Monday, October 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసమాజాన్ని శాసిస్తున్న నయా ఉదారవాదం

సమాజాన్ని శాసిస్తున్న నయా ఉదారవాదం

- Advertisement -

మానవీయ విలువలు, మనిషి మనుగడకు పెను ప్రమాదం : యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జి.విజయ్
టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నాగటి నారాయణ మూడో వర్దంతి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నయా ఉదారవాద విధానాలు సమాజాన్ని శాసిస్తున్నాయని సెంట్రల్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జి విజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం సీనియర్‌ నేత నాగటి నారాయణ మూడవ వర్దంతి సభ జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ”నయా ఉదారవాద అభివృద్ధి, నిరంకుశ పాలనా దశకు సూక్ష్మ పునాదులు” అనే అంశంపై ప్రొఫెసర్‌ విజయ్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడంతో పాటు మానవీయ విలువలను, మానవ సంబంధాలను విధ్వంసం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యా విలువలు వ్యాపారీకరణ అవుతున్నాయనీ, సమష్టి తత్వం పోయి వ్యక్తిగత స్వార్థం, వ్యక్తి వాదం పెరిగిందని అభిప్రాయపడ్డారు. మానవత్వం, నీతి, నిజాయితీ, జాలి, దయను అది బలహీనుల లక్షణాలుగా చిత్రీకరించి వ్యవస్థీకృతం చేసిందనీ, రాజ్యం యొక్క సామాజిక బాధ్యతను కూడా ఉచితాలుగా మార్చి లబ్ది పొందే దోపిడీ వ్యవస్థను నయా ఉదారవాదం నిర్మించిందని అన్నారు. ప్రతి వ్యక్తి తన లాభం కోసం వ్యక్తిగత అభివృద్ధి కోసం ఎదుటివారిని శత్రువులుగా, పోటీదారులుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. సమ సమాజ నిర్మాణం జరగాలంటే ఈ వ్యవస్థను కూలదోయాల్సిన కర్తవ్యం సామాజిక స్పృహ ఉన్న అందరిపై ఉందని వ్యాఖ్యానించారు.

యూటీఎఫ్‌ రాష్ట్ర మాజీ గౌరవాధ్యక్షులు పి.కృష్ణమూర్తి మాట్లాడుతూ నాగటి నారాయణ అట్టడుగు వర్గం నుంచి ఉపాధ్యాయ ఉద్యమంలో జాతీయ స్థాయికి ఎదిగిన తీరును గుర్తు చేశారు. ఈ తరం నాయకులకు ఆయన పోరాట తత్వం, ధృఢమైన నాయకత్వం స్పూర్తి అని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు చావ రవి మాట్లాడుతూ ఈ తరం ఉపాధ్యాయులకు నాగటి నారాయణ చేసిన కృషిని వివరించడం ద్వారా వారిలో సామాజిక బాధ్యతను పెంచాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్‌, ఉపాధ్యక్షులు కె. జంగయ్య, వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ టీచర్‌ ప్రధాన సంపాదకులు పి.మాణిక్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర్‌ రెడ్డి, సోమశేఖర్‌, నాగమణి, కె.రవికుమార్‌, శ్రీధర్‌, సింహాచలం, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -