సైన్స్ ల్యాబ్, వాటర్ ప్యూరిఫైయర్ అందజేత
నవతెలంగాణ – పరకాల
మండలంలోని వెల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నెస్లే కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ పరికరాలను, తాగునీటి శుద్ధి యంత్రాన్ని (వాటర్ ప్యూరిఫైయర్) ప్రారంభించారు. సామాజిక బాధ్యతలో భాగంగా నెస్లే సంస్థ, పారస్ మరియు పసిడి పంట ప్రతినిధుల సహకారంతో ఈ సౌకర్యాలను కల్పించింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యార్థం సైన్స్ ల్యాబ్‌కు అవసరమైన టేబుళ్లు, ర్యాక్‌లతో పాటు స్వచ్ఛమైన తాగునీటి కోసం ప్యూరిఫైయర్‌ను అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దాతల సహకారం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని పేర్కొంటూ నెస్లే సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
పారస్ ప్రతినిధి అనిల్ కన్నన్ మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, గ్రామాల్లోని దాతలు కూడా విద్యా సంస్థల బలోపేతానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శివ, ప్రశాంత్, దినేష్, శ్రీనివాస్, గీత, రాజు మరియు పాఠశాల ఉపాధ్యాయులు బాబు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


