కాలేజీల నిరవధిక బంద్ విరమణ
రూ.600 కోట్లు త్వరితగతిన విడుదల చేస్తాం
మిగతా బకాయిలు ప్రతినెలా చెల్లిస్తాం
ఫీజు రీయింబర్స్‌మెంట్ హేతుబద్ధీకరణ కోసం కమిటీ వేస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి
ప్రభుత్వానికి ధన్యవాదాలు : ఎఫ్‌ఏటీహెచ్‌ఐ చైర్మెన్ రమేష్‌బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించి తక్షణమే రూ.600 కోట్లు విడుదలకు ప్రభుత్వం అంగీకరించడంతో నిరవధిక బంద్‌ను విరమిస్తున్నట్టు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ సోమవారం నుంచి కాలేజీ యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. సోమవారం సాయంత్రం కూడా కొనసాగాయి. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ టోకెన్లకు సంబంధించిన నిధుల్లో రూ.600 కోట్లు త్వరితగతిన విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు. మిగతా బకాయిలు ప్రతినెలా చెల్లిస్తామని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ హేతుబద్ధీకరణకు సంబంధించి ఉన్నతాధికారులు, కాలేజీ యాజమాన్యాలతో కలిపి కమిటీ వేయాలని నిర్ణయించామన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును ఆదేశించామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశమని అన్నారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి అనేక మంది మధ్యతరగతి కుటుంబాలు, పేదలు, బలహీనవర్గాల పిల్లలు చదువుతున్నారని వివరించారు.
ఆర్థిక పరమైన భారం వారిపై పడకుండా చదివించాలనే ఆలోచనతో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. అంతే చిత్తశుద్ధితో ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుందన్నారు. ఆ దిశగానే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం ముందుకుపోతున్నదని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దశాబ్ధ కాలం ఫీజురీయింబర్స్‌మెంట్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. కొన్నేండ్లు ఫీజు బకాయిలను చెల్లించలేదని అన్నారు. ఆ భారాన్ని తమకు వారసత్వంగా ఇచ్చిందన్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తూ సమస్యలను పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నామని వివరించారు. రాష్ట్రంలో ప్రయివేటు కాలేజీ యాజమాన్యాల సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వానికి భారమైనా పరిష్కరిస్తామని చెప్పారు. కాలేజీల బంద్‌ను విరమించడానికి ముందుకొచ్చినందుకు యాజమాన్యాలకు ఆయన ధన్యవాదాలు ప్రకటించారు. విద్యాపరమైన అంశాలకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంందన్నారు. అందుకోసం అందరి సహాయ సహకారాలను అందించాలని కోరారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
దసరా ముందు శుభసూచకం : రమేష్‌బాబు
తమ సమస్యలు, కష్టాలను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుందని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఏటీహెచ్‌ఐ) చైర్మెన్ నిమ్మటూరి రమేష్‌బాబు అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో టోకెన్లు ఉన్న రూ.600 కోట్లు త్వరగా విడుదల చేయాలని నిర్ణయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. దసరా ముందు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో అధ్యాపకులు, ఇతర సిబ్బందికి శుభసూచకమని అన్నారు. తాము సోమవారం నుంచి తలపెట్టిన నిరవధిక బంద్‌ను విరమించుకుంటున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులోనూ సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి శ్రీధర్‌బాబు, సీఎస్ కె రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసే, ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, ఎఫ్‌ఏటీహెచ్‌ఐ సెక్రెటరీ జనరల్ కెఎస్ రవికుమార్, కోశాధికారి కె కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె సునీల్‌కుమార్, ఇతర ప్రతినిధులు అల్జాపూర్ శ్రీనివాస్, తుమ్మ జైపాల్‌రెడ్డి, ఎస్ పరమేశ్వర్‌రెడ్డి, రేపాక ప్రదీప్‌రెడ్డి, గుర్రం నాగయ్య, కె రామదాస్, ముద్దసాని రమేష్‌రెడ్డి, పుల్లా రమేష్‌బాబు టీపీడీఎంఏ అధ్యక్షులు సూర్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.