Sunday, November 9, 2025
E-PAPER
Homeకవితగూడులేని పిట్ట

గూడులేని పిట్ట

- Advertisement -

అది గూడెందుకు
కట్టుకోలేదో…..
ఎంతకూ అర్థం కాని నాకు
ఏం చేయాలో పాలుపోలేదు
నల్లని బుల్‌ బుల్‌ పిట్ట
వొంటరిగా డాబాపై నిద్రిస్తోంది
చిన్న విద్యుత్‌ బాక్సే దాని నివాసం
పగలంతా…
పచ్చని గార్డెన్‌ లో కిచ కిచ మంటూ…
కేరింతలు కొడుతూ..
మట్టి చిప్పలోని చల్లని నీళ్లలో స్నానమాడి
రాత్రి కాగానే
వెచ్చగా ఆ బాక్సుపై వాలిపోతుంది
దాని జీవన శైలి కాస్త భిన్నంగానే ఉంది
స్విచ్‌ వేస్తూ …
మేము డాబా పైకి వెళ్తుంటామా..
అది గమ్మున అలాగే ఉండి పోతుంది
దాని ధైర్యానికి ఓమారు ముచ్చటేస్తుంది
మొన్నమాత్రం…
దీపావళి టపాసుల మోతకు
బిక్కు బిక్కు మంటూ..
దాని చిన్ని గుండెను
రెక్కల చాటున దాచుకొని
కళ్ళను చీకట్లలో కప్పుకొని
బ్రతుకు జీవుడా అన్నట్టు ఓ ఫోజిచ్చింది
తెల్లారగానే..
ఆందోళన లేని
దాని హావభావాలు చూస్తే..
మౌనంగానే ఓ కొత్తపాఠం నేర్చుకున్నట్టైంది
ఈ రోజు భయం రేపు తెరమరుగవుతుందనీ ..
ఇంతకూ …
అది గూడెందుకు కట్టుకోలేదో..
ఒకటే వేదన నాకు
అడవుల్ని ఊళ్లు ఆక్రమించాక
వాటికి గూళ్ళు కరువవుతున్నాయేమో..
లేదా.. మనిషితోనో..మానవత్వం తోనో..
దోస్తానా చేయాలనుకుందేమో..
కూడు గూడు ..తోడు నీడ
అన్నీ వున్న మనిషిలో వేల వేల నిట్టూర్పులు
యక్ష ప్రశ్నలు సంధిస్తున్నట్టు
వసారా క్రింద స్వేచ్ఛగా దాని తచ్చాట
ఏదో బానిసత్వాన్ని మోస్తూ..
దానికి ఒక గూడు కట్టలేక
త్రిశంకు స్వర్గం లో నేను..!

  • డా.కటుకోఝ్వల రమేష్‌, 9949083327
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -