కంగ్టీ, సిర్గాపూర్ మండలాల్లో భూ దందా
రైతుల నుంచి అగ్రిమెంట్ చేసుకుని మోసం
రెవెన్యూ కార్యాలయాల వద్ద అధికారుల హెచ్చరిక బోర్డులు
రోడ్డు భూమి అంటూ కొనుగోలుదారులకు బురిడీ
25శాతం డబ్బు వసూలు చేసి ఆ తర్వాత మాయం
డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్న దళారులు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టీ, సిర్గాపూర్ మండలాల్లో భూ దళారులు రెచ్చిపోతున్నారు. లేని భూములు ఉన్నట్టు చూపిస్తూ విక్రయాలు చేపడుతున్నారు. రైతులతో భూములకు మంచి ధర ఇప్పిస్తామంటూ బేరాలు మాట్లాడుకుని వారి నుంచి పాస్ బుక్కులు తీసుకుని విక్రయాలు చేస్తున్నారు. రైతుల నుంచి తీసుకున్న పాస్ బుక్కులను చూపిస్తూ కోట్లల్లో ధర పలికే భూములను కేవలం లక్షల్లో ఇస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని హైదరాబాద్ లాంటి పట్టణాల్లో నివాసముంటన్న వారు కొందరు కొనుగోలుకు ముందుకు వస్తే వారి నుంచి 25శాతం అగ్రిమెంట్‌తో భూములను అమ్ముతూ రిజిస్ట్రేషన్ సమయానికి మధ్య దళారులు మాయమవుతున్నారు.
ఇటీవల కాలంలో ఇలాంటి భూముల విక్రయాలు ఎక్కువై మోసపోయిన కొనుగోలుదారులు పోలీసు స్టేషన్లలో కేసులు పెడుతున్నారు. కంగ్టీ, సిర్గాపూర్ మండలాల్లో ఈ తరహా కేసులు ఎక్కువ కావడంతో పోలీసులు కొనుగోలుదారులను హెచ్చరిస్తూ.. అసలు రైతులను సంప్రదించి భూములు కోనుగోలు చేయాలని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో కొందరు దళారులు భూములు విక్రయిస్తామని చెబుతూ రైతుల పాస్ బుక్కులపై ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ మేమే భూ యజమానులమని మోసం చేస్తున్నారని బోర్డులు పొందుపర్చారు. కొందరు దళారులు ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారని, భూములు కొనాలనుకున్నవారు తహసీల్దార్ కార్యాలయాల్లో కానీ, భూములకు సంబంధించిన కాగితాలు పరిశీలించుకుని కొనాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్‌కు దగ్గరగా ఉందంటూ మోసం..
కంగ్టీ మండలం హైదరాబాద్‌కు దగ్గరగా ఉందంటూ.. తక్కువ ధరకు భూములు అమ్ముతామంటూ కొందరు దళారులు కొనుగోలు చేసేవారికి ఆశ చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. రోడ్డు భూమి ఉందంటూ ఎక్కడో దూరంగా భూములను విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. రైతులకు వారి భూములకు ఎక్కువ ధర వస్తుందంటూ వారి వద్ద నుంచి పాస్ బుక్కులు తీసుకుని.. ఆ బుక్కుల్లో వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి భూమి కొనుగోలుదారులకు మేమే అసలైన యజమానులమంటూ బురిడీ కొట్టిస్తున్నారు.
రెవెన్యూ కార్యాలయాల ముందు హెచ్చరిక బోర్డులు..
కంగ్టీ, సిర్గాపూర్ మండలాల్లో భూములకు సంబంధించిన ఫిర్యాదులు పెద్దఎత్తున రావడంతో పోలీసులు రెవెన్యూ కార్యాలయాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ బోర్డులో నారాయణఖేడ్ డివిజన్‌లోని కంగ్టీ, సిర్గాపూర్ మండలాల పరిధిలో భూములు కొంటున్న వారికి హెచ్చరిక చేశారు. కోనేవారు ముందు భూమి గురించి గ్రామ, మండల, డివిజన్ ప్రజా ప్రతినిధుల ద్వారాగానీ, అధికారుల ద్వారాగానీ, రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించి ప్రస్తుత మార్కెట్ రేట్ తెలుసుకుని కొనాలని పోలీసులు హెచ్చరించారు.



