటే అందులో దాదాపు సగం వధా అయ్యే అవకాశం ఉంది. అందుకే కేవలం మోతాదుపై మాత్రమే దష్టి పెట్టకుండా ఎప్పుడు తీసుకుంటున్నాం అనే దానిపై కూడా శ్రద్ధ వహించాలి.
చాలామంది ఉదయం భోజనంతో పాటు కాల్షియం టాబ్లెట్లు తీసుకుంటారు. ముఖ్యంగా కాల్షియంతో పాటు ఇతర విటమిన్లు కూడా ఉండే మల్టీవిటమిన్లను ఉదయం వేసుకునేవారు ఎక్కువ. అయితే ఉదయం అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆహారపు అలవాట్లు కాల్షియం శోషణకు ఆటంకం కలిగించవచ్చు. కాల్షియం ఇతర పోషకాలతో ముఖ్యంగా ఐరన్, మెగ్నీషియం, జింక్‌తో పోటీపడుతుంది. కాల్షియం మాత్రలు, మల్టీ మినరల్ ట్యాబ్లెట్లు ఒకేసారి తీసుకుంటే అవి కడుపులో ఒకదానితో ఒకటి పోటీపడటం ప్రారంభిస్తాయి. దీనివల్ల ఏ ఒక్క మినరల్ కూడా సరిగ్గా శోషించబడకపోవచ్చు. కాబట్టి ఐరన్ లేదా జింక్ టాబ్లెట్లు తీసుకుంటుంటే వాటికి కనీసం రెండు గంటల ముందు లేదా తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది.
ఎముకల్లో బలం లేకపోతే శరీరం పూర్తిగా బలహీనమవుతుంది. దీని కోసం కాల్షియం ఆధారిత ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. ఈ ప్రత్యేక పోషకం కండరాలు, రక్త నాళాలు, గుండెకు కూడా ప్రభావితం చేస్తుంది. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలు విరిగిపోయే ప్రమాదం కూడా తగ్గుతుంది.
కాల్షియం లోపం లక్షణాలు:
కండరాల నొప్పులు, తిమ్మిర్లు, దుస్సంకోచాలు, నడుస్తున్నప్పుడు తొడలు, చేతులలో నొప్పి, కాళ్లూ చేతుల తిమ్మిరి/ జలదరింపు, మూర్ఛలు, అరిథ్మియా, అలసట, నిద్రలేమి, పొడి బారిన చర్మం, పెళుసైన గోర్లు, ముతక జుట్టు, అరోమతా, తామర, సోరియాసిస్, దంత సమస్యలు, అలసట… వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
కాల్షియం ఫుడ్ ఐటెమ్స్:
పాలు, చీజ్, ఇతర పాల పదార్థాలు, బ్రకోలీ, క్యాబేజీ, బెండకాయ, ఆకుకూరలు, సోయా బీన్స్, చేపలు, మాంసాహారం తీసుకుంటే మంచిది. అరటిపండులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలు దఢంగా ఉండాలంటే రోజూ అరటిపండ్లు తీసుకోవాలి. ఈ పండు అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంటుంది కాబట్టి హాయిగా తినొచ్చు. దీని వల్ల ఎముకలకే కాదు అనేక లాభాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఈ పండుని పేదవారి ఆపిల్ అని కూడా చెబుతారు.
కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది. కప్పు ఉడకబెట్టిన బచ్చలికూర శరీరానికి రోజువారి అవసరమైన కాల్షియాన్ని 25 శాతం వరకూ అందిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ ఆకులలో విటమిన్ ఎ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల ఎముకలకి సరైన పోషణ అందుతుంది.
