– బయటికి వెళ్లిన పెట్టుబడులే ఎక్కువ
– భారత్‌పై విదేశీ ఇన్వెస్టర్ల అనాసక్తి
ముంబయి : భారత ఆర్థిక వ్యవస్థపై విదేశీ పెట్టుబడిదారులు మొఖం చాటేస్తున్నారు. కొత్త పెట్టుబడులేమో కానీ. ఉన్న పెట్టుబడులను తర లించుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా మూడో నెలలోనూ నికర ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రతికూలంగా నమోద య్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడుల కంటే.. భారత్ నుంచి వెళ్లిన పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో నికర ఎఫ్‌డీఐలు మైనస్ 1.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.13,400 కోట్లు)గా నమోద య్యాయి. పెట్టుబడుల రాక కంటే నిష్క్రమణలే ఎక్కువగా ఉండటం గమనార్హం. విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు పెరగడం విశేషం. 2025 అక్టోబర్‌లో మొత్తంగా భారత్‌లోకి 6.5 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. సెప్టెంబర్‌లో ఈ పెట్టుబడులు 6.6 బిలియన్లుగా ఉన్నాయి. 2024 అక్టోబర్‌లోని ఎఫ్‌డీఐలతో పోల్చితే గడిచిన అక్టోబర్‌లో 8.8 శాతంగా తగ్గుదల చోటుచేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత కంపెనీలు విదేశాల్లో 3.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఇవి గతేడాదితో పోల్చితే 63.1 శాతం అదనంగా పెరిగాయి. 2025 అక్టోబర్‌లో విదేశీ కంపెనీలు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తరలించుకుపోయాయి. భారత కంపెనీలు విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు, విదేశీ కంపెనీలు తరలించుకుపోయిన పెట్టుబడుల మొత్తం కలిపి పోల్చితే భారత్‌లోకి వచ్చిన నికర విదేశీ పెట్టుబడులు 1.5 బిలియన్లు తక్కువగా నమోద య్యాయి. గతేడాది అక్టోబర్‌లో ఈ మొత్తం మైనస్ 129 మిలియన్ డాలర్లుగా ఉంది.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులు పెట్టడంకంటే, పెట్టిన పెట్టుబడులను ఉపసంహ రించుకోవడానికే మొగ్గు చూపుతున్నారని ఆర్‌బీఐ తన బులిటెన్‌లో పేర్కొంది. భారతీయ కంపెనీలు ప్రధానంగా సింగపూర్, అమెరికా, యూఏఈ దేశాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయి. మొత్తం తరలిపోయిన పెట్టుబడుల్లో సగానికి పైగా ఈ మూడు దేశాలకే వెళ్లాయి. ఇందులో 90 శాతం పెట్టుబడులు ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, బిజినెస్ సర్వీసెస్, రిటైల్ ట్రేడ్, తయారీ రంగాల్లో ఉన్నాయి.
మూడో నెలలోనూ నికర ఎఫ్‌డీఐల్లో పతనం
- Advertisement -
- Advertisement -



