నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి మంగళవారం రాజీనామా చేశారు. వందలాది మంది ఆందోళనకారులు ప్రధాని కార్యాలయంలోకి ప్రవేశించడంతో కె.పి.శర్మ ఓలి రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహితుడు ప్రకాష్ సిల్వాల్ తెలిపారు. భక్తపూర్‌లోని బాల్‌కోట్‌లో ఓలి నివాసానికి ఆందోళనకారులు నిప్పుపెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతం ఖాట్మండుకు తూర్పున ఉంది. నిరసనకారులు నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్కిస్ట్-లెనినిస్ట్) కార్యాలయాలతో పాటు ఓలి పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు యత్నించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఓలి ప్రభుత్వానికి నేపాలీ కాంగ్రెస్ మద్దతు కొనసాగుతోంది. హింసాత్మక ఘటనలతో ఖాట్మండులోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంగళవారం పాక్షికంగా మూసివేసినట్లు విమానయాన సంస్థ తెలిపింది. రాజధాని ఖాట్మండు సహా పలు ప్రధాన నగరాల్లో గత రెండు రోజులుగా నిరసనలు, ఆందోళనలు, హింస చెలరేగిన సంగతి తెలిసిందే.
రాజీనామా అనంతరం నేపాల్ ప్రధాని మీడియాతో మాట్లాడారు. సమస్యకు పరిష్కారం కోసం, రాజకీయంగా పరిష్కరించేందుకు సహాయం చేయడానికి రాజీనామా చేశానని అన్నారు.