నవతెలంగాణ-హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో నిర్మిస్తున్న న్యూ అహోబిలం ఆలయం కూలిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ దేశంలోని క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల న్యూ అహోబిలం ఆలయం శుక్రవారం కూలిపోయినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 52 ఏళ్ల భారత సంతతి వ్యక్తి సహా నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు, పలువురు ఆలయ అధికారులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టతలేదన్నారు.
దీంతో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. టన్నులకొద్దీ శిథిలాలు ఉండటంతో.. వాటిని తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రమాదంలో మరణించిన భారత సంతతి వ్యక్తిని ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, నిర్మాణ ప్రాజెక్టు మేనేజర్ విక్కీ జైరాజ్ పాండేగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. దాదాపు రెండేళ్లుగా ఆయన ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.



