Saturday, October 11, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅప్పుల కోసమే కొత్త డిస్కం!

అప్పుల కోసమే కొత్త డిస్కం!

- Advertisement -

– కార్పొరేషన్‌ తరహాలోనే ఏర్పాటు
– కాగితాల్లోనే కనిపించేలా విధివిధానాలు
– రూ.9వేల కోట్లు సమీకరించాలని లక్ష్యం
– కొత్త కొలువులు లేవ్‌… డిప్యుటేషన్‌ ఉద్యోగులే!
– మింట్‌ కాపౌండ్‌లోనే సీఎమ్‌డీ ఆఫీస్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో సబ్సిడీ విద్యుత్‌ పథకాలన్నింటినీ ఒకే చోటకు చేర్చుతూ కొత్త డిస్కం ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ డిస్కం నిర్వహణ, నిధులు, విధులు, ఉద్యోగుల కేటాయింపు, జీత భత్యాల చెల్లింపులు వంటివి ఎలా పరిష్కరిస్తారనేది ప్రధాన ప్రశ్న. కొత్త డిస్కం కోసం కొత్త నియామకాలు ఉండబోవని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా చెప్పేసింది. అంటే ఇప్పుడున్న రెండు డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్‌కో నుంచి ఉద్యోగుల్ని డిప్యుటేషన్‌పై నియమించుకుంటారు. అయితే కేవలం ప్రభుత్వ సబ్సిడీలపైనే ఆధారపడి నడిచే డిస్కంలో పనిచేసేందుకు విద్యుత్‌ ఉద్యోగులు సిద్ధంగా ఉంటారా అనేదీ సందేహమే. ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస (టీజీఎన్పీడీసీఎల్‌)లో 60 శాతం వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌)లో 40 శాతం ఉన్నాయి. ఒకే లైన్‌పై అగ్రికల్చర్‌ కనెక్షన్‌, గృహ వినియోగదారుని సర్వీస్‌ కనెక్షన్లు ఉంటాయి. వ్యవసాయానికి, 200 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ లైన్లపైనే కమర్షియల్‌తో పాటు ఇతర కేటగిరిల కనెక్షన్లు కూడా ఉన్నాయి. సబ్సిడీ కనెక్షన్లను మినహాయిస్తే, మిగిలిన కనెక్షన్లను ఎవరు నిర్వహించాలనేదానిపై సందిగ్థత నెలకొంది. ప్రభుత్వ సబ్సిడీ కనెక్షన్లు అన్నీ కొత్త డిస్కం పరిధిలోకి వెళ్తే, పాత డిస్కంలు పూర్తిగా విద్యుత్‌ వాణిజ్య వ్యాపారానికే పరిమితం కావల్సి ఉంటుంది. వారికి ప్రధాన ఆదాయం హెచ్‌టీ (పరిశ్రమలు), కమర్షియల్‌ కేటగిరిల నుంచే వస్తుంది. అయితే ఇప్పటికే భారీ పరిశ్రమల్లో సింహభాగం క్యాప్టివ్‌ పవర్‌ను వినియోగిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే వంటి పెద్ద సంస్థలు ఓపెన్‌ యాక్సెస్‌కు వెళ్తున్నాయి.

డిస్కంలు సరఫరా చేస్తున్న యూనిట్‌ విద్యుత్‌ ధర ఎక్కువగా ఉంటుందనీ, ఓపెన్‌ యాక్సెస్‌లో సగం ధరకే బహిరంగ మార్కెట్లో కరెంటు దొరుకుతుందని ప్రతి బహిరంగ విచారణలో ఆయా సంస్థలు చెప్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే డిస్కంల నుంచి కరెంటు కొనుగోళ్లను భారీగా తగ్గించేసింది. కేవలం పాత విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను(పీపీఏ) మాత్రమే కొన సాగిస్తుంది. ఓపెన్‌ యాక్సెస్‌ ద్వారా రైల్వే తనకు అవసరమైన విద్యుత్‌ను ఓపెన్‌మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తోంది. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న హెచ్‌టీ కనెక్షన్లు ఓపెన్‌ యాక్సెస్‌కు వెళ్తే, డిస్కంల ఆదాయం తగ్గిపోతుంది. అప్పుడు ఉద్యోగుల జీత భత్యాలు, లైన్ల నిర్వహణ వంటి అనేక ఖర్చుల్ని భరించే ఆర్థిక స్థోమతను కోల్పోతాయి. మరోవైపు హెచ్‌టీ, కమర్షియల్‌ కనెక్షన్లు ఉండటం వల్లే డిస్కంలు క్రాస్‌ సబ్సిడీ ద్వారా టారిఫ్‌ శ్లాబుల్ని అమలు చేస్తున్నాయి. అలాంటప్పుడు సబ్సిడీల కోసమే ఏర్పడే కొత్త డిస్కంలో హెచ్‌టీ కనెక్షన్లు ఉండవు కాబట్టి, క్రాస్‌ సబ్సిడీ ఉంటుందా లేదా అనే సందేహాలు ఉన్నాయి. మరోవైపు పాత డిస్కంలకు ఆదాయం తగ్గితే, విద్యుత్‌ వినియోగదారులపై ట్రూ అప్‌ చార్జీల భారాలు తప్పవు. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా డిస్కంను ఏర్పాటు చేయలేదని విద్యుత్‌రంగ నిపుణులు చెప్తున్నారు.ఏపీ, మహారాష్ట్రలో కొన్ని ప్రయోగాలు చేసినా, అవేవీ సక్సెస్‌ కాలేదని ఉదహరిస్తు న్నారు. 2003 విద్యుత్‌ చట్టంలో కూడా కొత్త డిస్కంల ఏర్పాటుకు అనుకూలమైన విధివిధానాలు లేవు. అసలు ఆ చట్టంలో సబ్సిడైజ్డ్‌ వినియోగదారుల కోసం ప్రత్యేక డిస్కం ప్రస్తావనే లేదు. అందువల్ల కొత్త డిస్కంను ఏ చట్టం పరిధిలో ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త డిస్కం ఏర్పడితే మింట్‌ కాంపౌండ్‌లోనే సీఎమ్‌డీ కార్యాల యాన్ని ఏర్పాటు చేస్తారని సమాచారం. అక్కడ కేవలం పరిమిత సంఖ్యలో డిప్యూటేషన్‌ ఉద్యోగుల్ని నియమించి, కాగితాల్లోనే డిస్కం (కార్పొరేషన్‌) నిర్వహణ చేస్తారని తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో నిధుల సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీపీడీసీఎల్‌) పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి, దానిద్వారా బ్యాంకు రుణాలు తెచ్చి కృష్ణపట్నం (2ఞ800) సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ స్టేషన్‌ను నిర్మించారు. ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటు చేసే కొత్త డిస్కం కూడా వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప, వినియోగదారులకు దీనివల్ల ఒనగూరే ప్రయోజనాలేమీ కనిపించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రశ్నలకు బదులేది?
– సబ్సిడీ పొందిన కేటగిరీ వినియోగదారులను మాత్రమే వేరు చేసి ఒకే డిస్కం కింద ఉంచితే, ఇతర వర్గాల నుండి క్రాస్‌ సబ్సిడీ ఇకపై అందుబాటులో ఉండదు. కాబట్టి టారిఫ్‌ వాస్తవ సరఫరా ఖర్చు (సీఓఎస్‌)ను తీర్చడానికి అనివార్యంగా విద్యుత్‌ చార్జీలు పెంచాల్సి ఉంటుంది.
– అదే సమయంలో ఎక్కువ విద్యుత్‌ వినియోగించే వారికి క్రాస్‌ సబ్సిడీ ఉండదు కాబట్టి వారికి యూనిట్‌ రేట్లు తగ్గుతాయి. ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు టీజీఈఆర్సీ బహిరంగ విచారణల్లో క్రాస్‌ సబ్సిడీ ఎత్తేయాలని కోరుతున్న విషయం తెలిసిందే.
2003 విద్యుత్‌ చట్టం సబ్సిడీ వినియోగదారులను ప్రత్యేకంగా విభజించడానికి అంగీకరించదు. అందువల్ల కొత్త డిస్కం ఆర్థిక స్థితిగతుల ప్రాధాన్యతను నిర్థారించడం కష్టమౌతుంది.

– డిస్కం ఏర్పడాలంటే భౌగోళిక ప్రాంతానికి తప్పనిసరిగా విద్యుత్‌ పంపిణీ లైసెన్స్‌ను జారీ చేయాలి. ఆ ప్రాంతంలో అన్ని వర్గాల విద్యుత్‌ వినియోగదారులు ఉంటారు. అలాంటప్పుడు కొత్త డిస్కం విద్యుత్‌ పంపిణీదారుగా ఉంటుందా లేక సరఫరా లైసెన్స్‌ను కలిగి ఉంటుందా అనేదీ పరిశీలించాలి.

– కొత్త డిస్కం ఏర్పాటుతో సబ్సిడీ పొందిన వినియోగదారులను విభజించిన తర్వాత, అధిక చెల్లింపు వినియోగదారులు మాత్రమే మిగులుతారు. అలాంటి సమయంలో వినియోగదారుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడం సులభం అవుతుంది. ప్రాంతాల వారీగా విద్యుత్‌ బిల్లుల వసూళ్లు సహా ఇతర అనేక అంశాల ప్రాతిపదికగా ప్రయివేటు కంపెనీలకు ఫ్రాంచైజీలు ఇవ్వడం ప్రభుత్వాలకు సులభం అవుతుంది.


పూర్తిగా సబ్సిడీలతో నడిచే డిస్కంలో అసలు లాభాలు అనే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటప్పుడు దాని మనుగడ సాధ్యమేనా? సాధారణ వినియోగదారు ఆధారిత
కంపెనీల్లో సహజంగానే లాభం, నష్టం, ఖర్చులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ పన్నుల్ని నిర్ణ యిస్తారు. సబ్సిడీ డిస్కం ఏర్పాటైతే, ఆయా పన్నుల్ని ఎలా నిర్ణయిస్తారు… ఎవరు చెల్లిస్తారు అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంటుంది.

డిస్కం కాదు…కార్పొరేషనే !
ప్రభుత్వం పైకి కొత్త డిస్కం అని చెప్తున్నా, అధికారికంగా ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనివల్ల ప్రభుత్వం కొత్త అప్పులు తెచ్చుకోవడానికి మార్గం సుగమమవుతుంది. దాదాపు రూ.9 వేల కోట్లను సమీకరించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
చట్టం అంగీకరించదు : డాక్టర్‌ దొంతి నర్సింహారెడ్డి, సభ్యులు, పీపుల్స్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ ఆన్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్‌ (పీఎమ్‌జీఈఆర్‌)
సబ్సిడీల కోసమే ప్రత్యేక డిస్కం ఏర్పాటుకు 2003 విద్యుత్‌ చట్టం అనుమతించదు. పైకి డిస్కం అని ప్రభుత్వం చెప్తున్నా, బహుశా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తారేమో? ఇప్పుడున్న డిస్కంలకే ప్రభుత్వాలు టైం ప్రకారం సబ్సిడీ నిధులు కేటాయిస్తే, అవి నష్టాల్లోంచి బయటపడతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల బకాయిలే రూ.కోట్లలో ఉన్నాయి. వాటి గురించే ప్రభుత్వాలు ప్రస్తావించట్లేదు.

ఆలోచన కొత్తదేం కాదు : ఎన్‌ శ్రీకుమార్‌, సభ్యులు, ప్రయాస్‌ ఎనర్జీ గ్రూప్‌
వ్యవసాయానికి కొత్త డిస్కం ఏర్పాటు అనేది కొత్త ఆలోచనేం కాదు. గతంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఓ కంపెనీ కూడా పెట్టారు. అయితే అది ఫంక్షన్‌ కాలేదు. మహారాష్ట్రలో ఇలాంటి ఆలోచనే చేశారు. అక్కడి రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) దీనిపై ఆర్డర్‌ కూడా ఇచ్చింది. దానిలో కొన్ని వివరాలు ఉన్నాయి. అగ్రికల్చర్‌కు, ఇతర కేటగిరీలకు వేర్వేరు ఫీడర్లు, నెట్‌వర్క్‌, సబ్‌స్టేషన్లు ఉండాలని పేర్కొన్నారు. అయితే అక్కడ దాదాపు 60 శాతం ఫీడర్ల విభజన జరిగినా, అమల్లో సాధ్యంకాదనే ఉద్దేశ్యంతో ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టారు. తెలంగాణలో అసలు ఫీడర్ల సపరేషనే ప్రారంభంకాలేదు. అందువల్ల కొత్త డిస్కం ఏర్పాటు కష్టమే!

వినియోగదారులకు ఒరిగేదేం లేదు : ఎమ్‌ తిమ్మారెడ్డి, విద్యుత్‌రంగ నిపుణులు
సబ్సిడీల కోసమే ప్రత్యేక డిస్కం ఏర్పాటైతే విద్యుత్‌ సరఫరా నాణ్యత దెబ్బతింటుంది. ప్రభుత్వం సకాలంలో సబ్సిడీలు విడుదల చేయకుంటే, ఆర్థిక క్రమశిక్షణ కోల్పోవాల్సి వస్తుంది. విద్యుత్‌ నియంత్రణా మండలి (ఈఆర్సీ) 20 ఏండ్లుగా వ్యవసాయ ఫీడర్లను సపరేషన్‌ చేయాలని చెప్తుంది. ఆ పని ఇప్పటి వరకు ప్రారంభమే కాలేదు. ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యమౌతుంది? పంపిణీ వ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుంది. ప్రత్యేక డిస్కం ఏర్పాటు వల్ల విద్యుత్‌ వినియోగదారులకు ఒరిగేదేం లేదు.

ఏం చేస్తారో చూడాలి : ఎమ్‌ వేణుగోపాలరావు, కన్వీనర్‌, సెంటర్‌ ఫర్‌ పవర్‌ స్టడీస్‌
ప్రభుత్వం కొత్త డిస్కం ఏర్పాటు చేయడం ఆషామాషీ కాదు. పూర్తిగా సబ్సిడీలతో డిస్కం ఏర్పాటు అసలు సాధ్యం కాదు. దీనిపై విస్త్రుత ప్రచారం, అధ్యయనం జరగాలి. ఎలాంటి విధివిధానాలు ఏర్పాటు చేస్తారో చూడాలి. సబ్సిడీల కోసమే ప్రత్యేక డిస్కం ఏర్పాటైతే, విద్యుత్‌ వినియోగదారుల హక్కులు హరించబడతాయి. 2003 విద్యుత్‌ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -