గతేడాది సోషల్ మీడియాలో47 లక్షల పోస్టులు
న్యూఢిల్లీ : అమెరికాలో ఇస్లాం మతాన్ని, ముస్లింలను ద్వేషించే ధోరణి బాగా పెరిగిపోతోంది. గత సంవత్సరం ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఆ దేశంలో సామాజిక మాధ్యమాలలో ఏకంగా 47 లక్షల ఇస్లామోఫోబిక్ పోస్టులు పెట్టారని ఈక్వాలిటీ ల్యాబ్ అనే దక్షిణాసియా ఫెమినిస్ట్ సంస్థ తెలియజేసింది. పన్నెండు సోషల్ మీడియా వేదికలలో పెట్టిన ఈ పోస్టులను 34.8 మిలియన్ల మంది వీక్షించారు. ఆయా పోస్టులను వీక్షకులు లైక్ చేయడం, షేర్ చేయడం, వాటిపై వ్యాఖ్యానాలు చేయడం, సేవ్ చేయడం, ట్యాప్ చేయడం, క్లిక్ చేయడం జరిగింది. గత సంవత్సరం ముస్లింలపై దుష్ప్రచారం చేస్తూ టెక్సాస్ రాష్ట్రంలో అత్యధికంగా 2,79,000 పోస్టులు పెట్టారు. ఆ తర్వాత ఫ్లోరిడాలో 1,50,000 పోస్టులు, కాలిఫోర్నియాలో 1,17,000 పోస్టులను ఆ సంస్థ గుర్తించింది.
ముస్లింల ‘దండయాత్ర’ సిద్ధాంతం పేరుతో అమెరికాలో దుష్ప్రచారం ఊపందుకుంటోంది.
ముస్లిం జనాభాలో పెరుగుదల, వలసలను ఎత్తిచూపుతూ క్రైస్తవ విలువలను, అమెరికా గుర్తింపును రూపుమాపేలా కుట్ర జరుగుతోందని ప్రచారకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ నాయకులు ఈ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారని ఈక్వాలిటీ ల్యాబ్ అధ్యయనం తెలిపింది. ఈ ప్రచారం యావత్తూ వలసవాద వ్యతిరేక దాడులతో నిండిపోయింది. వీసాల జారీని ఆపేయాలని, అమెరికాకు చెందని వారిని దేశం నుంచి బహిష్కరించి పంపేయాలని పిలుపు ఇస్తున్నారు. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు చెందిన ముస్లిం అభ్యర్థులు, ఓటర్లు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేస్తున్నారని అధ్యయనం తెలిపింది. కొందరు ఇన్‌ఫ్లుయన్సర్లు ఉద్దేశపూర్వకంగా బహిరంగ ప్రదేశాలను ఘర్షణలను ప్రోత్సహిస్తున్నారని, ఆన్‌లైన్ వేధింపులకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించింది. సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలను సూచించింది.



