కార్మికులను బానిసలుగా మార్చేందుకే ‘శ్రమశక్తి నీతి’ : సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు
నవతెలంగాణ-మహబూబాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘శ్రమశక్తి నీతి-2025’ పేరుతో తెచ్చిన నూతన లేబర్ పాలసీ రాజ్యాంగ విరుద్ధమైందని, ఇది కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర అని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జగన్నాథం భవనంలో అక్టోబర్ విప్లవం 108వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన ‘నూతన లేబర్ పాలసీ-కార్మిక వర్గంపై ప్రభావం’ సెమినార్‌లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మరిన్ని లాభాలు పెంచేందుకు ‘శ్రమ శక్తి నీతి 2025’ పేరుతో నూతన కార్మిక విధానాన్ని అక్టోబర్ 8న పబ్లిక్ డొమైన్‌లో పెట్టిందని తెలిపారు. ఈ నూతన కార్మిక విధానం రాజ్యాంగంలోని సామాజిక న్యాయం, సమానత్వం, శ్రమకు తగిన గౌరవం లాంటి అంశాలకు విరుద్ధంగా ఉందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న కోట్లాదిమంది కార్మికులకు సంబంధించిన అంశాలను కార్మిక సంఘాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా తేవడం అప్రజాస్వామిక చర్య అని తెలిపారు.
దేశంలో నిర్మాణరంగ కార్మికులకు చట్టాలు అమలు కావడం లేదని, రవాణా రంగ కార్మికులకు నిర్దిష్ట పని గంటలు లేకుండా పోయాయని, హమాలీ ఇతర అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, స్కీం వర్కర్లకు కనీస వేతనం అమలు కావడం లేదని విమర్శించారు. నూతన కార్మిక విధానం ప్రకారం నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేసి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చే కుట్ర దాగి ఉందని తెలిపారు. యూనియన్ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, అఖిల భారత స్థాయి వరకు సీఐటీయూ మహాసభలు 2026 జనవరి లోపు జరుగనున్నాయని తెలిపారు. ఈ మహాసభల్లో లేబర్ కోడ్‌ల రద్దు, కార్మిక హక్కుల పరిరక్షణ, కార్మిక చట్టాలు అమలుకై తగిన కార్యాచరణ రూపొందించనున్నట్టు చెప్పారు. ఈ సెమినార్‌లో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్‌రావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు, జిల్లా నాయకులు కుమ్మరికుంట్ల నాగన్న, సమ్మెట రాజమౌళి, దుండి వీరన్న, పోతుగంటి మల్లయ్య, ధార స్నేహబిందు, వెలిశాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
నూతన లేబర్ పాలసీ రాజ్యాంగ విరుద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



