కొత్త విద్యావిధానం రూపకల్పనకు కమిటీ చైర్మెన్‌గా కే కేశవరావు
అక్టోబర్ 30 నాటికి నివేదిక సమర్పించాలి
ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జాతీయ స్థాయిలో నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ)ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. రాష్ట్రంలో కొత్త విద్యావిధానం తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ (టీఈపీ)ని రూపకల్పన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ రైజింగ్-2047లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ కమిటీ చైర్మెన్‌గా ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సభ్యులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, విద్యాకమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, చైర్మెన్ సిఫారసు చేసిన మరో సభ్యునితోపాటు సభ్యకార్యదర్శిగా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ వివిధ అంశాలను పరిశీలించి అధ్యయనం చేసి అక్టోబర్ 30 నాటికి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. జాతీయ నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ- 2020)ని పరిశీలించాలనీ, రాష్ట్రానికి అనుకూలంగా ఉన్న అంశాలను అడాప్ట్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న విద్యావిధానం, మార్కెట్ అవసరాలు, ఉద్యోగావకాశాలు, నైపుణ్యం, ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు, డిజిటల్ రంగం, ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్ వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. పరిశోధనలు బలోపేతం అయ్యేలా సిఫారసలు చేయాలని కోరారు. పరిశ్రమలు, విద్యాశాఖ మధ్య పరస్పరం సహకారం ఉండేలా చూడాలని సూచించారు. పాఠశాలలు, ఉన్నత, సాంకేతిక, వృత్తివిద్యతోపాటు నైపుణ్యం, వృత్తి నైపుణ్యం వంటి అంశాల్లో సంస్కరణలుండాలని తెలిపారు. నాణ్యమైన విద్యతోపాటు అందరికీ అందుబాటులో ఉండేలా, సమానంగా అందేలా చూడాలని కోరారు.
తెలంగాణకు విద్యావిధానం లేదు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014, జూన్ రెండో తేదీన ఆవిర్భవించింది. పదేండ్లపాటు బీఆర్‌ఎస్ పాలించింది. ఇప్పటి వరకు తెలంగాణకు ప్రత్యేకంగా విద్యావిధానం రూపొందించకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 2023, డిసెంబర్ ఏడో తేదీన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారు. గతంలో విద్యాకమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ (టీఈపీ)ని రూపొందించేందుకు కమిటీని నియమించారు.
జాతీయ స్థాయిలో ఎన్‌ఈపీ రాష్ట్రంలో టీఈపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES