– అధిక వర్షాలతో అనువుగా లేని వాతావరణం
– అధిక తేమతో ఎర్రబారిన మొక్కలు
– రాలుతున్న పూత, కల్లె, పిందె, కాయలు
– రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో సాగు
– నల్లరేగడి భూముల్లో అధికంగా పంటకు నష్టం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అధిక వర్షాలు పత్తికి ప్రతికూలంగా మారాయి. ఆగస్టు రెండో వారం వరకు ఆశాజనకంగా ఉన్న పత్తిచేలు ఆ తర్వాత కురుస్తున్న భారీ వర్షాలతో దెబ్బతింటున్నాయి. అధిక వర్షాలతో చేలలో నీరు నిలిచి తేమ పెరగడంతో మొక్కలు ఎర్రబారుతున్నాయి. నెలరోజులుగా చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలతో పూత, కల్లె, పిందె రాలిపోతున్నాయి. కొన్నిచోట్ల కాయలు నల్లబడి కుళ్లిపో తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో చేలలో కలుపు పెరుగుతోంది. కొరత కారణంగా యూరియా సకాలంలో వేయకపోవడంతో మొక్కలు ఆశించిన స్థాయిలో ఎదగలేదని రైతులు అంటున్నారు. అననుకూల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది దిగుబడి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి సాగయ్యే అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం కన్నా కనీసం 500 మి.మీ ఎక్కవగా నమోదైంది.
లోపించిన ఎదుగుదల…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.3 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. దీనిలో వరి 60 లక్షల ఎకరాల్లో సేద్యమవుతుండగా ఆ తర్వాత పత్తి సుమారు 50 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది 2.15 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పత్తి ఎక్కువగా సేద్యమవుతోంది. జూన్‌లో పత్తి గింజలు వేయగా, జూలైలో కురిసిన సాధారణ వర్షాలతో పంట ఏపుగా పెరిగింది. ఆగస్టు రెండో వారం వరకు పత్తి చేలు పూత, పిందె, కాయలతో ఆశాజనకంగా ఉన్నాయి. ఆ తర్వాత నుంచి అల్పపీడనాల ప్రభావంతో రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటం పత్తికి ప్రతికూలంగా మారింది. ముఖ్యంగా ఆగస్టు నెలలో కురిసిన వర్షాలు పంటను మరింతగా దెబ్బతీశాయి. దసరా నాటికి పత్తి చేతికందుతుందని రైతులు ఆశించినా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికే రెండు విడతల ఎరువులు వేయటంతో పాటు మూడుసార్లు పై మందులు (దోమ, పురుగు, తెగుళ్ల మందులు) పిచికారీ చేశారు. వర్షాల కారణంగా పత్తిచేలలో తేమ శాతం తగ్గక ఎదుగుదల నిలిచిపోయింది. అధిక వర్షాలతో దోమ, పురుగు ఉధతి పెరుగుతోంది. తేమశాతం ఎక్కువగా ఉండటంతో బూజు తెగుళ్లు, చీడపీడలు అధికమవుతున్నాయి.
సస్యరక్షణ చర్యలకు వర్షాల ఆటంకం
అధిక వర్షాలు సస్యరక్షణ చర్యలకు ఆటంకంగా మారాయి. మందులు పిచికారీ చేసినా వర్షానికి పనిచేయట్లేదని, మందులు, కూలీలు ఖర్చు వథా అవుతున్నాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒక్కో మొక్కకు 10 నుంచి 20 కాయల వరకు వర్షాలతో దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఫలితంగా ఎకరానికి కనీసం రెండు, మూడు క్వింటాళ్ల మేర దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్నెస్పీ ఆయకట్టుతో పాటు వివిధ జిల్లాలోని గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లోని నల్లరేగడి నేలల్లో పత్తి ఎక్కువగా సేద్యం చేస్తున్నారు. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాల్లోనూ ఇదే పంట సాగవుతోంది. నల్లరేగడి నేలల్లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల పంటపై ప్రభావం పడుతుంది. ఎర్ర నేలల్లోని చేలలోనూ పూత, పిందె, కల్లె, కాయలు కొంతమేర రాలిపోతున్నాయి. మొక్కలు పెద్దగా ఎర్రబారలేదు. నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాల్లో మాత్రం పంట దెబ్బతింటోంది. ఇప్పటికే ఎకరానికి రూ. 15 వేలు పెట్టుబడి పెట్టిన రైతులు కనీసం ఆ డబ్బయినా తిరిగివస్తుందా? అని ఆందోళన చెందుతున్నారు.
వర్షాలతో పత్తికి దెబ్బ
కొద్దిరోజులుగా వర్షాలు నిరంతరం పడుతుండడంతో పత్తి పంటకు నష్టం జరుగుతుంది. ఇన్ని రోజుల వరకు పంట మంచిగా ఉంది. వానలు లేకుంటే ఒక్కో చెట్టుకు 50 కాయలు వచ్చేవి. వానతో పూత, వచ్చిన కాయలు కూడా రాలిపోతున్నాయి. పంట దిగుబడి బాగా వస్తుందనుకున్నాం. వర్షం కారణంగా పంట దిగుబడి బాగా తగ్గుతుంది. ఇంకొన్ని రోజులు వర్షం పడితే పంట పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. – కొప్పుల శ్రీనివాసరెడ్డి, రైతు, బీరోలు, ఖమ్మం జిల్లా
వర్షాలతో మొక్కలు పోషకాలను గ్రహించలేవు
పూత, కాయ దశలో ఉండగా చెట్లకు పోషకాలు అధికంగా అవసరమవుతాయి. వర్షాల కారణంగా చెట్లకు భూమిలో నుంచి పోషకాలు తీసుకోలేని పరిస్థితి ఉండడంతో పూత, కాయలు రాలిపోతున్నాయి. చేలలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో చెట్లు కుళ్లిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటకు నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంట పొలాల్లో వర్షం నీరు నిల్వ ఉండకుండా చూడడంతోపాటు పత్తి చెట్లకు పోషకాలను పైనుంచి నేరుగా అందించాలి. పోషకాలు పైనుంచి అందించాలి. దీనివల్ల పంటలో పూత, కాయలు రాలడం నివారించవచ్చు. పంట నష్టం జరుగకుండా వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.– పుల్లయ్య, ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
పత్తికి ప్రతికూలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES