– బహిరంగ వేలం ద్వారా కొనుగోళ్లతో రైతులకు నష్టం జరుగుతుంది
– ఈ-నామ్ లో సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి
– పసుపు రైతులను మోసం చేసే చర్యలను సహించేది లేదు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌లో పసుపు కొనుగోలు ప్రక్రియలో ఈ-నామ్ లో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్ల పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. పసుపు రైతుల సమస్యలపై శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పాత ఈ-నామ్ విధానంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు.
సరైన శిక్షణ లేకుండా, సాంకేతిక సదుపాయాలు సిద్ధం చేయకుండా కొత్త ఈ-నామ్ విధానాన్ని అమలు చేయడం వల్ల ఏర్పడిన సాంకేతిక లోపాలతో పసుపు కొనుగోళ్ళ విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కి పసుపు పంట గణనీయంగా వచ్చినా, ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేక కొనుగోలు సక్రమంగ చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఫలితంగా రైతులు ప్రతిసారి పంటను అమ్ముకోవడానికి మూడునాలుగు రోజులు పడిగాపులు కాసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.
పసుపు పంటతో నిజామాబాద్ జిల్లా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న నేపథ్యంలో, రైతులకు ఇబ్బందులు కలిగేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించడం అన్యాయమని పేర్కొన్నారు.ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల మార్కెట్ యార్డ్‌లో పసుపు రైతులు తమ పసుపును అమ్ముకోవడానికి రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఉందన్నారు.పారదర్శకత లేకుండా బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు నష్టం జరిగి, దళారులకు లాభం చేకూర్చడాన్ని ఎమ్మెల్యే తప్పు పట్టారు.
మార్కెట్ యార్డ్ కి పసుపు తీసుకొచ్చి మూడు నాలుగు రోజులైనా సరైన ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను నష్టపరిచే ప్రయత్నం దళారులు చేసే అవకాశం ఉందన్నారు.దళారులు సిండికెట్ అయ్యి పసుపు రైతులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని,పసుపు రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, ఈ-నామ్ విధానంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని, దళారుల ద్వారా పసుపు రైతులు మోసపోకుండా చూడాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడతామని, సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పసుపు రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.