నట్స్‌లోనూ కాల్షియంతో పాటు ఎముకల ఆరోగ్యానికి అవసరమైన మెగ్నీషియం, ఫాస్పరస్‌లు ఉంటాయి. ఎముకలలో కాల్షియం శోషణకి మెగ్నీషియం సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకలని దఢంగా ఉంచేందుకు నట్స్ సరైన పోషణని అందిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తింటే ఎముకలు బలంగా మారడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అలాగే బాదంపప్పును కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. 30 గ్రాముల బాదంపప్పులో 75 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. బాదంపప్పు పొట్టు తీయకుండా తింటేనే మేలు జరుగుతుంది. వీటిలో విటమిన్ ఇ, పొటాషియం కూడా అధికంగానే ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా పలు రకాల ఆహారాలను తింటే కేవలం ఎముకలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
పెరుగులో ప్రో బయోటిక్స్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్స్ బి2, బి12 తో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి మనలో గుడ్ బ్యాక్టీరియాని, గుండె ఆరోగ్యాన్ని పెంచి, పోషకాలు బాడీకి అందేలా చూస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం రెగ్యులర్‌గా పెరుగు తీసుకుంటే గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ కూడా శరీరానికి కాల్షియం, విటమిన్ డిని అందిస్తుంది. ఇది ఎముకలని బలంగా చేయడంలో సాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల బోలు ఎముకల సమస్యని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో అంజీర్ ఒకటి. ఇవి మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో ఎప్పుడూ దొరుకుతుంది. ఒక కప్పు అంజీర్ పండ్లలో సుమారుగా 121 మిల్లీగ్రాముల క్యాల్షియంతో పాటు ఫైబర్, పొటాషియం కూడా లభిస్తాయి. ఇవి కండరాల పనితీరును మెరుగు పరిచి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రాత్రి పూట 3 లేదా 4 అంజీర్ పండ్లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే ఫలితం ఎక్కువగా వుంటుంది.
120 గ్రాములసముద్రపు చేపలలో 351 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. చేపలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థకు అవసరం అయిన విటమిన్ బి12ను పొందవచ్చు.
బెండకాయల్లో కాల్షియంతో పాటు ఫైబర్ అధికంగా ఉండి, మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఒక కప్పు బెండకాయలలో సుమారుగా 82 మిల్లీగ్రాముల కాల్షియంతో పాటు విటమిన్ బి6, ఫోలేట్ వుంటాయి.
కివి, బొప్పాయి, బ్లాక్ బెర్రీస్, రాస్‌బెర్రీస్, నేరేడు, నారింజ, నిమ్మ, బీన్స్… వంటి ఆహార పదార్థాలు తినడం వల్ల కాల్షియంతో పాటు, విటమిన్ ఎ, సి, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు కొద్ది మోతాదులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటివి కూడా శరీరానికి అందుతాయి.
సోయా సూపులోనూ కాల్షియం అధికంగానే ఉంటుంది. దీన్ని సగం కప్పు తింటే సుమారుగా 434 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది.
చాలా మంది పొద్దున్నే లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది వారు కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవాలనుకుంటే కాఫీ లేదా టీ తాగడానికి కనీసం ఒక గంట ముందు తీసుకోవడం మంచిది.
జీలకర్ర మన ఇళ్లలో క్రమం తప్పకుండా ఉపయోగించే మసాలా దినుసులలో ఒకటి. కాల్షియం పొందడానికి మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ జీలకర్రను రోజుకు నాలుగు సార్లు తీసుకుంటే జీర్ణశక్తి పెరగడంతో పాటు కాల్షియం కూడా శరీరానికి అందుతుంది.
కొన్ని అధ్యయనాలు రాత్రిపూట కాల్షియం ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల ఎముకల పునరుత్పత్తి మెరుగుపడు తుందని సూచిస్తున్నాయి. నిద్రపోతున్న సమయంలో ఎముకలు వాటిని అవే యాక్టివ్‌గా రిపేర్ చేసుకుంటాయి. ఈ సమయంలో శరీరానికి కాల్షియం ఎక్కువగా అవసరమవుతుంది. మన శరీరం రాత్రిపూట సహజంగానే రక్తప్రవాహం నుండి కాల్షియంను ఎముకల్లోకి లాగుతుంది. కాబట్టి ఈ సమయంలో కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల అది నేరుగా ఎముకలకు చేరే అవకాశం ఉంది.
స్నేహపూర్వక సూచన: ఆరోగ్య పరిస్థితి, తీసుకుంటున్న ఇతర పోషకాలను పరిగణనలోకి తీసుకుని., సప్లిమెంట్లు విషయంలో ఆరోగ్య విషయంలో వైద్య నిపుణుడిని సంప్రదించి సరైన సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి,
8008 577 834