ఐదోసారి అమెరికా పర్యటనకు ఇజ్రాయిల్ ప్రధాని
వాషింగ్టన్: గాజాలో నెలకొన్న కాల్పుల విరమణ ప్రణాళికలో భాగంగా తదుపరి చర్యలకు సంబంధించి కీలకమైన పర్యటనగా భావిస్తున్న నేపథ్యంలో, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెత న్యాహు సోమవారం ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు ఈ విషయాన్ని ఇజ్రాయిల్ అధికారులు ధ్రువీ కరించారు. ఈ ఏడాదిలో కీలక మిత్రపక్షమైన ట్రంప్‌ను కలవడానికి నెతన్యాహు అమెరికాలో పర్యటించడం ఇది ఐదవసారి. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయిల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశకు ముందుకు సాగడానికి ట్రంప్ పరిపాలన, ప్రాంతీయ మధ్యవర్తులు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన పర్యటన జరుగుతోంది. ”అతను(ఇజ్రాయిల్ ప్రధాని) నన్ను కలవాల నుకుంటున్నారు. మేం దాన్ని అధికారికంగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు”. అని ట్రంప్ తన మార్-ఎ-లాగో రిసార్ట్‌కు బయలుదేరే ముందు అన్నారు.
ఎటూ సాగడం లేదు
గాజా విషయానికొస్తే, ఈ సమావేశం ”చాలా ముఖ్యమైనది” అని హమాస్‌తో రహస్య చర్చలలో పాల్గొన్న ‘అలయన్స్ ఫర్ టూ స్టేట్స్’ అనే శాంతి నిర్మాణ కమిషన్ సహ-అధిపతి గెర్షోన్ బాస్కిన్ అన్నారు. ”మొదటి దశ ప్రాథమికంగా ముగిసింది. ”రెండో దశ ప్రారంభం కావాలి, ఇది ఇప్పటికే ఆలస్యమైంది . అమెరికన్లు కూడా ఇది ఆలస్యమైందని గ్రహించారని నేను భావిస్తున్నాను,
వాషింగ్టన్, దాని ప్రాంతీయ మిత్రపక్షాల మధ్యవర్తిత్వంతో కుదిరిన అక్టోబర్ గాజా కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశకు వెళ్లడంలో పురోగతి ఇప్పటివరకు నెమ్మదిగా ఉంది. రెండు వైపులా తరచుగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఇజ్రాయిల్, హమాస్ రెండూ కూడా ఆగిపోతున్నాయని మధ్యవర్తులు భయపడుతున్నారు.
మరోవైపు ఇజ్రాయిల్ గాజాలోని తన స్థానాల నుంచి వైదొలగాలని, హమాస్‌కు బదులుగా పాలస్తీనా భూభాగాన్ని పరిపాలించడానికి ఒక తాత్కాలిక అధికారం, అంతర్జాతీయ స్థిరీకరణ దళం (ఐఎస్‌ఎఫ్)ను మోహరించాలని భావిస్తున్నారు. పాలస్తీనా ఇస్లామిక్ ఉద్యమం హమాస్ తన ఆయుధాలను విడిచిపెట్టాలనే నిబంధన కూడా ఇందులో ఉంది . అయితే ఇది ఒక ప్రధాన అడ్డంకిగా మారుతోందనే చర్చ నడుస్తోంది. మరోవైపు నెతన్యాహు కాల్పుల విరమణను దెబ్బతీసేందుకు శాంతి ప్రక్రియను నిలిపివేయడానికి తీసుకుంటున్న చర్యలపై సీనియర్ ట్రంప్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అది నివేదించింది. ”నెతన్యాహు పట్ల అమెరికన్ పరిపాలన నిరాశ చెందుతున్నట్టు సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి” అని లండన్‌కు చెందిన థింక్-ట్యాంక్ చాథమ్ హౌస్‌లో మిడిల్ ఈస్ట్ నిపుణుడు యోస్సీ మెకెల్‌బర్గ్ అన్నారు.
నెతన్యాహు ఎజెండాలో…
ట్రంప్ పరిపాలన గాజాపై పురోగతి కోసం ఆసక్తిగా ఉన్నప్పటికీ, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని , బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను పునర్నిర్మించే అవకాశం నెతన్యాహు ఎజెండాలో అగ్రస్థానంలో ఉండవచ్చని విశ్లేషకులు తెలిపారు. ”ఇరాన్ తన క్షిపణులను నిర్మించడం, ఇజ్రాయిల్‌కు ముప్పుగా ఉండటం గురించి గత రెండు వారాలుగా ఇజ్రాయిల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇరాన్ గురించి మాట్లాడటానికి ఇష్టపడే కీలక సమస్యపై కాకుండా..గాజా నుంచి దృష్టిని మళ్లించడానికి ప్రణాళికాబద్ధమైన వ్యూహంలో భాగంగా అమెరికాకు వస్తున్నారు” అని బాస్కిన్ అన్నారు.



