నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టూరిజం విధానంలో నీరా కేఫ్‌లకు ప్రాధాన్యతనివ్వాలని కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం శిల్పారామం వేదికగా తెలంగాణ టూరిజం కాంక్లేవ్ -2025లో నూతన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 50 వేల ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంతో (పీపీపీ) రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన హోటళ్ళు, అత్యాధునిక వెల్ నెస్ సెంటర్లు, ద్రాక్ష పంట నుండి వైన్ తయారీ, హాస్పిటాలిటీ ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోబోతున్నారు. వీటిలో ప్రకృతి పానీయం ఆరోగ్యానికి మంచిదైన నీరాను పర్యాటకులకు అందించడానికి నీరాకేఫ్‌లు ఏర్పాటు చేస్తే గౌడ యువతీ యువకులకు ఉపాధి కలుగుతుంది. కల్లు నుండి వైన్ తయారు చేసే ఆధునిక టెక్నాలజీ వచ్చింది. రాష్ట్రంలో కోటి తాటి, ఈత చెట్లు ఉన్నాయి. పాల సేకరణ చేస్తున్న విధంగా కల్లును రోజుకు సుమారు రూ.5 కోట్ల లీటర్లు సేకరించవచ్చు. దీనిని వైన్ తయారు చేయడానికి ఉపయోగిస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్న గీత కార్మికులకు ఉపాధి పెరుగుతుంది. స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్వయం పోషకంగా జీవిస్తున్న కల్లుగీత కార్మికుల ఉపాధి మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలి’ అని రమణ డిమాండ్ చేశారు.
టూరిజం విధానంలో నీరా కేఫ్‌లకు ప్రాధాన్యతనివ్వాలి : కేజీకేఎస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES