– ఉమ్మడి వరంగల్ కమిటీ సమావేశంలో నిర్ణయం
– పార్టీ బలోపేతంపై చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే మండల, బ్లాక్, గ్రామస్థాయిలో కొత్త కమిటీలను నియమించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు నిర్ణయించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది. పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటు, ఇతర అంశాలపై సమావేశంలో నేతలు చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. కొత్త కమిటీల్లో పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించారు. మండలానికి ఐదుగురి చొప్పున పేర్లను ఫైనల్ చేశారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సూచనమేరకు ఉమ్మడి జిల్లాలకు ఒక ఇన్‌చార్జితోపాటు ఇద్దరు పర్యవేక్షకులను నియమించారు.
ఎమ్మెల్సీ కవితపై మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయం : మహేశ్‌కుమార్‌గౌడ్
మహిళలను గౌవరించుకోవడం మన సంప్రదాయమని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మల్లన్న కార్యాలయంపై దాడి చేయడం కూడా సరైందికాదని తెలిపారు. చట్ట పరిధిలో అందరూ పని చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ కృషి ఫలితంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయని గుర్తు చేశారు.
ఢిల్లీకి జగ్గారెడ్డి
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి ఆదివారం ఢిల్లీకి బయలుదేరారు. వచ్చే నెల 7న సంగారెడ్డి పట్టణంలో కూతురు జయారెడ్డి వివాహం జరగనుంది. ఏఐసీసీ అగ్రనేతలకు కూతురు వివాహా ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు.