– 89 సబ్ స్టేషన్ల నిర్మాణాలకు సిద్ధమైన డిస్కం
– హైదరాబాద్, రంగారెడ్డి జోన్లలో లభించని భూములు
కొత్తగా విద్యుత్ సబ్‌స్టేషన్లు నిర్మించాలంటే గ్రేటర్ పరిధిలో స్థలం దొరకడం లేదు. మేడ్చల్ జోన్ మినహా.. హైదరాబాద్, రంగారెడ్డి జోన్లలో స్థల సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెట్రో జోన్ పరిధిలో ఖాళీ స్థలాల కొరత ఉంది. రంగారెడ్డి జోన్‌లో ప్రభుత్వ స్థలం ఉన్నా.. కోర్టు వివాదాలు, లిటికేషన్లు, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉండటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సబ్‌స్టేషన్ల ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
నవతెలంగాణ- సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా 89 సబ్ స్టేషన్లను కొత్తగా నిర్మించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నిర్ణయించింది. ఇందుకు గ్లోబల్ టెండర్లను సైతం పిలిచారు. మూడుసార్లు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ఒక్కొక్కటిగా టెండర్లు పిలుస్తున్నారు. కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణానికి టీజీ ఎస్పీడీసీఎల్ సిద్ధంగా ఉన్నప్పటికీ, నిర్మాణాలకు అవసరమైన భూములు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయా జోన్లలో రెవెన్యూ యంత్రాంగం కేటాయించిన భూములపై అనేక వివాదాలు ఉండటంతో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అయితే, ముందుగా స్థలాల సమస్యలేని చోట మాత్రమే టెండర్లను ఆహ్వానిస్తున్నారు.
రూ.420 కోట్ల అంచనా వ్యయం
రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల పరిధిలో రూ.420 కోట్ల అంచనా వ్యయంతో రానున్న ఐదేండ్ల నాటికి 89 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించాలని టీజీఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. ఒక్కో సబ్‌స్టేషన్ ఏర్పాటుకు 1500-2000 గజాల స్థలం అవసరం కాగా.. ఇండోర్ సబ్‌స్టేషన్‌కు కనీసం 600 గజాల జాగా కావాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు భూములను కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి ఎస్సీడీసీఎల్ లేఖ రాసింది. కొన్నిచోట్ల అనువైన భూములు లేకపోవడం, ఉన్నది కూడా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోవడం, శివారు ప్రాంతాల్లో కేటాయించిన భూములపై కూడా వివాదాలు కొనసాగుతుండటం తదితర కారణాలతో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి స్థల లభ్యత ప్రధాన అడ్డంకిగా మారింది.
మెట్రో, రంగారెడ్డి జోన్లలో ఇబ్బందులు..!
కోర్ సిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో సబ్ స్టేషన్లకు భూముల కొరత ప్రధాన అడ్డంకిగా మారింది. బంజారాహిల్స్ సర్కిల్‌లో 5, సికింద్రాబాద్ సర్కిర్ పరిధిలో 14, హైదరాబాద్ సెంట్రల్ పరిధిలో 10, సౌత్ పరిధిలో 12 ప్రాంతాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణానికి సిద్ధమైనా.. భూములు దొరకడం లేదు. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ డిస్కంకు కేటాయించిన భూముల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. కొన్ని కోర్టు పరిధిలో ఉండగా, మరికొన్ని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. సైబర్ సిటీ సర్కిల్ పరిధిలో మోకి, నెర్నంపూర్, బొటానికల్ గార్డెన్. నల్లగుండ్లహుణ, హఫీజ్‌పేట 8వ బెటాలియన్ సహా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గౌస్‌నగర్, కింగ్స్ కాలనీ, సూరనగర్, మీరాలం పార్క్, బైరాగిగూడ, హుడాహెచ్‌ఎస్బీ, శాతందాయి, పీఅండ్‌టీ కాలనీ, ఓమన్‌నగర్, లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీ తదితర చోట్ల సబ్‌స్టేషన్లు వస్తాయి. సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలో మన్సూరాబాద్ పెద్ద చెరువు, బీఎన్‌రెడ్డి నగర్, హెచ్‌ఎం డబ్ల్యూఎస్ సాహెబ్‌నగర్, బడంగ్‌పేట, డంపింగ్‌యార్డు, బండ్లగూడ ఏసీపీ ప్లాంట్, కుంట్లూరు మదర్ డెయిరీ వద్ద కొత్త సబ్ స్టేషన్లు వస్తాయి. స్థలాలు దొరికితే ఈ ప్రాంతాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టేందుకు డిస్కం సిద్ధంగా ఉంది. మేడ్చల్ జోన్‌లో ప్రతిపాదించిన ప్రాంతాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుకూలంగా స్థలాలు ఉండటంతో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తడం లేదని డిస్కం అధికారులు చెబుతున్నారు.
సబ్ స్టేషన్లకు స్థలం కావలెను..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES