చరిత్ర వెనక్కు నడుస్తుందనీ/ధరిత్రి బల్లపరుపుగా వుందని/నరుడు మళ్లీ వానరుడవుతాడనీ/నమ్మని ఆశావాదులం మేం/ మా ఆశయం ఎప్పటికీ అజేయమే!
దాదాపు 35 ఏండ్ల కిందట సోవియట్ పరిణామాల నేపథ్యంలో నేను రాసిన కవితలో మొదటి వాక్యాలివి. ఇందులో మొదటి చరణం చరిత్రనూ రెండో చరణం శాస్త్ర విజ్ఞానాన్ని,మూడో చరణం పరిణామ క్రమాన్ని, నాలుగో చరణం సైద్ధాంతిక విశ్వాసాన్ని ప్రకటించాయి. వీటన్నిటితో కూడిన ఆశయం అజేయం అన్నది ఆఖరివాక్యం. సమాజ గమనంలో ఆ శాస్త్రీయ సిద్ధాంత ప్రస్థానం ఎంత నిజమో ఈ వారం చాలా పరిణామాలు తెలియజెప్పాయి. మరెవరో ఎందుకు? -న్యూయార్క్ మేయర్‌గా జోహ్రానీ మమ్దానీ అఖండ విజయం సాధించాక ‘న్యూయార్క్ క్యూబా అయిపోయిందని’ ప్రపంచ డాన్- డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. న్యూయార్క్ వాసులందరూ ఫ్లోరిడా పారిపోవాలని పలాయన మంత్రం కూడా పఠించారు ఆయన. ఇప్పటిదాకా ప్రపంచాన్ని బెదిరిస్తూ వస్తున్న ట్రంప్ మమ్దానీ తొలి ప్రసంగం కోపోద్రేకంతో వుందని వాపోయారు. ‘తను నా పట్ల మరింత నాజూగ్గా(నైస్‌గా) వుండాల్సిందని’ వేడుకున్నారు. అతి దగ్గరలో వున్న సోషలిస్టు క్యూబాను అణగదొక్కాలని ఆంక్షలతో ఇప్పటికీ వేదిస్తున్న అమెరికా అధ్యక్షుల వారు దేశంలోనే ప్రధాన నగరమైన న్యూయార్క్ క్యూబాగా మారిపోయిందని గగ్గోలు పెట్టడం చరిత్ర విచిత్రమే. దాదాపు 88 లక్షలు పైబడిన జనాభాతో అమెరికాలో అతి పెద్ద నగరంగా వున్న బిగ్ ఆపిల్ న్యూయార్క్‌ను ప్రపంచ వాణిజ్య ఆర్థిక సాంస్కృతిక మీడియా రాజధానిగా చెబుతుంటారు. అలాటి మహాకీలక నగరం ఇప్పుడు ఒక సోషలిస్టు డెమోక్రాట్ జోహ్రాన్ మమ్దానీ పాలనలోకి రావడం అంతర్జాతీయంగానే సంచలనం సృష్టిస్తోంది.ప్రపంచం సోవియట్ అక్టోబర్ విప్లవం 110 వార్షికోత్సవం జరుపుకుంటున్న రోజునే అమెరికా గుండెకాయ వంటి న్యూయార్క్ సోషలిస్టు మేయర్‌ను ఎన్నుకోవడం కుంభస్థలం కొట్టడం వంటిదే. వాస్తవాలు కల్పనకన్నా చిత్రంగా వుంటాయంటా రందుకే.
ధనరాశులే గుమ్మరించినా…
జోహ్రాన్ మమ్దానీ డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీలను దాటుకుని మేయర్ అభ్యర్థిగా వచ్చిన నాటినుంచి అమెరికా ఆధిపత్య వర్గాలు హడలిపోతూనే వున్నాయి. రిపబ్లిక్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ గవర్నర్ కుర్దిస్ సిల్వా ఆయన్ను ఎదుర్కొనడానికి పనికిరాడని స్వయంగా ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి ఆండ్రూ క్యూమాను బలపర్చాడు.26 మంది సహస్ర కోటీశ్వరులు,ఆధిపత్య కుటుంబాలు మమ్దానీ అభ్యర్థి కాకుండా చూసేందుకు, ఆయ్యాక ఓడించేందుకు 2.20 కోట్ల కోట్ల డాలర్ల్లకు పైగా ఖర్చు చేశాయని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది.బ్లూంబర్గ్ అధినేత మైకెల్ బ్లూంబర్గ్ ఒక్కడే క్యూమా అభ్యర్థిత్వం కోసం 80 లక్షల డాలర్లు ఖర్చు చేశాడు.అయితేనేం, ఇవన్నీ విఫలమవ్వక తప్పలేదు. ఇంత పెద్ద ధనాఢ్య శక్తులు మీడియా మొఘల్స్‌తో పోలిస్తే జోహ్రాన్ మమ్దానీ కేవలం పేద మధ్యతరగతి వర్గాలు, శ్రామిక ప్రజల అండదండలతోనే ఇంతటి విజయం సాధించడం ఒక రికార్డే. పైగా తను భారతీయ(గుజరాతీ)మూలాలతో ఉగాండాలో పుట్టిన ఒక ముస్లిం. ఓ దక్షిణాసియా ముస్లిం న్యూయార్క్ మేయర్ కావడమే సంచలనమైతే రాజకీయంగా సోషలిస్టు భావాలు గల వ్యక్తి. వయసును బట్టి చూస్తే 34 ఏండ్ల అతిచిన్న మేయర్. ఆయన తల్లి మీరానాయర్ కూడా ప్రత్యామ్నాయ భావజాలానికి ఫెమినిస్టు చిత్రాలకు ప్రపంచ పురస్కారాలు పొందిన ప్రతిభావంతురాలు. ఈ నేపథ్యంతోనే జోహ్రాన్ కార్పొరేట్ ప్రపంచీకరణ ప్రయివేటీకరణల తాకిడికి తల్లడిల్లుతూ ట్రంప్ విచ్చలవిడి బాదుళ్లతో బాధలపాలైన సగటు మనుషుల కోసం ప్రజానుకూల ప్రణాళిక ప్రకటించగలిగారు. ఇజ్రాయిల్ గాజాలో సాగించే మారణకాండను ఖండించడమే గాక భారత దేశంలో మోడీ పాలనలో లౌకికతత్వంపై సాగుతున్న దాడులతో విడగొట్టుకున్న లౌకికవాది. విజయం తర్వాత తొలి ప్రసంగంలో జవహర్‌లాల్ నెహ్రూను ప్రస్తావించడం ద్వారా నేరుగా సంఘ పరివార్ మతతత్వ రాజకీయాలను తోసిపుచ్చిన ధీశాలి. అణచివేతకు గురైన ప్రజానీకం నిలదొక్కుకునే రోజు వస్తుందంటూ నెహ్రూ స్వాతంత్ర దినాన చేసిన ప్రసంగం వాస్తవానికి జోహ్రాన్‌కు గొప్పగా గెలిపించిన పేద వర్గాలన్నిటికీ వర్తిస్తుంది.
ప్రజానుకూల కార్యక్రమం
నిరుద్యోగం, పనిగంటల పెంపు, అంతులేని పనిఒత్తిడి, తొలగింపుల కత్తితో అభద్రతలో ముంచిన ట్రంప్ పాలనకు సరైన ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలను చేపడతానని మమ్దానీ ఇచ్చిన హామీలు ప్రపంచమంతటా పరిశీలకులను ఆకర్షించాయి. ప్రపంచదేశాలన్నిటినుంచి వచ్చిన శ్రామికుల వలస శ్రామికుల చెమటతో నిర్మితమైన న్యూయార్క్(అన్ని నగరాలలాగే) మహాకుబేరుల స్వర్గధామంగా మారింది. దేశంలోనూ, ప్రపంచంలోనూ కూడా జాతుల దేశాల అణచివేతకు కేంద్ర బిందువుగా తయారైంది. ఈ మధ్య ట్రంప్ దుందుడుకు విధానాలతో వారి ఉనికికే ఉపద్రవమేర్పడింది. ఈ నిరంకుశత్వమే వారిని జోహ్రాన్‌ను బలపర్చేలా చేసింది.ఇజ్రాయిల్ జాత్యహంకార నరమేధాన్ని గట్టిగా ఖండించిన ఆయన బాలీవుడ్ పాటలు, డైలాగులతో ఆకర్షణీయమైన ప్రచార పద్ధతి పాటించడం కూడా ఏషియన్లను ఆకట్టుకుంది. అంతులేని అగాథం లాంటి ఆదాయ వ్యత్యాసాలు పెరిగిన అమెరికాలో సంపద పున:పంపిణీ జరగాలని ఆయన నినాదం తీసుకున్నాడు. అందుబాటు కల్పించడం (ఆఫర్డబిలిటీ) అన్న ఆయన నినాదం ట్రంప్ దాడికి ఓడించే విరుగుడుగా కనిపించింది. భయంకరంగా పెరిగిపోయిన అద్దెల కారణంగా స్వంత ఇండ్లు కట్టుకోలేని లక్షలాది కుటుంబాలకు జోహ్రాన్ ప్రతిపాదించిన అద్దె నియంత్రణ,స్తంభన ఆలోచన గొప్పగా నచ్చేసింది.నగరంలో కనీసం పదిలక్షల కుటుంబాలకు ఇది ఉపయోగకరమని భావిస్తున్నారు, (మన దేశంలోనూ ప్రధాని ఆవాస్ యోజన,టిడ్కో ఇండ్లు,డబల్ బెడ్‌రూంలు, ఇందిరమ్మ ఇండ్లు ఇలా ఎన్ని చెప్పినా నిర్మాణం, అప్పగింత ఎప్పటికీ అసంపూర్తిగా ఉంటోంది) అమెరికాలో అందరికీ కార్లుంటాయనే అంచనాలు ఎలా వున్నా ఉచిత రవాణా కల్పిస్తానని చెప్పడం మరింత నచ్చింది.ఇప్పటికే స్కాండినేవియన్ దేశాల్లో ఈ సదుపాయం వుంది. బ్రెజిల్‌లోని 116 నగరాలలో పౌరుల ప్రయాణం పూర్తిగా ఉచితం. టర్కియే రాజధాని ఇస్తన్‌బుల్‌లోనూ, ఆస్ట్రేలియాలో అమెరికాలో కొన్ని నగరాలలోఈ అవకాశం వుంది. మహిళలు, విద్యార్థులు, యువతకు ఉచిత రవాణా ఉత్పత్తిని ఉపాధిని పెంచుతుందని రుజువైంది, కర్నాటక, ఢిల్లీ, తెలంగాణ, ఏపీతో సహా మన దేశంలోనూ వివిధ రకాలుగా ఈ అవకాశం కల్పిస్తున్నారు.జోహ్రాన్ దీన్ని న్యూయార్క్‌లోనూ ప్రవేశపెట్ట బోతున్నారు. వీటితో పాటే కీలకమైన మరో కొత్త ఆలోచన ప్రభుత్వ కిరాణా దుకా ణాలు పెట్టడం, విపరీతంగా పెరిగిన ధరల కారణంగా అల్లాడిపోతున్న పేద దిగువ వర్గాలకు ముఖ్యమైన సరు కులు సరసమైన ధరలకు అందుబాటులో తెచ్చేందుకు షాపులు ఏర్పాటు చేస్తారు. మొదటి విడతగా అయిదుచోట్ల ఇవి ఏర్పాటవుతాయి. ఇవన్నీ వింటుంటే మనం చూస్తున్న సంక్షేమ చర్యలు ఉచితాల వంటి విచిత్ర వాదనలు గుర్తుకు రావచ్చు. వీటన్నిటికీ తార్కిక సమర్థనగా జోహ్రానీ సోషలిస్టు భావజాలం తీసుకొచ్చి కొందరే అన్నీ అను భవించడం సరికాదని గట్టిగా ప్రచారం చేయడం ప్రజలకు నచ్చింది. గతంలోనూ అమెరికాలో బిన్నీ శాండర్స్,బ్రిటన్‌లో జెర్మీ కార్బిన్ వంటివారు తమదైన పద్ధతుల్లో సంక్షేమ విధానాలు ప్రతిపాదించారు. స్వతహాగా అమెరికాలో పుట్టలేదు గనక అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఆయనకు వుండకపోయినా భవిష్యత్ పరిణామాల్లో కీలక ప్రభావం వుంటుందనే అంచనా వేస్తున్నారు.
సానుకూల సంకేతాలు
వామపక్షాలకు కమ్యూనిస్టులకు సంతోషం కలిగించే మరికొన్ని పరిణామాలు కూడా ఈ వారంలోనే సంభవించడం ఆసక్తికరం, వాటిలో చాలా కీలకమైంది నేపాల్‌లో కమ్యూనిస్టు పార్టీలు ఒక తాటిమీదకు రావడం. గతంలో వారు కలవడం, కలసి అధికారం చేయడం విడిపో వడం, వంటివి చాలాసార్లు జరిగాయి. మూడు మాసాల కిందల అకస్మాత్తుగా మొదలైన జన్‌జెడ్ నిరసన వెల్లువతో ప్రధాని రాజీనామా, పార్లమెంటు రద్దు కూడా తెలిసినవే, మార్చిలో ఎన్నికలకు నేపాల్ సిద్ధమవుతున్నది. ఈ సమయంలో తొమ్మిది వామపక్షాలు కలిసి ఒకటిగా ఏర్పడాలని నిర్ణయించాయి. మావోయిస్టు అనే మాట తొలగించాలని నిర్ణయిస్తూ మార్క్కిజం- లెనినిజం మార్గదర్శకంగా పనిచేస్తామన్నారు. అక్కడ మరో పెద్ద పార్టీ యుఎంఎల్ మాత్రం కలవలేదు. మిగతా లోతుపాతులు ఎలా వున్నా వివిధ కమ్యూనిస్టు బృందాలు,పక్షాలు ఒక్కతాటిపైకి రావడం నేపాల్‌లో ప్రజాస్వామిక శక్తులకు ప్రయోజనం కలిగిస్తుందని మాత్రం అంచనా వేస్తున్నారు. గతేడాదే శ్రీలంక అధ్యక్షునిగా అనూర కుమార డిసనాయకే ఎన్నిక కావడం గుర్తుండే వుంటుంది. దక్షిణ అమెరికాలోనూ పలుచోట్ల వామపక్ష నేతలు విజయం సాధించారు.
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూయూనివర్సీటీలో అనేక పోరాటాలు అణచివేతల తర్వాత వామపక్ష సంఘాలు విజయం సాధించడం కూడా ఈ పరంపరలోదే. కాగా కేరళలో రెండోసారి వరుసగా ఎన్నికై మూడో దఫాకు దూసుకుపోతున్న పినరాయి విజయన్ ప్రభుత్వం అతి పేదరిక నిర్మూలన(ఇపిఇపి) అమలులో విజయం సాధించడం, అందుకు అనుసరించిన ప్రణాళికా బద్దవిధానాల విజయం కూడా ఈ వరసలో చెప్పుకోదగిందే. కేరళలో అక్షరాస్యత,ఆరోగ్యపరిరక్షణతో సహా మానవాభివృద్ధి సూచికల్లో సాధించిన అసాధారణ అభివృద్ధి కూడా ప్రత్యామ్నాయ విధానాల ఫలితమే. నిజానికి 2024 ఎన్నికల్లోనే మోడీ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది.ఎన్నికల సంఘం అండతో గట్టెక్కుతుందనే విమర్శలు బాహాటంగానే ఎదుర్కొంటోంది. స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవారు నిరసన ప్రకటించారు.
మరో ప్రపంచం మరవొద్దు..
జోహ్రాన్ మమ్దానీ విజయం యూరప్‌లోనూ ప్రపంచమంతటా కూడా ప్రగతివాదులకు గొప్ప ఉత్సాహ మిచ్చింది.రష్యా కమ్యూనిస్టుపార్టీ ఈ విజయాన్ని స్వాగతించింది. బ్రిటన్‌లో గ్రీన్ పార్టీ,జర్మనీలో సోషల్ డెమెక్రటిక్ పార్టీ హర్షం వెలిబుచ్చాయి, ఈ విజయాన్ని మార్క్సిజం గెలుపుగా అమెరికాలో ఫాక్స్ న్యూస్ వంటి కొన్ని మీడియాలు వర్ణించాయి. మరికొన్ని ట్రంప్‌కు చెంపదెబ్బగా పేర్కొన్నాయి. ఎనభయ్యవ దశకంలో రోనాల్డ్ రీగన్, మార్గరెట్ థాచర్ వంటివారు ప్రవేశపెట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకతకు నూతన సహస్రాబ్దిలో ప్రపంచీకరణ తోడై మితవాద అభివృద్ధి నిరోధక శక్తులు చెలరేగిన మాట నిజం, అనేక నష్టాలు కూడా కలిగించిన మాట వాస్తవం. అయితే వాటికి ఇక తిరుగులేదనే వాదనకు మాత్రం వాస్తవ పరిణామాలు గండికొడుతున్నాయి.శ్రీశ్రీ చరణాలను అన్వయిస్తూ ఆరుద్ర రాసిన పున:ప్రస్థానం గుర్తుకువస్తుంది.
ధనాడ్యులంతా ధరాధిపతులై/జనాన్ని దోపిడి చేస్తుంటే/వర్గకలహమే వద్దని చెప్పే/దుర్గతి టక్కున చాలించు..మనస్సు మారిన వయస్సు మళ్లిన/మహానాయకులు మనకొద్దు/తాతల తండ్రుల ఆదర్శాలను/తాకట్టుకు గుట్టుగ పెట్టొద్దు/మరో ప్రపంచం మరో ప్రపంచం/ మరో ప్రపంచం మరవొద్దు!
తెలకపల్లి రవి
ప్రత్యామ్నాయశక్తులకు నూతనోత్సాహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



