వచ్చే త్రైమాసికం నుంచే ఉత్పత్తి
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ వెల్లడి
నవతెలంగాణ – హైదరాబాద్
బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయనున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ వెల్లడించింది. వచ్చే త్రైమాసికం నుంచే వీటిని ఉత్పత్తి చేయనున్నట్లు ఎంఇఐఎల్‌కు చెందిన ఒలెక్ట్రా ఓ ప్రకటనలో పేర్కొంది. భారత ఇవి బస్ రంగంలో తొలిసారిగా ఒలెక్ట్రా అభివృద్ధి చేసిన బ్లేడ్ బ్యాటరీ ప్యాక్‌కు లభించిన సర్టిఫికేషన్ సంస్థకు కీలక మైలురాయిగా నిలిచిందని సంస్థ ఎండీ మహేష్ బాబు వెల్లడించారు. ఇది సంస్థ టెక్నాలజీ ఆధారిత వృద్ధి వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. శుభ్రమైన, సమర్థవంతమైన, సుస్థిర మొబిలిటీ పరిష్కారాల ద్వారా దేశంలో విద్యుత్ వాహన రంగంలో వస్తున్న మార్పులకు ఒలెక్ట్రా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3) ఆర్థిక ఫలితాలకు ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. బ్లేడ్ బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానంతో నూతన బస్సుల ఉత్పత్తి ప్రణాళికను వెల్లడించారు. క్రితం క్యూ3లో 385 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసి సంస్థ కొత్త రికార్డును నెలకొల్పిందన్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే డెలివరీలు 37 శాతం పెరిగాయి. కంపెనీ ఆదాయం 29 శాతం పెరిగి రూ.663.60 కోట్లకు చేరింది. కంపెనీ నికర లాభం రూ.46.68 కోట్లుగా నమోదయ్యింది.
బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో నూతన బస్సుల తయారీ
- Advertisement -
- Advertisement -



