నవతెలంగాణ – హైదరాబాద్ : రెండు లక్షలు ధర ఉండే బైక్‌ను లక్షకే తీసుకెళ్లండి. పది లక్షల వాహనాన్ని ఐదు లక్షలకే సొంతం చేసుకోండంటూ ఆఫర్స్ ఇస్తున్న ముఠా ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. వివరాల్లోకి వెలితే.. వాహన ఫైనాన్స్ సంస్థలను మోసం చేసి కొత్త వాహనాలను ఎత్తుకుపోయే ముఠా మోసాన్ని అనంతపురం జిల్లా పోలీసులు గుర్తించారు. ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుతో ఆరా తీస్తే ఈ వ్యవహరం బయటపడింది. ఓ ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదుతో ఈ నయా మోసం నిగ్గు తేల్చడానికి వారం రోజులుగా పోలీసులు యత్నిస్తున్నారు. నకిలీ ఆధార్, ఇతర పత్రాలతో వాహన ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు తీసుకుని వివిధ కంపెనీలకు చెందిన వాహనాలను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఒకరి ఫోటో, మరొకరి ఆధార్ నెంబర్, ఇంకొకరి చిరునామా సేకరించి నకిలీ ఆధార్ కార్డు సృష్టించి వాహనాలు కొంటున్నారు. అలా కొన్న వాటిని విక్రయించడానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను ఈ ముఠా నియమించుకుంది. వాయిదా పద్ధతితో వాహనాలు కొనుగోలు చేస్తున్న ముఠా వాటిని సగం ధరకే అమ్మేస్తుంది.
వివిధ కంపెనీలకు చెందిన ద్విచక్రవాహనాలతో పాటు సరకు రవాణా ఆటోలను పక్క జిల్లాలకు తరలించి అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారు. తాడిపత్రిలో ఒక్క ఏజెంటే సుమారు 400 వాహనాలు విక్రయించినట్లు సమాచారం అందుకుని అతన్ని విచారించగా ఒక్కరోజులోనే 72 కొత్త వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండిపై పది వేలు లాభం వేసుకుని ఏజంట్లు సగం ధరకే విక్రయిస్తున్నారు. విక్రయం తర్వాత సదరు ఫైనాన్స్ కంపెనీలకు రెండు లేదా మూడు నెలల వాయిదా చెల్లించి కనిపించకుండా పోతున్నారు. వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం లేకుండపోతోంది.
తమ వద్ద కొన్న వాహనాలకు పేపర్లు ఉండవని రిజిస్ట్రేషన్ చేసుకోడానికి వీలుండదని ఏజెంట్లు ముందుగానే చెప్పేస్తున్నారు. సగం ధరకే కొత్త వాహనం వస్తుందన్న ఆనందంతో కొనుగోలుదారుడు ఆసక్తి చూపుతున్నారు. ఎవరైనా అడిగినప్పుడు చూద్దాంలే అని తేలిగ్గా తీసుకుంటున్నారు. విషయం జిల్లా ఎస్పీ దృష్టికి రావటంతో పోలీసులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి రహస్యంగా దర్యాప్తు చేయిస్తున్నారు. అంతర్రాష్ట్ర స్థాయిలో ఈ రాకెట్ ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం.