Sunday, October 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకేసీఆర్‌పై కక్షతో ఆస్పత్రులపై నిర్లక్ష్యం

కేసీఆర్‌పై కక్షతో ఆస్పత్రులపై నిర్లక్ష్యం

- Advertisement -

బస్తీ దవాఖానాలకు సుస్తీ పట్టించిన కాంగ్రెస్‌
వరంగల్‌ హెల్త్‌ సిటీ, టిమ్స్‌ ఆస్పత్రుల పనులు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే హరీశ్‌రావు
కొత్తపేటలో నిర్మిస్తున్న టిమ్స్‌ ఆస్పత్రి సందర్శన

నవతెలంగాణ- ఎల్బీనగర్‌/కొత్తపేట
కేసీఆర్‌పై కక్షను ఆస్పత్రులపై చూపించడం దారుణమని, తమ ప్రభుత్వంలో తలపెట్టిన నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల(టిమ్స్‌) నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. ఎల్బీనగర్‌లో కొత్తపేట టిమ్స్‌ ఆస్పత్రిని శనివారం ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కాలేరు వెంకటేష్‌, వివేకానంద్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ వందేండ్ల ముందుచూపుతో హైదరాబాద్‌ నలు దిక్కులా నాలుగు టిమ్స్‌ ఆస్పత్రులు, వరంగల్‌ హెల్త్‌ సిటీ, నిమ్స్‌ విస్తరణ వంటి ప్రాజెక్టులు ప్రారంభించారని తెలిపారు. కానీ చేతగాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాటిని రెండేండ్లుగా అర్ధాంతరంగా వదిలేసిందన్నారు.

కేసీఆర్‌కు మంచి పేరు రావద్దన్న ఉద్దేశంతోనే ఆస్పత్రుల నిర్మాణాలను పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. తాము భూసేకరణ, టెండర్లు, డిజైన్‌లు, నిధులు అన్నీ పూర్తి చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేండ్లలో ఐదు అంతస్తుల స్లాబులు మాత్రమే వేసిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉండి ఉంటే ఈ ఆస్పత్రి గతేడాదే ప్రజలకు అందుబాటులోకి వచ్చేదని, ఎక్కడ కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు పేరు వస్తుందోననే పనుల్లో ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ఇదే ముందు చూపు లేని మంద బుద్ధి కలిగిన కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనాతీరుకు నిదర్శనమన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీ స్థాపనకు రూ.176 కోట్లు మంజూరు చేసి జీవో కూడా విడుదల చేసినప్పటికీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును రద్దు చేసిందని తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రులలో ఇంతకుముందు 72 శాతం ప్రసవాలు జరిగితే, ప్రస్తుతం అవి 50 శాతానికి తగ్గిపోయాయని అన్నారు. బస్తీ దవాఖానల డాక్టర్లు, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని, పేదలకు ఆరోగ్యసేవలు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1400 కోట్లకు చేరాయన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైందన్నారు. వరంగల్‌ హెల్త్‌ సిటీ, టిమ్స్‌ ఆస్పత్రుల పనులను యుద్ధ ప్రాతిపదికన ఆరు నెలల్లో పూర్తి చేయాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ పర్యటనలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు శివప్రకాష్‌ చందు, జలంధర్‌, మాజీ కార్పొరేటర్‌లు భవాని ప్రవీణ్‌ కుమార్‌, జిన్నారం విఠల్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఆరేకేపురం డివిజన్‌ అధ్యక్షులు అరవింద్‌ శర్మ, చైతన్యపురి డివిజన్‌ అధ్యక్షులు తోట మహేష్‌ యాదవ్‌, బిజినపల్లి వెంకటేశ్వర రావు, కొండల్‌ రెడ్డి, చెరుకు ప్రశాంత్‌ గౌడ్‌, రమేష్‌ ముదిరాజ్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -