Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణంపై నిర్లక్ష్యం

లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణంపై నిర్లక్ష్యం

- Advertisement -

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇంకా అన్యాయమేనా..? : ప్రభుత్వానికి ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ప్రశ్న
నవతెలంగాణ-షాద్‌నగర్‌

లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణంపై నిర్లక్ష్యం ఇంకెంత కాలం అని, రిజర్వాయర్‌ విషయంలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్షమే ఇప్పడు కూడా కొనసాగుతుందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని పెన్షనర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. పాలమూరు జిల్లా నుంచి కృష్ణానది ప్రవహిస్తున్న కూడా జిల్లాకు సాగునీరు, తాగునీరు మాత్రం అందడం లేదన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మిస్తామని చెప్పిన వాళ్లే కానీ ఇప్పటివరకు రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టలేదన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మించాలని ఇప్పటివరకు ఎన్నోసార్లు పాలమూరు ఆధ్యయన వేదిక నిరసన కార్యక్రమాలు, పాదయాత్రలు చేపట్టిందని తెలిపారు.

అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు సైతం వినతిపత్రాలు అందజేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ హయాంలో డిజైన్లు మార్చారే తప్ప రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టలేదనీ అన్నారు. అధికారంలోకి వస్తే రిజర్వాయర్‌ నిర్మాణం చేపడతామని చెప్పిన కాంగ్రెస్‌ నేతలు కూడా ఇప్పటివరకు పనులు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి కాలువల ద్వారా నల్గొండకు నీళ్లు తరలించే ప్రయత్నం జరుగుతున్నదని, దీనిపై ప్రజలు చైతన్యవంతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మిస్తే తప్ప వలసలు ఆగవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాస్త్రవేత్త డి.నరసింహారెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహకారదర్శి తిరుమలయ్య, రవీంద్రనాథ్‌, అర్జునప్ప, టీజీ శ్రీనివాస్‌, మందారం నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -