దేశం దాటిన పెట్టుబడులే ఎక్కువ
భారత్‌పై విదేశీ ఇన్వెస్టర్ల అనాసక్తి
ముంబయి : భారత ఆర్థిక వ్యవస్థపై విదేశీ పెట్టుబడిదారులు మొఖం చాటెయ్యడంతో పాటుగా స్వదేశీ ఇన్వెస్టర్లు కూడా భారత్ బయట అధిక పెట్టుబడులకు ఆసక్తి కనబర్చుతున్నారు. కొత్త పెట్టుబడులేమో కానీ.. ఉన్న పెట్టుబడులను వరుసగా నాలుగో నెలలోనూ తరలించుకుపోవడంతో 2025 నవంబర్‌లోనూ ప్రత్యక్ష నికర పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రతికూలంగా నమోదయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడుల కంటే.. భారత్ నుండి వెళ్లిన పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది నవంబర్‌లో నికర ఎఫ్‌డీఐలు మైనస్ 446 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.4,000 కోట్లు)గా నమోదయ్యాయి. పెట్టుబడుల రాక కంటే నిష్క్రమణలే ఎక్కువగా ఉండటం గమనార్హం.
2025 నవంబర్‌లో మొత్తంగా భారత్‌లోకి 6.4 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐలు వచ్చాయి. సెప్టెంబర్‌లో 7 బిలియన్లుగా, అక్టోబర్‌లో ఈ పెట్టుబడులు 6.5 బిలియన్లుగా ఉన్నాయి. 2024 నవంబర్‌లోని ఎఫ్‌డీఐలతో పోల్చితే గడిచిన నవంబర్‌లో 22.5 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన నవంబర్‌లో భారత కంపెనీలు విదేశాల్లో 3.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఇవి గతేడాదితో పోల్చితే 63.1 శాతం అదనంగా పెరిగాయి. ఇందులో అత్యధికంగా సింగపూర్, మారిషాస్, యూఎస్, యూకేకు వెళ్ళాయి.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం కంటే, పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. నవంబర్ నెలలో ఎఫ్‌డీఐల ప్రవాహం కంటే తిరుగు ప్రవాహం ఎక్కువగా ఉన్నట్టు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, ఉపసంహరించుకోవడమే ప్రధాన కారణమని తెలిపింది. భారత్-అమెరికా మధ్య జరగాల్సిన వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడం, రూపాయి విలువ క్షీణించడం వంటి అంశాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీశాయి.
నాలుగో నెలలోనూ నికర ఎఫ్‌డీఐల్లో క్షీణత
- Advertisement -
- Advertisement -



